ఆ పది లక్షల మాటేంటి?

ABN , First Publish Date - 2020-11-25T05:03:22+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త మద్యం విధానం కారణంగా బార్ల నిర్వాహకులు భారీగా నష్టపోయారు.

ఆ పది లక్షల మాటేంటి?

బార్‌ లైసెన్సుల కోసం రూ.10 లక్షల చలానా

గడువు పొడిగించి మరీ దరఖాస్తులు

ఏడాది కాలంగా తిరిగి ఇవ్వని ప్రభుత్వం

ఏలూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త మద్యం విధానం కారణంగా బార్ల నిర్వాహకులు భారీగా నష్టపోయారు. పాత బార్ల లైసెన్సులు రద్దు చేసి కొత్త బార్లను తెరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం వారికి రెండు విధాలా నష్టం చేసింది. అప్పటికే ఫీజు చెల్లించి చేసుకున్న రెన్యువల్‌ లైసెన్సును రద్దు చేసింది. కొత్త లైసెన్సుల కోసం దరఖాస్తుల పేరుతో ఒక్కొక్కరి నుంచి 10 లక్షలు వసూలు చేసింది. హైకోర్టు తీర్పుతో పాత లైసెన్సులు రెన్యువల్‌ అయినా కొత్త లైసెన్సుల కోసం చెల్లించిన డబ్బు మాత్రం వారికి తిరిగి రావడం లేదు. ఏడాది కాలంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, ఎలాంటి స్పందనా లేకపోవడం వారిని మరింత కలవర పెడుతోంది.


గడువు పొడిగించి మరీ..

పాత బార్ల గడువు మరో ఆరు నెలలు ఉన్నప్పటికీ, మద్యం పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పోయిన డిసెంబర్‌లో పాత బార్లను రద్దు చేసి, కొత్త బార్ల లైసెన్సులకు నోటిఫికేషన్‌  ఇచ్చింది. అప్పటికి జిల్లాలో 38 బార్లు ఉండగా, కొత్తగా 25 బార్లకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చింది. లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే వారు రూ.10 లక్షలు ఛలానా తీయాలి. లైసెన్స్‌ వచ్చాక రూ.50 లక్షలు ఫీజు కింద చెల్లించాలి. ప్రభుత్వ గందరగోళ విధానాల వల్ల అప్పటికే నష్టాల్లో వున్న పాత బార్ల నిర్వాహకులు కొత్త లైసెన్సుల కోసం ఆసక్తి చూపలేదు. దీంతో నిర్ణీత గడువు నాటికి 25 బార్లకు 14 దరఖాస్తులే వచ్చాయి.దీంతో ప్రభుత్వం మరో మూడు రోజులు గడువు పొడిగించింది. ఎక్సైజ్‌ అధికారులు పాత నిర్వాహకులు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించారు. దీంతో ఈ మూడు రోజుల్లో మరో 29 కొత్త దరఖాస్తులు వచ్చాయు. మొత్తం 43 మంది రూ.10 లక్షల చొప్పున 4.3 కోట్ల ఛలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు. అంతే! ఈ రోజు వరకూ వారి డబ్బు వారికి తిరిగి రాలేదు. 


స్పందన లేని ప్రభుత్వం

కొత్త నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేయడంతో తమ లైసెన్సు డబ్బులు తమకు తిరిగి వస్తాయని ఆశించిన వారికి చుక్కెదురైంది. కోర్టు కేసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం వారి డబ్బు తిరిగి చెల్లించకుండా నిలిపివేసింది. కేసులు తేలాకే డబ్బు ఇస్తామని చెబుతోంది. నోటిఫికేషన్‌ రద్దయిన తరువాత హైకోర్టు కేసుతో పనేంటనేది బాఽధితులకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ప్రభుత్వాన్ని, ఎక్సైజ్‌ అధికారులను ఎన్ని సార్లు వేడుకున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో నష్టాల్లో వున్న తమతో కూడా ఛలానాలు కట్టించి, తిరిగి ఇవ్వకపో వడంపై బార్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అప్పులు తెచ్చి కొత్తగా లైసెన్సులకు ఛలానాలు తీసిన ఔత్సాహికుల వేదనకు అంతే లేదు.


ప్రభుత్వం నుంచి సమాచారం లేదు

సురేశ్‌బాబు, ఇన్‌చార్జి ఉప కమిషనర్‌

ప్రభుత్వం నుంచి ఈ చలానాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. బాఽధితుల వినతులపై ప్రభుత్వం సానుకూ లంగానే స్పందిస్తుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

Updated Date - 2020-11-25T05:03:22+05:30 IST