వంద రోజులైనా.. వెతలే

ABN , First Publish Date - 2022-07-13T05:21:36+05:30 IST

వందరోజులు.. లోటుపాట్లు సరిదిద్దేందుకు, పరిస్థితులు చక్కదిద్దేందుకు సరిపోతోంది. అయితే బాపట్ల జిల్లా ఆవిర్భవించి బుధవారానికి వంద రోజులు అవుతున్నా నాటి పరిస్థితుల్లో నేటికీ గోచరిస్తున్నాయి.

వంద రోజులైనా.. వెతలే
బాపట్లలో కలెక్టర్‌ చాంబర్‌ కోసం జరుగుతున్న మరమ్మతు పనులు

నేటికీ జిల్లా ఆవిర్భావం నాటి పరిస్థితులే

నాడు జిల్లా ఏర్పాటులో హడావుడి.. నేడు ఉదాసీనం

సిబ్బంది కేటాయింపుపై దృష్టి సారించని అధికారులు 

కార్యాలయాల్లో సదుపాయాలు.. స్టేషనరీకి కటకట

సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణం మరిచిన ప్రభుత్వం

ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే పలు శాఖల నిర్వహణ 


బాపట్ల జిల్లా ఆవిర్భవించి వంద రోజులు అవుతుంది. అయినా నేటికీ ఆవిర్భావం నాటి పరిస్థితులే ఉన్నాయి. జిల్లా ఏర్పాటులో భాగంగా కార్యాలయాల ఏర్పాటు.. సిబ్బంది కేటాయింపు.. సౌకర్యాలు తదితరాలన్నింట్లోనూ హడావుడే. అయితే నేటికీ ఆ పరిస్థితులేవీ చక్కదిద్దేందుకు ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడంలేదు. కనీస సౌకర్యాలు లేని కార్యాలయాలు.. అరకొర సిబ్బంది.. నిధుల సమస్యలతో వంద రోజులుగా జిల్లాలో పాలన అరకొరగానే సాగుతోంది. నేటికీ పలు కార్యాలయాల్లో మరమ్మతుల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని విభాగాలకు అయితే బోర్డులు పెట్టి వదిలేశారు తప్ప సిబ్బంది కానీ, అక్కడ పనులు జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇంకా పలు శాఖల కార్యాలయాలు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే కొనసాగుతున్నాయి. ఇన్ని బాలారిష్టాల మధ్య అసలు కొత్త జిల్లాల ఏర్పాటు ఉద్దేశ్యమే నీరుగారిపోతోంది. ప్రజలకు పాలనా సౌలభ్యం ఏమో కానీ సిబ్బందే అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయికి పాలనను తీసుకెళ్లి, సత్వర సేవలందించడం కోసమే జిల్లాల ఏర్పాటు చేశామన్నా ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఉన్న సమస్యలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే మరో వందరోజులు గడచినా పరిస్థితి ఇలానే ఉంటుంది. 



బాపట్ల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): వందరోజులు.. లోటుపాట్లు సరిదిద్దేందుకు, పరిస్థితులు చక్కదిద్దేందుకు సరిపోతోంది. అయితే బాపట్ల జిల్లా ఆవిర్భవించి బుధవారానికి వంద రోజులు అవుతున్నా నాటి పరిస్థితుల్లో నేటికీ గోచరిస్తున్నాయి. కార్యాలయాలు, సిబ్బంది, సౌకర్యాలు తదితరాల్లో ఎలాంటి మార్పులేదు. సిబ్బంది విషయంలో స్పష్టత లేదు. సరిపడా కంప్యూటర్లు లేవు. ఫర్నీచర్‌ లేదు. సాక్షాత్తు కలెక్టర్‌ చాంబర్‌ పనులే ఇంకా కొనసాగుతున్నాయి. అప్పట్లో కళాశాల భవనాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయాలు నేటికీ అక్కడే కొనసాగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైనా వాటిని మార్చడంలేదు.. అలాంటి ప్రయత్నం చేయాలనే ఆలోచన కూడా అధికారులు చేయడంలేదు. నిధులు లేక కీలకశాఖల ఖాతాలు బోసిపోతున్నాయి.  కనీసం స్టేషనరీ ఖర్చులకు కూడా ఆయా శాఖలు కటకటలాడున్నాయి. వివిధ సమస్యలపై జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు సకాలంలో సేవలు అందక ఎదురుచూపులు తప్పడం లేదు. సరిపడా సిబ్బంది లేకపోవడం వల్లో , రికార్డులన్నీ ఇంకా ఆన్‌లైన్‌ కాకపోవడం వల్లో ఇలా ఏదో ఒక కారణం చేత ప్రజలకు పనులు వేగంగా అవడం లేదు. ఫీల్డ్‌ మీద తిరిగే సిబ్బంది ప్రభుత్వ వాహనాల్లో పెట్రోలు పోయించుకోవడానికి కూడా కటకటలాడుతున్నారు. నిధులు లేకుండా    ఉన్నతాధికారుల   గొంతెమ్మ కోర్కెలు ఎలా తీర్చాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.


అరకొరగా సిబ్బంది..

జిల్లాలో ఏ విభాగానికి కూడా ప్రతిపాదిత నిష్పత్తిలో సిబ్బంది విధుల్లో చేరలేదు. కేటాయించిన వారు కూడా అవుట్‌సోర్సింగ్‌ వారినే ఇచ్చారు. కీలకమైన గృహ నిర్మాణశాఖకు ఇద్దరు సిబ్బందిని మాత్రమే కేటాయించి మమ అనిపించారు. వ్యవసాయ అనుబంధ విభాగాలది కూడా అదే దారి. మార్కెటింగ్‌ విభాగంలో కేవలం నలుగురితో పని నడిపిస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో వివిధ విభాగాలకు సంబంధించి 30 మంది సిబ్బంది కొరత ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ విభాగాల్లో ఉన్న చాలా మందిని కలెక్టర్‌ కార్యాలయ విధి నిర్వహణకు వేశారు. కొన్ని విభాగాలకు సంబంధించి బోర్డులు పెట్టి వదిలేశారు తప్ప అక్కడ పని జరుగుతున్న దాఖలాలు లేవు. వాటికి ఇన్‌చార్జి అధికారులను ప్రకటించి వదిలేశారు తప్ప మిగతా సిబ్బందిని ఇంతవరకు కేటాయించలేదు. అలాంటి విభాగాల్లో డీఆర్‌డీఏ, లేబర్‌ ఆఫీసర్‌ కార్యాలయాలు ఉన్నాయి.


ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే..

మైనింగ్‌, జడ్పీ, సహకార బ్యాంకులు ఇంకా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే ఉన్నాయి. జడ్పీ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా మిగతావాటి విషయంలో  నాన్చుడు ధోరణిలో ప్రభుత్వం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లది ఇదీ దారే. బీసీ కార్పొరేషన్‌ ఈడీగా ఒంగోలులో పనిచేస్తున్న వెంకటేశ్వరరావును ఇక్కడ ఇన్‌చార్జిగా నియమించారు. ఆయన రెండుసార్లు కార్యాలయ ఏర్పాటు కోసం బాపట్లకు గతంలో వచ్చి రిక్తహస్తంతో వెనుదిరిగారు. ప్రస్తుతం ఆయన తనను ఈ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలంటూ కలెక్టర్‌కు లేఖ ఇచ్చినట్లు సమాచారం. 


ప్రతికూల పరిస్థితుల మధ్యే విధులు

కలెక్టర్‌, ఎస్పీ కూడా ఆవిర్భావం రోజే బాధ్యతలు స్వీకరించారు. వారు కూడా తొలిసారి ఈ హోదాలోకి వచ్చినవారే. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా జిల్లాను మెరుగైన స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికీ కలెక్టర్‌ నివాసం సిద్ధం కాకపోవడంతో చీరాలలోని ఐటీసీ అతిథిగృహంలో బస చేస్తున్నారు. ఎస్పీ సైతం ఆర్‌అండ్‌బీ బంగళాలో ఉంటున్నారు. ఆరంభంలో ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తర్వాత క్షేత్రస్థాయిలో కావాల్సిన అవుట్‌పుట్స్‌ లేకపోవడం వల్లే ఫలితాలు రావడం లేదని గ్రహించి వారికి అన్ని విధాల సహాయ సహకారిస్తున్నారు.   ఎస్పీ సైతం ఎకాఎకిన దాదాపు 19 మంది ఎస్‌ఐలను ఒకేసారి బదిలీ చేసి కిందిస్థాయి సిబ్బందికి హెచ్చరికలు పంపారు. వేమూరులో దురుసుగా ప్రవర్తించిన ఎస్‌ఐను వీఆర్‌కు పంపడంతో పాటు, చెరుకుపల్లి ఎస్‌ఐపై విచారణకు ఆదేశించారు


పట్టించుకోని పాలకులు 

జిల్లా ఏర్పాటుతోనే సరి తప్ప తర్వాత కార్యాలయాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఆయా కార్యాలయాల్లో సిబ్బంది, జిల్లా కేంద్రానికి కావాల్సిన ఇతర సదుపాయాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు విడుదల విషయంలో పాలకపక్ష ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా నుంచి మంత్రిగా ఉన్న మేరుగ నాగార్జున జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి కావాల్సిన నిధులనుగాని , ఉద్యోగుల ఇక్కట్ల విషయంలో చొరవచూపాలని ప్రజలు కోరుకుంటున్నారు.


అన్ని విధాల కృషి

కొత్త జిల్లాను అన్నిరంగాల్లో పురోగమింపచేయడానికి సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నాను. కొత్త జిల్లా ఏర్పడడంతో పాటు కలెక్టర్‌గా వందరోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల విషయంలో న్యాయం జరగాలి. ఈ క్రమంలో అధికారులెవరైనా ఉద్దేశపూర్వక తప్పిదాలకు పాల్పడితే వారిపై కఠినచర్యలు తీసుకోవడానికి వెనుకాడబోను. సిబ్బంది సర్దుబాటు, కార్యాలయాలు పూర్తి స్థాయి ఏర్పాటు త్వరలో సర్దుకుంటాయి.   

- విజయకృష్ణన్‌, కలెక్టర్‌


మెరుగైన పోలీసింగ్‌ 

వందరోజుల వ్యవధిలో ప్రజలకు మెరుగైన పోలీసింగ్‌ అందించడానికి  కృషి చేశాను. క్రైం రేటును నియంత్రించగలిగాం.    సిబ్బంది పరంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ అందరితో సమన్వయం చేసుకుని ముందుకువెళుతున్నాను. అధికార దుర్వినియోగానికి పాల్పడే పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎస్పీగా వందరోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. జిల్లాను శాంతిభద్రతల విషయంలో ముందుంచడానికి ప్రయత్నిస్తాను. 

- వకుల్‌జిందాల్‌, ఎస్పీ

 

Updated Date - 2022-07-13T05:21:36+05:30 IST