పెట్టుబడులు పెడుతున్నారా.. ఈ వ్యూహాలు బెస్ట్‌ !

ABN , First Publish Date - 2020-07-05T05:52:57+05:30 IST

పెట్టుబడులు పెడుతున్నారా.. ఈ వ్యూహాలు బెస్ట్‌ !

పెట్టుబడులు పెడుతున్నారా.. ఈ వ్యూహాలు బెస్ట్‌ !

ప్రస్తుతం ఎటు చూసినా నిరాశే. పెట్టుబడులదీ ఇదే పరిస్థితి. చేతిలో నాలుగు డబ్బులున్నా.. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియడం లేదు. ఈ స్థితి నుంచి బయటపడేందుకు మదుపరులు అనుసరించాల్సిన వ్యూహం ఏమిటనేది  ఆంధ్రజ్యోతి ‘బిజినెస్‌ ప్లస్‌’ పాఠకులకు బ్యాంక్‌బజార్‌ సీఈఓ అదిల్‌ శెట్టి వివరిస్తున్నారు. ఆ వివరాలేమిటంటే..


వివిధీకరణ

చేతిలో ఉన్న నగదు అంతా ఒకే పెట్టుబడిలో కాకుండా వివిధ ఆస్తుల్లో పెట్టుబడిగా పెట్టాలి. అలా చేయడం వల్ల ఒక ఆస్తిలో నష్టం వచ్చినా, ఇతర ఆస్తుల్లో పెట్టుబడులు ఆ నష్టాన్ని కొంత వరకు భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత స్టాక్‌ మార్కెట్టే ఇందుకు ఉదాహరణ. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు స్టాక్‌ మార్కెట్‌ రేసుగుర్రంలా పరిగెత్తి రికార్డులతో హోరెత్తించింది. అదే మార్కెట్‌ కొవిడ్‌-19 దెబ్బతో మార్చిలో మదుపరులకు చుక్కలు చూపించింది. ప్రస్తుతానికి కొద్దిగా కోలుకున్నా, మార్కెట్లో ఆటుపోట్లయితే ఇంకా కొనసాగుతున్నాయి. మార్కెట్‌ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు కొంతమంది షేర్లతో పాటు బంగారం, చిన్న పొదుపు పథకాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోనూ ఇన్వెస్ట్‌ చేశారు. కేవలం స్టాక్‌ మార్కెట్‌ను మాత్రమే నమ్ముకున్న మదుపరులతో పోలిస్తే వీరు చాలా వరకు నింపాదిగా ఉన్నారు. పెట్టుబడుల వివిధీకరణే ఇందుకు కారణం.


దీర్ఘకాలిక పెట్టుబడులు

స్వల్పకాలిక లాభాల కోసం స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. దీర్ఘకాలిక లాభాల కోసమే ఈక్విటీలను ఎంచుకోవాలి. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకూ ఇదే వర్తిస్తుంది. ఈ పథకాల్లోనూ ఒకేసారి పెద్ద మొత్తం కాకుండా సిప్‌ (సిస్టమాటిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌) పద్ధతిలో ప్రతి నెలా కొద్ది కొద్దిగా దీర్ఘకాలిక పద్ధతిలో ఇన్వెస్ట్‌ చేయాలి. నేరుగా కంపెనీల షేర్లు కొనాలన్నా మార్కెట్‌ పతనమైనప్పుడు మంచి కంపెనీల షేర్లను రెండు మూడు ధరల్లో కొనుగోలు చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు.


ఆర్థిక లక్ష్యాలు

పెట్టుబడులు ఎప్పుడూ మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. స్వల్పకాలిక లక్ష్యాలైతే బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు లేదా లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఫథకాలను ఎంచుకోవాలి. దీర్ఘకాలంలో అధిక రాబడుల కోసమైతే మంచి కంపెనీల షేర్లలో మదుపు చేయాలి. అదే మధ్యకాలిక లక్ష్యాలైతే చిన్న పొదుపు పథకాలు లేదా బంగారాన్ని ఎంచుకోవాలి.


భద్రత 

పెట్టుబడులపై రాబడులు ఎంత ముఖ్యమో, వాటి భద్రతా అంతే ముఖ్యం. స్టాక్‌ మార్కెట్‌ లేదా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో పెట్టుబడులపై రాబడులు, నిర్ణీత కాలానికంటే ముందే లక్ష్యాన్ని చేరితే, వెంటనే ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు లేదా బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల్లో మదుపు చేయడం మంచిది.


అప్పు చేసి పెట్టుబడులు వద్దు

అప్పు చేసి పప్పు కూడు తినొద్దనేది సామెత. పెట్టుబడులకూ ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా అప్పు చేసి అధిక నష్ట భయం ఉండే షేర్‌ మార్కెట్‌, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో మదుపు చేయ డం ఏ మాత్రం మంచిది కాదు. ప్రస్తుతంలా మార్కెట్‌ ఏ మాత్రం ఆటుపోట్లకు లోనైనా అసలుకే చిల్లుపడే ప్రమాదం ఉంది. అప్పుడు చేసిన అప్పులు లేదా ఈఎంఐలు తీర్చేందుకు ఉన్న ఆస్తులు లేదా పెట్టుబడులు అమ్ముకోవలసి రావచ్చు. అప్పు చేసి పెట్టుబడి పెట్టే ముందే మన వయసు, ఆదాయం, అప్పులు, బీమా కవరేజీ, భరించగలిగిన నష్టాలు వంటి అంశాలు బేరీజు వేసుకోవాలి.


నిర్ణయాలు 

అసాధారణ పరిస్థితులు తలెత్తి మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లకు లోనైనప్పుడు భయపడిపోయి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. అలా చేస్తే అనవసరంగా మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు సరైన ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సలహా తీసుకోవడం మంచిది.  

Updated Date - 2020-07-05T05:52:57+05:30 IST