కట్టాల్సిందే..!

ABN , First Publish Date - 2022-06-03T06:46:36+05:30 IST

చెరువులకు కొన్నేళ్లుగా నీరే రాలేదు. వచ్చినా తూమెత్తలేదు. అయినా ఆయకట్టు రైతులకు నీటి తీరువా, దానిపై సర్వీసు రుసుం చెల్లించాలని డిమాండ్‌ నోటీసులు అందిస్తున్నారు.

కట్టాల్సిందే..!

ఆయకట్టు రైతులపై అడ్డగోలు బాదుడు..!

నీరే వదలకుండా తీరువా వసూలు..

వడ్డీ, చెల్లింపులపై సర్వీస్‌ చార్జీ సైతం..

జిల్లా అన్నదాతలపై రూ.కోటిదాకా భారం



నవ్విపోదురుగాక నాకేటి..

అన్నట్లుంది ప్రభుత్వ తీరు.. అన్ని వర్గాలను 

అడ్డదిడ్డంగా బాదేస్తోంది..

కరువు రైతును కూడా వదల్లేదు..

కొన్ని చెరువులు నిండింది లేదు..

నిండినా.. తూము ఎత్తింది లేదు..

ఆయకట్టుకు నీరిచ్చింది లేదు..

అయినా.. నీటి తీరువా కట్టాలట..

రెండేళ్లుగా ప్రభుత్వమే

తీరువా వసూలు చేయలేదు..

ఇప్పుడు బకాయిలు 

వడ్డీతో చెల్లించాలట..

దానిపై సర్వీస్‌ చార్జీ కూడా..

పంటలు చేతికి రాక..

అప్పుల పాలైన అన్నదాత పట్ల..

ఇంత కర్కశంగా..

వ్యవహరించడం 

చరిత్రలో లేదేమో..


హిందూపురం టౌన 

చెరువులకు కొన్నేళ్లుగా నీరే రాలేదు. వచ్చినా తూమెత్తలేదు. అయినా ఆయకట్టు రైతులకు నీటి తీరువా, దానిపై సర్వీసు రుసుం చెల్లించాలని డిమాండ్‌ నోటీసులు అందిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ రైతులు ప్రశ్నిస్తున్నా.. తమకేం పట్టదు, ప్రభుత్వం చెప్పిన మేరకు కట్టాల్సిందేనంటూ సచివాలయ సిబ్బంది హుకుం జారీ చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నింటిపై వరుసపెట్టి, బాదుడు పెంచుతోంది. ప్రస్తుతం ఆయకట్టు రైతుల వంతైంది. నీటి తీరువా వసూలు చేసే బాధ్యతను ప్రభుత్వం వీఆర్‌ఓల నుంచి సచివాలయాలకు బదలాయించింది. ఇకపై సచివాలయాల్లోనే రైతులు నీటితీరువా చెల్లించాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో నీటి తీరువా వసూలు చేయలేదు. ఇప్పుడు ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. గతానికి భిన్నంగా ఈసారి అదనంగా సర్వీస్‌ చార్జి కూడా చెల్లించాల్సి వస్తోంది. రెండు పంటలు వరి సాగుచేసే భూములకైతే ఒక ఫసలికి ఎకరాకు రూ.300పైగా చెల్లించాలి. శ్రీసత్యసాయి జిల్లాలో అధిక శాతం ఆయకట్టు రైతులు చెరువుల కిందే సాగు చేస్తున్నారు కాబట్టి ఒక పంటకే చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఎకరాకు రూ.100తోపాటు ఇతర చార్జీలు కలుపుకుని మరో రూ.50 అదనంగా కట్టాలి. దీనికితోడు ప్రతి రైతు ఖాతాకు రూ.35 సర్వీస్‌ చార్జి కొత్తగా విధిస్తున్నారు. 0.65 శాతం వడ్డీ కూడా వేస్తున్నారు. పాత బకాయిలకు ఆరు శాతం వడ్డీ కట్టాలని డిమాండ్‌ నోటీసు పంపుతున్నారు.


అన్నీ మైనర్‌ ఇరిగేషన చెరువులే..

శ్రీసత్యసాయి జిల్లాలో 90 శాతంపైగా మైనర్‌ ఇరిగేషన కింద ఉన్న చెరువులే. ఈ కారణంగా చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉంటారు. రెండేళ్లకో, మూడేళ్లకో వరుణ దేవుడు కరుణిస్తే పంట చేతికొస్తుంది. అలాంటి రైతులు కూడా తీరువా చెల్లించాలనడం ఏంటో అర్థ కావట్లేదు. టీడీపీ పాలనలో ఆయకట్టు రైతుల నుంచి హిందూపురం ప్రాంతంలో పన్ను వసూలు చేయలేదు.


తూమే ఎత్తలేదు.. ఎందుకు కట్టాలి?

రెండేళ్ల క్రితం వరకు పలు చెరువులకు పూర్తిస్థాయిలో నీరే రాలేదు. రెండేళ్లుగా నీరు వచ్చింది. అయినా వాటి తూములు బంద్‌ చేశారు. భూగర్భజలాలు పెరగాలని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఫలితంగా చెరువు కింద పంటలు వేసిన రైతులకు నీరు వదలలేదు. దీంతో వర్షాధారానికే చెరువుకింద పంటలు పండించుకున్నారు. గత ఖరీఫ్‌లో 90 శాతం మంది రైతులకు పంట చేతికందలేదు. పంట కోత దశలో ఉండగా నెలరోజులపాటు కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పూర్తిగా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటపుడు నీటి తీరువా ఎలా చెల్లించాలని రైతులు మండిపడుతున్నారు.


అధికారుల్లో అయోమయం

నీటి తీరువా వసూలుకు సంబంధించి డిమాండ్‌ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని మండలాల్లో రైతులకు ఇచ్చి, కట్టిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పటికీ ఇవ్వడానికి జంకుతున్నారు. కారణం ఏంటంటే ఆయకట్టుకు నీరే ఇవ్వలేదు, పంటే సాగు చేయలేదు, అలాంటపుడు నీటి తీరువా ఎలా చెల్లిస్తారని అధికారులు పునరాలోచనలో పడ్డారు. హిందూపురం మండలంలో రైతులకు డిమాండ్‌ నోటీసులు ఇవ్వడానికి ఇరిగేషన అధికారులకు రెవెన్యూ శాఖ లేఖలు రాసింది. ఏ చెరువుల కింద రైతులు నీటిని వదులుకున్నారో వివరాలు తెలపాలని అందులో కోరింది.


రూ. కోటిదాకా భారం

జిల్లాలో రైతుల పాసుపుస్తక ఖాతాలు 2 లక్షలు ఉండవచ్చని అంచనా. వీటన్నింటికీ నీటి తీరువా చెల్లించాలంటే సర్వీసు చార్జీకి వడ్డీ కలుపుకుంటే రైతులపై అదనపు భారం పడనుంది. రెండేళ్లుగా తీరువా వసూళ్లు ఆపేసి, ఇప్పుడు వడ్డీతో కట్టాలనడంపై అన్నదాతలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. గతంలో ఏటా నీటి తీరువా  వసూలు చేసేవారు. ఒకవేళ కట్టకపోయినా వడ్డీ వేసేవారు కాదు. ప్రస్తుతం నీటి తీరువా వసూలు విధానం చూస్తుంటే అన్నదాత నడ్డివిరిచేలా ఉందని ఆ వర్గాలు మండిపడుతున్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వమే కట్టించుకోలేదు. అలాంటపుడు రైతులకు వడ్డీ వేయడమేంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం పాత బకాయిలతోపాటు ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి రూ.కోటిదాకా వసూలు చేసేందుకు డిమాండ్‌ నోటీసులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


చెల్లింపుల్లోనూ బాదుడే..

ప్రభుత్వం గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత చార్జీలు అమాంతం పెంచేసింది. ఈ ప్రభావంతో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. రిజిస్ర్టేషన ఫీజు, ఇంటిపై, ఆస్తిపై, ఆఖరుకు చెత్తపై కూడా పన్ను వేస్తోంది. తాజాగా ఉచితంగా చెల్లించే నీటి తీరువాకు సైతం ఆనలైన పేరుతో రైతుల నుంచి సర్వీసు రుసుము లాగుతోంది. పంట పూర్తిస్థాయిలో చేతికిరాక, ఒకవేళ వచ్చినా గిట్టుబాటు ధరలేక దిగాలు చెందుతున్న రైతులకు ఇది పెనుషాక్‌. సర్వీసు రుసుము పేరుతో భారం మోపడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


రైతుల నడ్డి విరుస్తున్నారు..

లేపాక్షి చెరువు నుంచి మా భూములకు నీరే వదలలేదు. అయినా.. డిమాండ్‌ నోటీసు ఇచ్చి, తీరువా, సర్వీస్‌ చార్జి కట్టించుకున్నారు. గతంలో ఎప్పుడూ ఇంతలా డిమాండ్‌ చేయలేదు. రైతు ప్రభుత్వమని చెబుతూ మా నడ్డే విరుస్తున్నారు. 

- సీపీ ఆంజనేయులు, రైతు, లేపాక్షి


ఇరిగేషన అధికారులను వివరాలు కోరాం..

హిందూపురం మండలంలో 3490 ఖాతాలున్నాయి. 29,660 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏ చెరువు కింద పంట సాగు చేశారు, ఏ చెరువు తూము ఎత్తారన్న వివరాలు ఇవ్వాలని ఇరిగేషన అధికారులను కోరాం. జాబితా వచ్చాక డిమాండ్‌ నోటీసులు ఇస్తాం.

- శ్రీనివాసులు, తహసీల్దార్‌, హిందూపురం

Updated Date - 2022-06-03T06:46:36+05:30 IST