శివారులో శివాలెత్తి..

ABN , First Publish Date - 2021-10-24T06:13:42+05:30 IST

శివారులో శివాలెత్తి..

శివారులో శివాలెత్తి..
పాయకాపురంలోని ఓ బార్‌లో ఉదయం 7 గంటలకు మద్యం అమ్మకాలు

పొద్దుపొడవక ముందే మద్యం అమ్మకాలు

అర్ధరాత్రి దాటినా ఆగని విక్రయాలు 

24 గంటలూ తెరిచే ఉంటున్న బార్‌ అండ్‌ రెస్టారెంట్లు

మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ అధికారులు

కోడి కంటే ముందే నిద్రలేచి.. మత్తుగా మందుకొట్టి.. ప్రతిపూటా పూటుగా సేవించి.. అర్ధరాత్రి దాటినా తందనాలాడి.. రోడ్డుపైనే ఎవరో ఒకరిని కొట్టి.. ఇంటికెళ్లి భార్యను కొట్టి.. తిరిగి ఉదయం లేచిలేవడమే బార్‌కు పరిగెత్తే మందుబాబులు శివారులో శివాలెత్తిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సమయపాలన లేకుండా పాయకాపురంలో సాగుతున్న మందు విక్రయాలు స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. 

పాయకాపురం, అక్టోబరు 23 : నగర శివారు పాయకాపురంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు నిబంధనలకు పాతరేస్తున్నాయి. 24 గంటలూ మద్యం సరఫరా కేంద్రాలుగా మారుతున్నాయి. పాయకాపురం ప్రాంతంలో పైపులరోడ్డు నుంచి వాంబేకాలనీ, ప్రకాశ్‌నగర్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వరకు ఏడు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో మూడు అధికార పార్టీ నేతలవి. మిగిలినవి ఇతరులవి. నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకే మద్యం అమ్మకాలు జరగాలి. కానీ, వీటిలో ఏ ఒక్క బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిబంధనలు పాటించట్లేదు. పొద్దు పొడవకముందే (ఉదయం 6 గంటలకే) అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. అర్ధరాత్రి 12.30 వరకు అమ్ముతున్నారు. 

క్వార్టర్‌ బాటిళ్లు బయటకు..

నిబంధనల ప్రకారం బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో తాగే వారికే మద్యం అమ్మకాలు జరపాలి. అదీ పెగ్గుల లెక్కల్లో సరఫరా చేయాలి. అయితే, వైన్‌ షాపులకు ధీటుగా క్వార్టర్‌ బాటిళ్లను బయటకు విక్రయిస్తున్నారు. సీల్‌ను, స్టిక్కర్లను తొలగించి బయట అమ్మేస్తున్నారు. 

దొంగచాటుగా.. 

మద్యం అక్రమ అమ్మకాలకు ప్రతి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంది. సాధారణంగా ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు షట్టర్లు తీసి, సమయం పూర్తవగానే షట్టర్లను మూసేసి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకున్న గేట్ల నుంచి అమ్మకాలు జరుపుతున్నారు. మరికొన్ని బార్ల యజమానులైతే ఏకంగా పక్క గేట్లు తీసేసి మందుబాబులను ఆహ్వానించి బార్లలో కూర్చోబెట్టి తాగించేస్తున్నారు. ప్రతి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు సమీపంలో మనుషులను పెట్టి మద్యం అమ్మిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కొద్దికొద్దిగా సరుకును చేరవేస్తున్నారు. బెల్ట్‌ షాపులను తలదన్నేలా ఈ వ్యాపారం సాగుతోంది. 

అనధికార పార్కింగ్‌తో అవస్థలు

స్థానికంగా ఏ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కూ ఇక్కడ పార్కింగ్‌ సదుపాయం లేదు. పదుల సంఖ్యలో వాహనాలను రోడ్లపైనే నిలిపి బార్లలోకి వెళుతున్నారు. పార్కింగ్‌ సదుపాయం లేకపోవడం, మందుబాబులు రోడ్లపై వాహనాలు పెట్టి వెళ్లిపోవడంతో పలుచోట్ల రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అదేమని అడిగితే మందుబాబులు గొడవలకు దిగుతున్నారు. పార్కింగ్‌ సదుపాయం లేకుండా బార్లకు అనుమతి ఇవ్వడం, సమయపాలన లేకుండా మద్యం అమ్మకాలు జరుపుతుండటం, క్వార్టర్‌ బాటిళ్ల స్టిక్కర్లు, సీల్స్‌ తీసేసి బయటకు అమ్ముతుండటం వంటి నిబంధనలు అతిక్రమిస్తున్నా ఏ అధికారి నోరు మెదపట్లేదు. మామూళ్లు చేరుతుండటం వల్లే అధికారులు పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.






Updated Date - 2021-10-24T06:13:42+05:30 IST