ఇంటి రుణాలకు కొత్త చిక్కులు!

ABN , First Publish Date - 2020-06-11T07:59:23+05:30 IST

ఇళ్లు కొనుగోలుకు రుణం తీసుకున్నవారికి కరోనా సంక్షోభ నేపథ్యంలో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. కొన్ని బ్యాంకులు ప్రస్తుత హోమ్‌ లోన్‌ ఖాతాలను తిరిగి మదింపు చేస్తున్నట్లుగా తెలిసింది...

ఇంటి రుణాలకు కొత్త చిక్కులు!

  • తిరిగి మదింపు చేస్తున్న బ్యాంక్‌లు! 
  • మంజూరైన రుణం విడుదలకు కొర్రీలు!!
  • తాజా పే స్లిప్‌లు అడుగుతున్న వైనం
  • జీతాల్లో కోత, తొలగింపులు పెరగడమే కారణం

ముంబై: ఇళ్లు కొనుగోలుకు రుణం తీసుకున్నవారికి కరోనా సంక్షోభ నేపథ్యంలో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. కొన్ని బ్యాంకులు ప్రస్తుత హోమ్‌ లోన్‌ ఖాతాలను తిరిగి మదింపు చేస్తున్నట్లుగా తెలిసింది. మంజూరు చేసిన రుణాన్ని విడుదల చేసేందుకు బ్యాంకులు కొత్త షరతులు విధిస్తున్నట్లు సమాచారం. తాజా వేతన స్లిప్పులు సమర్పించాలని కస్ట మర్లను కోరుతున్నాయట. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడం, ఉద్యోగుల జీతాలకు కంపెనీలు భారీగా కోతలు విధించడం ఇందుకు కారణం. సిబ్బందిని కూడా వీలైనంతగా తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గృహ రుణగ్రహీతల ప్రస్తుత ఆర్థిక స్తోమత, భవిష్యత్‌లో రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తిరిగి సమీక్షించేందుకే బ్యాంకులు ఈ కొర్రీలు పెడుతున్నాయంటున్నారు. తమ ప్రాజెక్టులో ఫ్లాట్స్‌ బుక్‌ చేసుకున్న చాలా మంది కస్టమర్లకు ఇప్పటికే మంజూరైన రుణ నిధులనూ బ్యాంకులు విడుదల చేయడం లేదని ముంబైకి చెందిన ఓ బిల్డర్‌ తెలిపారు. ‘‘కొన్ని కేసుల్లో, రుణంలో 20 శాతం నిధులను విడుదల చేసిన బ్యాంకులు లాక్‌డౌన్‌ మొదలయ్యాక మిగతా నిధులను నిలిపివేశాయి’’ అని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు రియల్టీ వర్గాలంటున్నాయి.


రుణగ్రహీతల ప్రయోజనార్థమే: బ్యాంక్‌లు 

మంజూరు చేసిన రుణం విడుదల చేసే ముందే రుణ గ్రహీత దాన్ని తిరిగి చెల్లించగలడా..? లేదా..? తెలుసుకోవడం నిబంధనల్లో భాగమేనని బ్యాంకర్లు అంటున్నారు. ఒకవేళ రుణగ్రహీత ఆర్థిక స్తోమత బాగాలేదని, నెలవారీ కిస్తీలు(ఈఎంఐ) చెల్లించే పరిస్థితిలో లేనట్లు తేలితే.. వారి ప్రయోజనార్థం రుణ కాంట్రాక్టును రద్దు చేయడమే మేలని ప్రైవేట్‌ బ్యాంకర్‌ ఒకరన్నారు. ఒకవేళ, రుణం తీసుకున్న తొలినాళ్లలోనే ఈఎంఐ చెల్లింపుల్లో విఫలమైతే రుణగ్రహీతకు కొనుగోలు చేసిన ఇల్లూ దక్కదు. భవిష్యత్‌లో చౌకగా గృహరుణం పొందే అవకాశమూ చేజారుతుందని బ్యాంకర్‌ అన్నారు. 


పెద్ద గృహాలకు డిమాండ్‌ : హెచ్‌డీఎఫ్‌సీ

సొంత ఇళ్లు ఉండటం ఎంత ముఖ్యమో కరోనా విజృంభణ, పర్యవసానంగా విధించిన లాక్‌డౌన్‌ మరోసారి మనకు గుర్తు చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా చాలా రంగాల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాల్సిన (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) ఆవశ్యకత ఏర్పడింది. ఇప్పుడదే నియమంగా మారింది. దాంతో అధిక వైశాల్యం కలిగిన గృహాలు, ఫ్లాట్స్‌కు డిమాండ్‌ పెరగుతోందని హెచ్‌డీఎ్‌ఫసీ ఎండీ రేణు సూద్‌ కర్నాడ్‌ అన్నారు. ఈ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ ఆన్‌లైన్‌ ప్రాపర్టీ షోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ లో నెల రోజుల పాటు జరిగే ఆన్‌లైన్‌ షో ఇప్పటికే ప్రారంభించామని,  ముంబై ప్రాంతానికి సంబంధించి వచ్చేవారంలో ఇదే తరహా ప్రాపర్టీ షోను నిర్వహించనున్నామని కర్నాడ్‌ అన్నారు. తదుపరి దశలో వీటిని దేశం అంతటా విస్తరించే ఆస్కారం ఉందన్నారు.  


Updated Date - 2020-06-11T07:59:23+05:30 IST