బంగ్లాదేశ్‌లో వారంపాటు అష్టదిగ్బంధనం

ABN , First Publish Date - 2021-04-03T19:08:43+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి విజృంభణను నిరోధించేందుకు దేశవ్యాప్తంగా

బంగ్లాదేశ్‌లో వారంపాటు అష్టదిగ్బంధనం

ఢాకా : కోవిడ్-19 మహమ్మారి విజృంభణను నిరోధించేందుకు దేశవ్యాప్తంగా వారం రోజులపాటు అష్టదిగ్బంధనాన్ని అమలు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించబోతోంది. ఏప్రిల్ 5 నుంచి దేశవ్యాప్తంగా ఉపాధి కల్పన రంగం మినహా మిగిలిన అన్ని రంగాలను మూసివేయాలని ఆదేశించబోతోంది. ఈ వివరాలను అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ, రోడ్డు రవాణా శాఖ మంత్రి ఒబెయిదుల్ కాదర్ తెలిపారని ‘ఢాకా ట్రిబ్యూన్’ వెల్లడించింది. కాదర్ కూడా తన అధికారిక నివాసంలో మీడియాకు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 


ప్రభుత్వ పాలన శాఖ మంత్రి ఫర్హాద్ హుస్సేన్ ‘ఢాకా ట్రిబ్యూన్’తో మాట్లాడుతూ, అష్ట దిగ్బంధనం సమయంలో అన్ని కార్యాలయాలు, కోర్టులు మూతపడతాయని చెప్పారు. పరిశ్రమలు, మిల్లులు మాత్రమే రొటేషన్ పద్ధతిలో కార్యకలాపాలు నిర్వహిస్తాయని చెప్పారు. అష్ట దిగ్బంధనం సమయంలో పరిశ్రమలను, మిల్లులను ఎందుకు పని చేయనిస్తున్నారని విలేకర్లు అడిగినపుడు ఫర్హాద్ మాట్లాడుతూ, వీటిని మూసేస్తే వర్కర్స్ తాము పని చేసే ప్రదేశాల నుంచి తమ ఇళ్ళకు వెళ్ళిపోవలసి వస్తుందన్నారు. 


బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో కొత్తగా 6,830 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో ఇన్ఫెక్షన్ రేటు 23.28 శాతం. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 6,24,594.



Updated Date - 2021-04-03T19:08:43+05:30 IST