Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 19 Aug 2022 13:53:58 IST

Sri Krishna Janmashtami: హిందువుల హక్కులపై బంగ్లాదేశ్ పీఎం హసీనా సంచలన వ్యాఖ్యలు

twitter-iconwatsapp-iconfb-icon
Sri Krishna Janmashtami: హిందువుల హక్కులపై బంగ్లాదేశ్ పీఎం హసీనా సంచలన వ్యాఖ్యలు

ఢాకా : బంగ్లాదేశ్‌ (Bangladesh)లో అందరికీ సమాన హక్కులు ఉన్నాయని ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా (Sheikh Hasina) చెప్పారు. హిందువులు (Hindu community) తమను తాము మైనారిటీలుగా భావించవద్దని చెప్పారు. మతంతో సంబంధం లేకుండా దేశంలో అందరూ సమాన హక్కులను అనుభవించవచ్చునని తెలిపారు. అయితే ఏదైనా చిన్న దాడి జరిగినపుడు దేశంలో హిందువులకు రక్షణ లేదని ప్రచారం చేయవద్దని హితవు పలికారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఢాకేశ్వరి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. 


అన్ని మతాలవారూ సమాన హక్కులతో జీవించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. బంగ్లాదేశ్‌ పౌరులందరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పారు. నాకు ఉన్న హక్కులే మీకు కూడా ఉన్నాయన్నారు. ‘‘మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు’’ అని కోరారు. అందరూ ఇదే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలిగితే, ఏ మతంలోని దుష్టశక్తులైనా సరే దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించలేవని స్పష్టం చేశారు. ఆ నమ్మకాన్ని, ఐకమత్యాన్ని పదిలపరచుకోవాలని చెప్పారు. ‘‘మీ అందరి నుంచి ఇదే కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. 


బంగ్లాదేశ్‌లోని ఓ వర్గం హిందువులపై పీఎం హసీనా తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఓ విషయాన్ని నేను చాలా విచారిస్తూ చెప్తున్నాను. దేశంలో ఏదైనా సంఘటన జరిగినపుడల్లా, దేశంలోనూ, విదేశాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు ఎటువంటి హక్కులు లేవని పెద్ద ఎత్తున చెప్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. చర్య తీసుకున్నప్పటికీ దేశంలో హిందువులకు ఎటువంటి హక్కులు లేవని ప్రచారం చేస్తున్నారన్నారు. దీనివల్ల ప్రభుత్వ చర్యల గురించి తెలియడంలేదన్నారు. దేవాలయాలను కాపాడటం కోసం పోలీసులు జరిపే కాల్పుల్లో ముస్లింలు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 


పశ్చిమ బెంగాల్‌లో కానీ, కోల్‌కతాలో కానీ ఏర్పాటు చేసే దుర్గా పూజా మండపాల కన్నా ఢాకాలో ఎక్కువ మండపాలు ఉంటున్నాయన్నారు. బంగ్లాదేశ్‌లో దుర్గా పూజలను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారని తెలిపారు. తన ప్రభుత్వం మసీదుల ఆధునికీకరణ, మరమ్మతులకు మాత్రమే కాకుండా దేవాలయాలు, చర్చిలు, మఠాల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం కూడా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మతపరమైన మనోభావాలను గాయపరచడం సరైన విషయం కాదని చెప్పారు. 


దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి చాలా పెద్ద ప్రయత్నాలు జరిగాయన్నారు. సమస్యలను సృష్టించే ఓ వర్గం అన్ని మతాల్లోనూ ఉందని తెలిపారు. ఏ మతస్థులనైనా అణగదొక్కాలని ప్రభుత్వం, అవామీ లీగ్ పార్టీ కోరుకోబోవని స్పష్టం చేశారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.