న్యాయవాదుల రక్షణ చట్టం రూపొందించాలి..

ABN , First Publish Date - 2022-08-03T05:29:40+05:30 IST

న్యాయవాదుల రక్షణ చట్టం రూపొందించాలి..

న్యాయవాదుల రక్షణ చట్టం రూపొందించాలి..
హనుమకొండలో ర్యాలీ నిర్వహిస్తున్న న్యాయవాదులు

 బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌

వరంగల్‌ లీగల్‌, ఆగస్టు 2: సమాజహితం కోసం పనిచేస్తున్న న్యాయవాదులను అమానుషంగా హత్య చేయడం హేయమైన, పిరికిపంద చర్య అని జిల్లా బార్‌ అసోసియేషన్‌ అభివర్ణించింది. ములుగు జిల్లాలో సీనియర్‌ న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య న్యాయవాద సమాజాన్ని నివ్వెర పరిచిందని అసోసియేషన్‌ పేర్కొంది. సోమవారం సాయంత్రం మలుగు-మల్లంపల్లి మధ్య మల్లారెడ్డి కారును ఆపి అతికిరాతంగా కత్తులతో పొడిచి చంపిన విషయం తెలిసిందే. మంగళవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ అసోసియేషన్‌ హాలులో మల్లారెడ్డి మృతిపట్ల సంతాప కార్యక్రమాన్ని నిర్వహించి ఆయనకు నివాళులర్పించారు. అంతకుముందు హనుమకొండ జిల్లా జడ్జి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్జిలు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.ఆనంద్‌మోహన్‌, ప్రభుత్వ న్యాయవాది టి.శ్యాంసుందర్‌రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. 

బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయవాదులు మాట్లాడుతూ.. న్యాయవాదులపై వరుసదాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే న్యాయవాదుల రక్షణకు రక్షణచట్టం రూపొందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. సౌమ్యుడు, మల్లారెడ్డిని పాశవికంగా హత్య చేయడం గర్హనీయమని న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.ఆనంద్‌మోహన్‌ అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు దుస్సా జనార్దన్‌, బైరపాక జయాకర్‌, న్యాయవాదులు కె.అంబరీ్‌షరావు, కె.నర్సింహారావు, తాళ్లపెల్లి జనార్దన్‌, మాతంగి రమేశ్‌, చిల్లా రాజేంద్రప్రసాద్‌, తదితరులు పాల్గొని ప్రసంగించారు. 

ర్యాలీ, ధర్నా

సంతాప కార్యక్రమ అనంతరం న్యాయవాదులు జిల్లా కోర్టు నుంచి కాళోజీ సెంటరు మీదుగా అమరవీరుల స్థూపం వద్దకు ర్యాలీ నిర్వహించారు. స్థూపం వద్ద మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన కేసు విచారణ జరుపాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-08-03T05:29:40+05:30 IST