బెంగళూరు భళా

ABN , First Publish Date - 2021-04-15T07:58:00+05:30 IST

అప్పటిదాకా పరాజయం ఖాయమనే బెంగళూరు అనుకుంది. కానీ 17వ ఓవర్లో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మద్‌ ఆ ఓవర్లో మూడు వికెట్లు తీసి జట్టును రేసులో నిలిపాడు

బెంగళూరు భళా

ఆఖర్లో షాబాజ్‌ మాయ

ఆరు పరుగులతో హైదరాబాద్‌పై విజయం


అదే తీరు..హైదరాబాద్‌ ఆటలో లేని మార్పు..సునాయాసంగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది. 150 పరుగుల లక్ష్య ఛేదనలో 96/1తో పటిష్ట స్థితిలో నిలిచిన ఆ జట్టు ఆ తర్వాత ఒత్తిడిలో పడి  ఓటమి కొనితెచ్చుకుంది. మరోవైపు ఆశలు ఆవిరైన వేళ బెంగళూరు లెఫ్టామ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మద్‌ మాయ చేశాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఇక ఉత్కంఠ గెలుపు అందుకున్న ఆర్‌సీబీ పట్టికలో టాప్‌లో నిలిచింది. 


చెన్నై: అప్పటిదాకా పరాజయం ఖాయమనే బెంగళూరు అనుకుంది. కానీ 17వ ఓవర్లో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మద్‌ ఆ ఓవర్లో మూడు వికెట్లు తీసి జట్టును రేసులో నిలిపాడు. మరోవైపు ఒత్తిడికి లోనైన హైదరాబాద్‌ టపాటపా వికెట్లు చేజార్చుకుంది. ఫలితంగా బుధవారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 పరుగులతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 149/8 స్కోరే చేసింది. మ్యాక్స్‌వెల్‌ (41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59) హాఫ్‌ సెంచరీతో చెలరేగగా, కోహ్లీ (29 బంతుల్లో 4 ఫోర్లతో 33) రాణించాడు. హోల్డర్‌ (3/30) మూడు, రషీద్‌ఖాన్‌ (2/18) రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 143/9 స్కోరుకే పరిమితమై ఓడింది.  వార్నర్‌ (37 బంతుల్లో 7ఫోర్లు, సిక్సర్‌తో 54), మనీశ్‌ పాండే (38) తప్ప అంతా విఫలమయ్యారు. రషీద్‌ ఖాన్‌ (9 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌తో 17) ధనాధన్‌ బ్యాటింగ్‌ చేశాడు. షాబాజ్‌ అహ్మద్‌ (3/7) మూడు, సిరాజ్‌, హర్షల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. మ్యాక్స్‌వెల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 


వార్నర్‌, పాండ్యా మినహా..: ఓ మాదిరి లక్ష్య ఛేదనలో సాహా (1)ను స్వల్ప స్కోరుకే సిరాజ్‌ అవుట్‌ చేయగా..వార్నర్‌, మనీశ్‌ పాండే ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటింగ్‌ చేశారు. జేమిసన్‌ ఓవర్లో పాండే సిక్సర్‌, వార్నర్‌ ఫోర్‌, సిక్స్‌తో మొదలైన ఈ జోడీ దూకుడు వారు నిష్క్రమించే వరకూ కొనసాగింది. 13వ ఓవర్లో అర్థశతకం పూర్తి చేసిన వార్నర్‌ కొద్దిసేపటికే జేమిసన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దాంతో 83 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 


షాబాజ్‌ మాయ: చివరి దశలో వికెట్‌ స్పిన్‌కు అనుకూలించడంతో ఒకే ఒక్క ఓవర్‌ మ్యాచ్‌ గతిని మార్చివేసింది. 17వ ఓవర్లో స్పిన్నర్‌ షాబాజ్‌ అహ్మద్‌ సంచలన బౌలింగ్‌ చేశాడు. ఈ ఓవర్లో తొలుత బెయిర్‌ స్టో (12), ఆపై పాండే, అబ్దుల్‌ సమద్‌ (0)ను షాబాజ్‌ అవుట్‌ చేసి..బెంగళూరును పోటీలోకి తెచ్చాడు. విజయ్‌ శంకర్‌ (3)ను హర్షల్‌ పెవిలియన్‌కు చేర్చడంతో హైదరాబాద్‌ తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఆదుకుంటాడనుకున్న హోల్డర్‌ (4) విఫలమైనా రషీద్‌ ఖాన్‌ మెరుపు బ్యాటింగ్‌తో హైదరాబాద్‌లో ఆశలు రేపాడు. కానీ అతడు రనౌట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ అవకాశాలు అడుగంటాయి.

       

దక్కని శుభారంభం: టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి శుభారంభం దక్కలేదు. భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతిని మిడాఫ్‌ దిశగా చక్కటి ఫోర్‌ కొట్టిన కోహ్లీ ఖాతా ప్రారంభించాడు. యువ ఆటగాడు పడిక్కళ్‌.. హోల్డర్‌ ఓవర్లో రెండు బౌండరీలు బాది టచ్‌లోకొచ్చాడు. కానీ భువనేశ్వర్‌ వేసిన మూడో ఓవర్లో పుల్‌షాట్‌ సంధించబోయి నదీమ్‌కు చిక్కాడు. దాంతో 19 రన్స్‌ వద్దే బెంగళూరు తొలి వికెట్‌ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన పించ్‌ హిట్టర్‌ షాబాజ్‌ అహ్మద్‌ సిక్సర్‌తో జోరు చూపగా, నటరాజన్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన విరాట్‌ స్కోరులో వేగం పెంచే ప్రయత్నం చేశారు. పవర్‌ ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ 47/1తో నిలిచింది. కానీ తదుపరి ఓవర్లో స్పిన్నర్‌ నదీమ్‌..ప్రత్యర్థికి షాకిచ్చాడు. నదీమ్‌ బంతిని క్రీజ్‌ బయటికి వచ్చి భారీషాట్‌గా మలచబోయిన షాబాజ్‌..రషీద్‌ ఖాన్‌ పట్టిన అద్భుత క్యాచ్‌తో అవుటయ్యాడు. 


వరుస షాక్‌లు: 47/2తో కష్టాల్లోపడ్డ జట్టును కెప్టెన్‌ విరాట్‌-మ్యాక్స్‌వెల్‌ ఆదుకొన్నారు. నదీమ్‌ వేసిన 11వ ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ 6,4,6, కోహ్లీ 4 బాదడంతో బెంగళూరుకు 22 పరుగులొచ్చాయి. ఈ దశలో రెండో స్పెల్‌కు బౌలింగ్‌కు వచ్చిన హోల్డర్‌.. కోహ్లీని అవుట్‌ చేసి హైదరాబాద్‌కు పెద్ద బ్రేకిచ్చాడు. హోల్డర్‌ వేసిన షార్ట్‌బాల్‌ను లెగ్‌సైడ్‌లో షాట్‌గా కొట్టేందుకు విరాట్‌ యత్నించగా బంతి..బ్యాటు మధ్యలో తాకి చాలా ఎత్తులోకి వెళ్లింది. లాంగ్‌లెగ్‌లో ముందుకు పరుగెత్తుకొచ్చిన విజయ్‌ శంకర్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టాడు. మరోవైపు స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఆర్‌సీబీకి ఝలక్‌పై ఝలక్‌ ఇచ్చాడు. స్లో డెలివరీతో డివిల్లీర్స్‌ (1)ను బుట్టలో వేసుకున్న రషీద్‌ తన మరుసటి ఓవర్లో సుందర్‌ (8)ను అవుట్‌ చేశాడు. వెంటనే డాన్‌ క్రిస్టియన్‌ (1)ను కీపర్‌ సాహా క్యాచ్‌ ద్వారా నటరాజన్‌ అవుట్‌ చేశాడు. ఈ వికెట్‌పై బెంగళూరు రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. 


మ్యాక్స్‌వెల్‌ మెరుపులు: ఓ పక్క వరుస వికెట్లు పడుతున్నా.. మ్యాక్స్‌వెల్‌ భారీ షాట్లతో చెలరేగి స్కోరును పెంచాడు. భువనేశ్వర్‌, నటరాజన్‌ బౌలింగ్‌లో రెండేసి ఫోర్లు బాదాడు. ఈక్రమంలోనే హాఫ్‌ సెంచరీ (38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)పూర్తి చేశాడు. వెంటనే హోల్డర్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టిన మ్యాక్సీ మరోసారి అదే ప్రయత్నం చేయబోయి ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి క్యాచవుటయ్యాడు.  


స్కోరుబోర్డు

బెంగళూరు: కోహ్లీ (సి) విజయ్‌ శంకర్‌ (బి) హోల్డర్‌ 33; పడిక్కళ్‌ (సి) నదీమ్‌ (బి) భువనేశ్వర్‌ 11; షాబాజ్‌ అహ్మద్‌ (సి) రషీద్‌ (బి) నదీమ్‌ 14; మ్యాక్స్‌వెల్‌ (సి) సాహా (బి) హోల్డర్‌ 59; డివిల్లీర్స్‌ (సి) వార్నర్‌ (బి) రషీద్‌ 1; వాషింగ్టన్‌ సుందర్‌ (సి) మనీష్‌ పాండే (బి) రషీద్‌ 8; క్రిస్టియన్‌ (సి) సాహా (బి) నటరాజన్‌ 1; జేమిసన్‌ (సి) మనీష్‌ పాండే (బి) హోల్డర్‌ 12; హర్షల్‌ పటేల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 149/8; వికెట్ల పతనం: 1-19, 2-47, 3-91, 4-95, 5-105, 6-109, 7-136, 8-149; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-30-1; హోల్డర్‌ 4-0-30-3; షాబాజ్‌ నదీమ్‌ 4-0-36-1; నటరాజన్‌ 4-0-32-1; రషీద్‌ ఖాన్‌ 4-0-18-2. 


హైదరాబాద్‌: సాహా (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) సిరాజ్‌ 1; వార్నర్‌ (సి) క్రిస్టియన్‌ (బి) జేమిసన్‌ 54; మనీష్‌ పాండే (సి) హర్షల్‌ (బి) షాబాజ్‌ అహ్మద్‌ 38; బెయిర్‌స్టో (సి) డివిల్లీర్స్‌ (బి) షాబాజ్‌ అహ్మద్‌ 12; అబ్దుల్‌ సమద్‌ (సి అండ్‌ బి) షాబాజ్‌ అహ్మద్‌ 0; విజయ్‌ శంకర్‌ (సి) కోహ్లీ (బి) హర్షల్‌ 3; హోల్డర్‌ (సి) క్రిస్టియన్‌ (బి) సిరాజ్‌ 4; రషీద్‌ (రనౌట్‌) 17; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 2; షాబాజ్‌ నదీమ్‌ (సి) షాబాజ్‌ అహ్మద్‌ (బి) హర్షల్‌ 0; నటరాజన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 143/9; వికెట్ల పతనం: 1-13, 2-96, 3-115, 4-115, 5-116, 6-123, 7-130, 8-142, 9-142; బౌలింగ్‌: సిరాజ్‌ 4-1-25-2; జేమిసన్‌ 3-0-30-1; సుందర్‌ 2-0-14-0; చాహల్‌ 4-0-29-0; హర్షల్‌ పటేల్‌ 4-0-25-2; క్రిస్టియన్‌ 1-0-7-0; షాబాజ్‌ అహ్మద్‌ 2-0-7-3. 

Updated Date - 2021-04-15T07:58:00+05:30 IST