టీమిండియా చెత్త రికార్డును బద్దలుగొట్టిన బంగ్లాదేశ్

ABN , First Publish Date - 2022-04-05T01:46:05+05:30 IST

టీమిండియా చెత్త రికార్డు బద్దలైంది. దక్షిణాఫ్రికాతో ఆ దేశ గడ్డపై జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్

టీమిండియా చెత్త రికార్డును బద్దలుగొట్టిన బంగ్లాదేశ్

డర్బన్: టీమిండియా చెత్త రికార్డు బద్దలైంది. దక్షిణాఫ్రికాతో ఆ దేశ గడ్డపై జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ దారుణంగా ఓటమి పాలైంది. 273 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 53 పరుగులకే కుప్పకూలింది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో నమోదైన అత్యల్ప రికార్డు ఇదే. అంతేకాదు, ఇప్పటి వరకు టీమిండియా పేరుపై ఉన్న ఓ చెత్త రికార్డును బంగ్లాదేశ్ బద్దలుగొట్టింది. 1990లలో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్టు డర్బన్ టెస్టులో 66 పరుగులకే కుప్పకూలింది. ఇన్నాళ్లకు ఇప్పుడా చెత్త రికార్డును బంగ్లాదేశ్ తుడిచిపెట్టేసింది. 


నిజానికి ఈ టెస్టుకు ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని రికార్డులకెక్కిన బంగ్లాదేశ్.. టెస్టుల్లోనూ అదే జోరు ప్రదర్శిస్తుందని అందరూ భావించారు. అయితే, వారి అంచనాలు తలకిందులయ్యాయి. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులు చేసింది. ప్రతిగా బంగ్లాదేశ్ దీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులు చేసింది.


రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులు చేసిన చేసిన సఫారీలు బంగ్లాదేశ్‌కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాను కేశవ్ మహారాజ్ దారుణంగా దెబ్బకొట్టాడు. 10 ఓవర్లు వేసి 32 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు తీసుకున్నాడు. సిమన్ హార్మెర్ మూడు వికెట్ వికెట్లు తీశాడు. ఫలితంగా 20 ఓవర్లు కూడా క్రీజులో నిలవలేకపోయిన బంగ్లాదేశ్ 53 పరుగులకే కుప్పకూలి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. బంగ్లా జట్టులో నలుగురు ఆటగాళ్లు డకౌట్ కాగా, ఐదుగురు ఆటగాళ్లు కలిసి చేసినవి 27 పరుగులే. నజ్ముల్ హొసైన్ చేసిన 26 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.

Updated Date - 2022-04-05T01:46:05+05:30 IST