ఫేస్‌బుక్‌ ‘హాహా’ ఎమోజీ వాడడంపై ఫత్వా

ABN , First Publish Date - 2021-06-25T01:50:26+05:30 IST

ఈ వార్త చదివిన తర్వాత మీరు ‘హాహా’ అనకుంటే ఒట్టు. ఇతరులను ఎగతాళి చేసేందుకు ఫేస్‌బుక్‌లో ‘హాహా’ ఎమోజీని వాడడంపై

ఫేస్‌బుక్‌ ‘హాహా’ ఎమోజీ వాడడంపై ఫత్వా

ఢాకా: ఈ వార్త చదివిన తర్వాత మీరు ‘హాహా’ అనకుంటే ఒట్టు. ఇతరులను ఎగతాళి చేసేందుకు ఫేస్‌బుక్‌లో ‘హాహా’ ఎమోజీని వాడడంపై బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మతగురువు అహ్మదుల్లా ఫత్వా జారీ చేశాడు. సామాజిక మాధ్యామాల్లో ఇప్పుడిది విపరీతంగా వైరల్ అవుతోంది. ‘ఫత్ హాహా’ అంటూ నెటిజన్లు కామెంట్లతో వెర్రెక్కిస్తున్నారు. అహ్మదుల్లాకు ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో మూడు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. బంగ్లాదేశ్‌లోని మతపరమైన విషయాలపై అహ్మదుల్లా అప్పుడప్పుడు టీవీ చర్చల్లోనూ కనిపిస్తుంటాడు. 


ఈ నెల 19న ఫేస్‌బుక్‌లో అహ్మదుల్లా ఓ చిన్నపాటి వీడియోను పోస్టు చేశాడు. ఇతరులను ఎగతాళి చేసేందుకు ప్రజలు తరచూ ఫేస్‌బుక్‌లో ‘హాహా’ ఎమోజీని వాడుతున్నారని, ఇది సరికాదని పేర్కొంటూ ఇస్లామిక్ శాసనమైన ఫత్వాను జారీచేశాడు. దీనిని ఎందుకు నిషేధించినదీ కూడా చెప్పుకొచ్చాడు.


‘‘ఈ రోజుల్లో మనం ప్రజలను హేళన చేసేందుకు హాహా ఎమోజీలు వాడుతున్నాం. కంటెంట్ పోస్టు చేసిన వ్యక్తిని ఉద్దేశించి సరదాగా ఇలా హాహా ఎమోజీతో స్పందిస్తే ఓకే. కానీ అది కంటెంట్ పోస్టు చేసిన వ్యక్తులను ఎగతాళి చేయడమే ఉద్దేశంగా చేసినా, సోషల్ మీడియాలో కామెంట్స్ చేసినా అది తప్పే. ఇస్లాంలో ఇది పూర్తిగా నిషేధం’’ అని అహ్మదుల్లా పేర్కొన్నాడు. కాబట్టి దేవుడి కోసం ఈ చర్యకు దూరంగా ఉండాలని అభ్యర్థిస్తున్నానని, ఒకరిని ఎగతాళి చేసేందుకు ‘హాహా’తో స్పందించవద్దని కోరుతున్నట్టు పేర్కొన్నాడు. మీరు కనుక ఓ ముస్లింను బాధపెడితే అతడు చెడుగా స్పందించే అవకాశం ఉందని, దీనిని మనం ఊహించలేమని పేర్కొన్నాడు. 


అహ్మదుల్లా ఈ వీడియోను పోస్టు చేసిన వెంటనే తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 90 వేల లైకులు రాగా 3 వేల మంది స్పందించారు. 14 వేల మంది షేర్లు చేశారు. దాదాపు 1000 మంది ‘హాహా’ ఎమోజీతో స్పందించడం గమనార్హం. పాకిస్థాన్ జర్నలిస్టు నైలా ఇనాయత్‌ను అహ్మదుల్లా ఫత్వా వార్తకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పోస్టు చేస్తూ ‘‘హాహా’ అని క్యాప్షన్ తగిలించారు. 

Updated Date - 2021-06-25T01:50:26+05:30 IST