20 kg gold: బ్యాంకు దోపిడీ

ABN , First Publish Date - 2022-08-16T13:46:29+05:30 IST

స్థానిక అరుంబాక్కంలోని ఫెడ్‌ బ్యాంక్‌ (నాన్‌ బ్యాకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ)దోపిడీ కేసును నగర పోలీసులు ఛేదించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం

20 kg gold: బ్యాంకు దోపిడీ

- సూత్రధారి అరెస్టు

- 20 కేజీల బంగారం స్వాధీనం 

- మరో ముగ్గురి కోసం గాలింపు


చెన్నై, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక అరుంబాక్కంలోని ఫెడ్‌ బ్యాంక్‌ (నాన్‌ బ్యాకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ)దోపిడీ కేసును నగర పోలీసులు ఛేదించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు ఘటన జరిగిన రెండు రోజుల్లోనే పరిష్కరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దోపిడీకి గురైన 31.7 కేజీల బంగారు నగల్లో కొంతమేర స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ ముఠాకు నేతృత్వం వహించిన అదే బ్యాంక్‌ విల్లివాక్కం బ్రాంచ్‌ ఉద్యోగి మురుగన్‌ను సోమవారం ఉదయం అరెస్టు చేశారు. మురుగన్‌ నాయకత్వంలో మరో ఆరుగురు యువకులు కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ ప్రకటించారు. నలుగురిని అరెస్టు చేశామని, మరో ముగ్గురి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. అరుంబాక్కం పోలీసుస్టేషన్‌ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మురుగన్‌తోపాటు ఒకే పాఠశాలలో చదివిన ఆరుగురు యువకులు కలిసి ఫెడ్‌ బ్యాంక్‌ ప్రాంగణంలో పదిరోజులకు పైగా రెక్కీ నిర్వహించి ఓ పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిపారు. అరెస్టు చేసినవారి నుంచి 20 కేజీల వరకూ బంగారు నగలను, దోపిడీకి ఉపయోగించిన రెండు కార్లు, ఓ మోటారుబైకు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దోపిడీ జరిగిన వెంటనే ఏడుగురు రెండు బైకుల్లో పారిపోయారని, ఆ బ్యాంక్‌ ఎదురుగా ఉన్న భవనాల్లోని సీసీ కెమెరా(CC camera)ల వీడియో ఆధారంగా ఈ విషయం తెలిసిందన్నారు. అంతేకాకుండా మురుగన్‌ గత పది రోజులుగా తన సెల్‌ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడాడన్న వివరాలను మొబైల్‌ సంస్థల నుంచి సేకరించిన మీదట దోపిడీలో ఏడుగురికి భాగస్వామ్యం ఉన్నట్లు నిర్ధారించామన్నారు. మురుగన్‌(Murugan) తన సహచరులైన బాలాజీ, సంతోష్‌, శక్తివేల్‌కు 20 కేజీల బంగారు నగలను ఇచ్చి సమానంగా పంచుకోవాలని చెప్పి కారులో పారిపోయాడని విచారణలో వెల్లడైందన్నారు. మిగిలిన నగలు అతని వద్దనే వున్నట్లు తాము భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం అరెస్టయిన నలుగురి వద్ద సేకరించిన వివరాల మేరకు పరారీలో ఉన్న ముగ్గురిని వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని కమిషనర్‌ తెలిపారు. దోపిడీ జరిగిన రెండు రోజుల్లోపే ముఠా నాయకుడి సహా నలుగురిని అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు విభాగానికి నాయకత్వం వహించిన డిప్యూటీ పోలీసు కమిషనర్‌ విజయకుమార్‌ను, ఆయన సహచరులను కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ ఈ సందర్భంగా అభినందించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సూర్య సహా ముగ్గురి ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళాయని ఆయన పేర్కొన్నారు.



Updated Date - 2022-08-16T13:46:29+05:30 IST