బంగ్లాదేశ్ : హిందువులపై హింసాకాండలో కీలక నిందితుని అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-24T00:05:38+05:30 IST

దుర్గా పూజల సమయంలో హిందువులపై జరిగిన

బంగ్లాదేశ్ : హిందువులపై హింసాకాండలో కీలక నిందితుని అరెస్ట్

ఢాకా : దుర్గా పూజల సమయంలో హిందువులపై జరిగిన హింసాకాండలో రెండో కీలక నిందితుడు సైకత్ మండల్‌ను అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ పోలీసులు శనివారం తెలిపారు. అక్టోబరు 17న రంగ్‌పూర్ జిల్లాలోని, పీర్‌గంజ్ సబ్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన దాడుల సూత్రధారుల్లో సైకత్ ఒకడని, అతనితోపాటు అతని సహచరుడిని కూడా ఢాకా శివారులోని గాజీపూర్‌లో అరెస్టు చేశామని చెప్పారు. 


బంగ్లాదేశ్‌లో నేర నిరోధక విభాగమైన ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ) అధికారులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, పీర్‌గంజ్‌లో అక్టోబరు 17న జరిగిన హింసాకాండ సూత్రధారుల్లో ఒకడైన సైకత్ మండల్‌ను, అతని సహచరుడిని శనివారం ఉదయం గాజీపూర్‌లో అరెస్టు చేశారు. సైకత్ ఫేస్‌బుక్ పోస్ట్ కారణంగా  ప్రజలు హింసాకాండకు పాల్పడ్డారు. హిందువులకు చెందిన దాదాపు 70 ఇళ్ళు, దుకాణాలను తగులబెట్టారు. 


కుమిల్లాలోని దుర్గా పూజ మండపంలో ఖురాన్‌ను పెట్టిన ఇక్బాల్ హుస్సేన్‌ను శుక్రవారం బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హింసాకాండలో కీలక నిందితుడు ఇతనే. ఇతనిని కాక్స్ బజార్ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఇతనిని ఏడు రోజుల పోలీసు రిమాండ్‌కు తరలించారు. 


దేశంలోని వివిధ ప్రాంతాల్లో దుర్గా పూజల సమయంలో హిందువులపై హింసాకాండకు పాల్పడినవారిలో దాదాపు 600 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టిన మహమ్మద్ ఫయాజ్‌ను శుక్రవారం జైలుకు తరలించారు. 


ఇదిలావుండగా బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ సామూహిక నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తోంది.  హిందువులపై దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించింది. 


Updated Date - 2021-10-24T00:05:38+05:30 IST