బ్యాంకు సర్వర్‌ హాక్‌ చేశారు 12 కోట్లు దోచుకున్నారు!

ABN , First Publish Date - 2022-01-25T07:24:04+05:30 IST

హాలీవుడ్‌ సినిమాల్లో చూపించినట్లే చేశారు సైబర్‌ నేరగాళ్లు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న

బ్యాంకు సర్వర్‌ హాక్‌ చేశారు 12 కోట్లు దోచుకున్నారు!

  •  మహేశ్‌ సహకార బ్యాంకుపై హ్యాకర్ల పంజా
  •  పక్కాగా ప్లాన్‌... సెలవు రోజుల్లో అమలు
  •  ఇతర బ్యాంకుల్లో 120 ఖాతాలకు డబ్బులు
  •  సోమవారం హాక్‌ సంగతి గుర్తించిన సిబ్బంది
  •  సర్వర్‌ను తిరిగి కంట్రోల్లోకి తెచ్చుకున్న బ్యాంకు
  •  హ్యాకింగ్‌పై సిటీ సైబర్‌ క్రైమ్స్‌లో కేసు నమోదు
  •  ఖాతాదారులెవరికీ నష్టం జరగలేదన్న ఎండీ


హైదరాబాద్‌ సిటీ/హిమాయత్‌నగర్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): హాలీవుడ్‌ సినిమాల్లో చూపించినట్లే చేశారు సైబర్‌ నేరగాళ్లు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఏపీ మహేశ్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్‌ చేసి, బ్యాంకు మూలధన ఖాతా నుంచి ఏకంగా  రూ.12.40 కోట్లు దోచుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇతర బ్యాంకుల్లో ఉన్న 120 ఖాతాలకు ఈ సొమ్మును ట్రాన్స్‌ఫర్‌ చేశారు. బ్యాంకుకు సెలవు దినాలైన శని, ఆదివారాలను ఈ హ్యాకింగ్‌కు అవకాశంగా వాడుకున్నారు.


రెండు రోజులు సెలవుల తర్వాత సోమవారం  ఉదయం సిబ్బంది బ్యాంకును తెరిచారు. అంతా సవ్యంగానే ఉందని, కార్యకలాపాలు ప్రారంభించడానికి సిబ్బంది సిద్ధమయ్యారు. సర్వర్‌ పని చేయడం మానేసింది. అప్రమత్తమైన బ్యాంకు ఉన్నతాధికారులు సాంకేతిక సిబ్బందిని అలర్ట్‌ చేశారు. వారు రంగంలోకి దిగి పరిశీలించగా బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ హ్యాక్‌ అయినట్లు తేలింది. సాంకేతిక నిపుణులు నిముషాల వ్యవధిలో బ్యాంకు మెయిన్‌ సర్వర్‌ సాఫ్ట్‌వేర్‌ను పునరుద్ధరించినప్పటికీ, అప్పటికే బ్యాంకు మూలధన ఖాతా నుంచి రూ.12.40 కోట్ల డబ్బు గల్లంతైనట్లు తేలింది. బ్యాంకు అధికారులు క్షణాల్లో సమాచారాన్ని బ్యాంకు ఎండీ ఉమేశ్‌ చంద్‌ అసావా దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు సిటీ సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు. 


సున్నా జోడించారు.. లిమిట్‌ పెంచి కొట్టేశారు

శని, ఆది వారాల్లో బ్యాంకుకు సెలవు ఉండటంతో మోసగాళ్లు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తొలుత బ్యాంకు సర్వర్‌ను హ్యాక్‌ చేయగానే ఏం చేయాలో ముందే ప్లానింగ్‌ చేసుకున్నారు. బ్యాంకులో రోజు వారీగా రూ.5 కోట్లకు మించి మూలధన ఖాతా నుంచి విత్‌డ్రా చేయడానికి వీల్లేదు.


ఈ మేరకు సర్వర్‌ సాఫ్ట్‌వేర్‌ను బ్యాంకు ముందే లిమిట్‌ చేసి పెట్టింది. ఈ విషయాన్ని పసిగట్టిన  హ్యాకర్లు ముందుగా ఆ పరిమితికి ఓ సున్నా జోడించి లిమిట్‌ను రూ.50 కోట్లకు పెంచుకున్నారు. సర్వర్‌ను హ్యాక్‌ చేసిన వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి వీలుగా ఇతర  రాష్ట్రాల్లో ఇతర బ్యాంకులకు చెందిన ఖాతాలు కూడా సిద్ధం చేసుకున్నారు. హ్యాక్‌ చేసిన నిముషాల్లోనే రూ.12.40 కోట్లు 120 ఖాతాల్లోకి మళ్లించారు.


కస్టమర్ల డబ్బు సురక్షితం

బ్యాంక్‌ ఎండీ ఉమేశ్‌ చంద్‌ అసావా హ్యాకింగ్‌ ఘటనపై స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, డబ్బులు మళ్లించిన లావాదేవీలను గుర్తించామని చెప్పారు. ఆయా ఖాతాలను బ్లాక్‌ చేయించే ప్రయత్నం జరిగిందని తెలిపారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని, నాలుగు రాష్ట్రాల్లో 45 శాఖలున్న మహేశ్‌ బ్యాంకులో కస్టమర్ల డబ్బు సురక్షితంగా ఉందని చెప్పారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని కోరారు. 


Updated Date - 2022-01-25T07:24:04+05:30 IST