అమృత్‌ సరోవర్‌తో జలవనరుల సంరక్షణ

ABN , First Publish Date - 2022-08-07T05:42:35+05:30 IST

అమృత్‌ సరోవర్‌ పథకంతో జలవనరులను సంరక్షించాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ తెలిపారు.

అమృత్‌ సరోవర్‌తో జలవనరుల సంరక్షణ
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌

ఎంపిక చేసిన 75 చెరువులను అభివృద్ధి చేయాలి

ఉపాధి నిధులు రూ.2 కోట్లతో 10 చెరువుల అభివృద్ధి

పనుల పురోగతి సమీక్షలో కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ 

బాపట్ల, ఆగస్టు 6: అమృత్‌ సరోవర్‌ పథకంతో జలవనరులను సంరక్షించాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ తెలిపారు. ఈ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై శనివారం కలెక్టరేట్‌లో డ్వామా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న చెరువులను వినియోగంలోకి తీసుకురావడానికి  కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. 2023 ఆగస్టు నాటికి జిల్లాలో ఎంపిక చేసిన 75 చెరువులను అభివృద్ధి చేయాలన్నారు. జిల్లాలో 10 చెరువులను ఉపాధి హామీ పఽథకం కింద రూ.2 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. వీటిని ఆగస్టు 10న ప్రారంభించాలన్నారు. చెరుకుపల్లిలోని చెరువును 2 లక్షల ఉపాధి నిధులతో అభివృద్ధి చేసి కట్ట చుట్టూ 120 మొక్కలను నాటడం అభినందనీయమన్నారు. సమావేశంలో డీఆర్వో పెద్ది రోజా, డ్వామా పీడీ వై.శంకర్‌నాయక్‌, ప్రకాశం జడ్పీ సీఈవో జాలిరెడ్డి, ప్రకాశం డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు సీనారెడ్డి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. 

పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి

స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ లక్ష్యం మేరకు మరుగుదొడ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 406 సామూహిక మరుగుదొడ్లకు 116 మాత్రమే రూఫ్‌ లెవల్‌కు రావడంపై కలెక్టర్‌ అధికారులను నిలదీశారు. ఒక్కొక్క మరుగుదొడ్డి రూ.3 లక్షలతో నిర్మిస్తుండగా పనుల జాప్యంపై ఆరా తీశారు. పర్చూరులో 87 మరుగుదొడ్లు లక్ష్యం కాగా 25 కూడా పూర్తి చేయకపోవడంపై ప్రశ్నించారు. జలజీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికి కుళాయి కనెక్షన్‌ ఏర్పాటు చేయడంలో పురోగతి సాధించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ జి.జె.బెనర్‌, డీఈలు పాల్గొన్నారు. 

సచివాలయ నిర్మాణాలు పూర్తి చేయాలి 

గ్రామసచివాలయాల భవన నిర్మాణాలను ఈ నెల 31 లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 401 సచివాలయ భవనాలకు 110 మాత్రమే పూర్తయ్యాయన్నారు. రైతుభరోసా కేంద్రాలు 315 మంజూరు కాగా 47 భవనాలు పూర్తయ్యాయని 10 భవనాల పనులు మొదలు కాలేదన్నారు. వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌ భవనాలు 343 మంజూరు కాగా 34 పూర్తయ్యాయన్నారు. 9 భవనాల పనులు మొదలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  134 డిజిటల్‌ లైబ్రెరీలు, 40 బల్క్‌మిల్క్‌ కూలింగ్‌యూనిట్‌ భవన నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో ఎస్‌ఈ ఎ.శ్రీనివాసులు, డీఈలు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-07T05:42:35+05:30 IST