Bangladesh : కాళీ దేవాలయంలో విగ్రహాల ధ్వంసం

ABN , First Publish Date - 2021-10-16T20:17:01+05:30 IST

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి

Bangladesh : కాళీ దేవాలయంలో విగ్రహాల ధ్వంసం

ఢాకా : బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి. మున్షీగంజ్‌లోని కాళీ మాత దేవాలయంపై శనివారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు దాడి చేసి, ఆరు దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. సిరాజ్‌దిఖాన్ సర్కిల్ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ మహమ్మద్ రషీదుల్ ఇస్లామ్ ఈ సంఘటనను ధ్రువీకరించారు. 


రషీదుల్ ఇస్లామ్ బంగ్లాదేశ్ మీడియాతో మాట్లాడుతూ, మున్షీగంజ్, సిరాజ్‌దిఖాన్ ఉప జిల్లా, రసూనియా యూనియన్‌లోని డానియాపర మహా శోషణ్ కాళీ మందిరంపై శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు దాడి చేశారన్నారు. ఈ దేవాలయంలోని ఆరు దేవతా విగ్రహాలను ఈ దుండగులు ధ్వంసం చేశారన్నారు. ఈ దేవాలయం వద్ద భద్రతా ఏర్పాట్లు లేవని చెప్పారు.


ఈ దేవాలయం కమిటీ ప్రధాన కార్యదర్శి సువ్రత దేవ్ నాథ్ వను మాట్లాడుతూ, ప్రధాన సింహద్వారం కప్ప తాళాన్ని పగులగొట్టి, టిన్ రేకుల షెడ్‌ను కోసేశారని తెలిపారు. ఈ దేవాలయంలోని అన్ని విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ దేవాలయంలో ఇటువంటి సంఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. 


ఖురాన్‌ పట్ల అపచారం జరిగిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో బుధవారం బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో మత హింస జరిగింది. చాంద్ పూర్, చిట్టగాంగ్, గాజీపూర్, బందర్బన్, చాపయి నవాబ్ గంజ్, మౌల్వీ బజార్లలో దుర్గా పూజ మండపాలపై దాడులు చేసి, నాశనం చేశారు. ఈ సంఘటనల్లో ప్రాణ నష్టం కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 


నౌఖాలీ జిల్లాలోని బేగంగంజ్‌లో శుక్రవారం జరిగిన మత హింసలో జతన్ కుమార్ సాహా హత్యకు గురయ్యారు. 17 మంది గాయాలపాలయ్యారు. ఈ జిల్లాలో శుక్రవారం కొందరు దుండగులు ఇస్కాన్ టెంపుల్‌పై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈ సంఘటనలో కూడా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెప్పారు. 


Updated Date - 2021-10-16T20:17:01+05:30 IST