కారులో మూడో వ్యక్తి

ABN , First Publish Date - 2021-12-12T17:28:00+05:30 IST

బంజారాహిల్స్‌ రోడ్డు ప్రమాదంలో మూడో వ్యక్తి ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు కావాలనే అతన్ని తప్పించారని స్పష్టం అయింది. ఈనెల 6న

కారులో మూడో వ్యక్తి

కస్టడీలో వెలుగులోకి .. 

రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం


హైదరాబాద్/బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్డు ప్రమాదంలో మూడో వ్యక్తి ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు కావాలనే అతన్ని తప్పించారని స్పష్టం అయింది. ఈనెల 6న బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 2లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన రామంతాపూర్‌కు చెందిన రోహిత్‌ గౌడ్‌ అతని స్నేహితుడు సాయి సోమన్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు తదుపరి విచారణ నిమిత్తం వారిని ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై కారులో మూడో వ్యక్తి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు ఈ దిశగా దృష్టి సారించారు. సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్‌ సీడీఆర్‌లను పరిశీలించగా మూడో వ్యక్తి ఉన్నట్టు తేలింది. అంతేకాకుండా కస్టడీలో ఉన్న నిందితులను పశ్చిమ మండలం డీసీపీ స్వయంగా విచారించారు. ఎల్‌బీనగర్‌కు చెందిన కోసారపు వెంకటేష్‌ అలియాస్‌ వెంకట్‌ అనే వ్యక్తి కూడా తమతో ఉన్నట్టు నిందితులు డీసీపీకి చెప్పారు. వెంకట్‌ వివాహం ఈనెల 12న జరుగనుండటంతో నిందితులు అతన్ని అక్కడి నుంచి తప్పించినట్టు వెల్లడించారు. నిందితులతో కారులో వెంకట్‌ కూడా ఉండటంతో పోలీసులు అతని పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.  


ఎమ్మెల్యే ఎందుకు వచ్చినట్టు ?

రోడ్డు ప్రమాదం జరిగిన కొద్ది గంటలకే నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఠాణాకు వచ్చారు. ఈ విషయం పై తొలుత పోలీసులు స్పందించలేదు. చివరకు డీసీపీ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వచ్చింది వాస్తమేనని, ప్రమాదం వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే వచ్చారని చెప్పారు. అయితే ఆయన నియోజకవర్గంలో కూడా ఇంతకన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగినా ఎప్పుడూ స్పందించని ఎమ్మెల్యే ప్రత్యేకంగా బంజారాహిల్స్‌ ఠాణాకు రావడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మూడో వ్యక్తి ఉన్నాడని విషయం వెలుగులోకి రావడంతో అతన్ని ఎమ్మెల్యే ప్రమేయంతోనే తప్పించారా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదంపై మీడియా ఫోకస్‌ చేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి,


జరిగింది ఇదీ..

ప్రమాదం జరిగిన రోజు అసలేం జరిగింది అనే విషయం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ స్పష్టత ఇచ్చారు. ఉప్పల్‌కు చెందిన బజార్‌ రోహిత్‌ గౌడ్‌, ఫార్మా కంపెనీ నిర్వాహకుడు కర్మన్‌ఘాట్‌కు చెందిన వెడుల్ల సాయి సోమన్‌ రెడ్డి ఖరీదైన పోర్షె  కారులో జూబ్లీహిల్స్‌కు వచ్చారు. ఎల్‌బీనగర్‌కు చెందిన నిర్మాణదారుడు వెంకటేష్‌ తన బీఎండబ్ల్యూ కారులో స్నేహితురాలి పార్టీ కోసం దుర్గంచెరువు వద్ద పబ్‌కు వచ్చా రు. అందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం రోహిత్‌, సాయిసోమన్‌ పోర్షెలో, వెంకట్‌ తన బీఎండబ్ల్యూ కారులో జూబ్లీహిల్స్‌కు వచ్చారు. వెంకట్‌ కారును అక్కడే ఉన్న పద్మావతి అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌లో పెట్టారు. ముగ్గురు కలిసి రోహిత్‌ కారులో ఓ పబ్‌కు వెళ్లారు. అక్కడ మళ్లీ మద్యం తాగి రాడిసన్‌ బ్లూ ప్లాజాకు వెళ్లి పార్టీ చేసుకున్నారు. అక్కడి నుంచి పార్క్‌ హయత్‌కు వెళుతుండగా బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 2 రెయిన్‌ బో ఆస్పత్రి వద్ద ప్రమాదం జరిగింది. 

Updated Date - 2021-12-12T17:28:00+05:30 IST