సిరాజ్ కమాల్‌ కోల్‌కతా ఢమాల్‌

ABN , First Publish Date - 2020-10-22T09:37:35+05:30 IST

మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు కోల్‌కతా కుప్పకూలింది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరచుకోవాలంటే నెగ్గాల్సిన కీలక మ్యాచ్‌లో..

సిరాజ్ కమాల్‌ కోల్‌కతా ఢమాల్‌

మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు కోల్‌కతా కుప్పకూలింది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరచుకోవాలంటే నెగ్గాల్సిన కీలక మ్యాచ్‌లో.. హైదరాబాదీకి నైట్‌రైడర్స్‌ దాసోహమైంది. బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో స్కోరు బోర్డుపై కనీసం వంద పరుగులైనా ఉంచలేకపోయింది. స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. అయితే, ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడడం.. ఫ్లేఆఫ్స్‌ రేసులో ఉన్న పంజాబ్‌, రాజస్థాన్‌కు శుభవార్తే!


అదరగొట్టిన బౌలర్లు

బెంగళూరు ఘన విజయం


గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకొని విమర్శలపాలైన యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఈసారి మాత్రం అదిరే ప్రదర్శనతో అందరిచేతా శభాష్‌ అనిపించుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతూ అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసి అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు మెయిడిన్‌ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు. 


అబుదాబి: పేసర్‌ సిరాజ్‌ (4-2-8-3) అద్భుత ప్రదర్శనతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఘన విజయాన్ని సొంతం చేసుకొంది. బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. సిరాజ్‌తోపాటు స్పిన్నర్‌ చాహల్‌ (2/15) దెబ్బకు తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 84/8 స్కోరుకే పరిమితమైంది. మోర్గాన్‌ (30) టాప్‌ స్కోరర్‌. స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగళూరు 13.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి నెగ్గింది. ఫెర్గూసన్‌ (1/17) గత మ్యాచ్‌ తరహాలో మ్యాజిక్‌ చేయలేక పోయాడు. దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (25), గుర్‌కీరత్‌ (21 నాటౌట్‌), విరాట్‌ కోహ్లీ (18 నాటౌట్‌) రాణించారు. కోల్‌కతా వెన్నువిరిచిన సిరాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. 

శ్రమపడకుండా..

బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగిన పిచ్‌పై.. కోల్‌కతా బౌలర్లు తేలిపోయారు. దీంతో ఓపెనర్లు దేవ్‌దత్‌ పడిక్కళ్‌, ఫించ్‌ (16) బెంగళూరుకు శుభారంభాన్నిచ్చారు. తొలి రెండు ఓవర్లు జాగ్రత్తగా ఆడినా.. మూడో ఓవర్‌లో కమిన్స్‌ బౌలింగ్‌లో పడిక్కళ్‌ తొలి బౌండ్రీ బాదాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన తర్వాతి ఓవర్‌లో ఫించ్‌ కూడా ఫోర్‌తో స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేశాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి బెంగళూరు వికెట్‌ కోల్పోకుండా 44 పరుగులతో చకచకా విజయం దిశగా సాగింది. అయితే, ఫించ్‌, పడిక్కళ్‌ వికెట్లను ఒకే స్కోరు వద్ద చేజార్చుకుంది. ఫించ్‌ను అవుట్‌ చేసిన ఫెర్గూసన్‌.. తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. పడిక్కళ్‌ను కమిన్స్‌ రనౌట్‌ చేశాడు. అనంతరం గుర్‌కీరత్‌ సింగ్‌, కోహ్లీ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును నడిపించారు. మూడో వికెట్‌కు అజేయంగా 39 పరుగులు జోడించిన వీరిద్దరూ.. మరో 39 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు.  

సిరాజ్‌ దెబ్బకు..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా.. పేసర్‌ సిరాజ్‌ దెబ్బకు పేకమేడలా కూలింది. ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (1), నితీష్‌ రాణా (0), టామ్‌ బాంటమ్‌ (10)ను అవుట్‌ చేసిన సిరాజ్‌.. నైట్‌రైడర్స్‌ పతనాన్ని శాసించాడు. 3 పరుగులకే 3 టాపార్డర్‌ వికెట్లు చేజార్చుకున్న కోల్‌కతా.. పవర్‌ ప్లే ముగిసే సరికి 17/4 స్కోరు మాత్రమే చేసింది. తొలి ఓవర్‌లో మోరిస్‌ 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన సిరాజ్‌.. మెయిడిన్‌ వికెట్లతో కోల్‌కతా బ్యాటింగ్‌ను కకావికలం చేశాడు. మూడో బంతికి త్రిపాఠిని క్యాచ్‌ అవుట్‌ చేసిన హైదరాబాదీ.. తర్వాతి బంతికి నితీష్‌ రాణాను బౌల్డ్‌ చేసి దిమ్మదిరిగే షాకిచ్చాడు. మూడో ఓవర్‌లో మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (1)ను సైనీ క్యాచ్‌ అవుట్‌ చేశాడు. తర్వాతి ఓవర్‌లో మరో మెయిడిన్‌తో బాంటమ్‌ను సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో కోల్‌కతా 14/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే కార్తీక్‌ (4), కెప్టెన్‌ మోర్గాన్‌ ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఏడో ఓవర్‌లో ఉడాన బౌలింగ్‌లో బౌండ్రీ బాదిన మోర్గాన్‌.. ఆ తర్వాత సైనీ బౌలింగ్‌లో సిక్స్‌తో స్కోరు వేగం పెంచాలని చూశాడు. కానీ, మధ్య ఓవర్లలో కోల్‌కతా భాగస్వామ్యాలు నిర్మించకుండా చాహల్‌ మాయాజాలం చేశాడు. కార్తీక్‌ను చాహల్‌ వికెట్లు ముందు దొరకబుచ్చుకోగా.. కమిన్స్‌ (4)ను క్యాచ్‌ అవుట్‌ చేశాడు. అయితే, కుల్దీప్‌ యాదవ్‌ (12) అండతో మోర్గాన్‌.. టీమ్‌ స్కోరు 50 పరుగుల మార్క్‌ దాటించాడు. కానీ, సుందర్‌ బౌలింగ్‌లో భారీషాట్‌ ఆడే క్రమంలో మోర్గాన్‌ అవుటయ్యాడు. ఇక కోల్‌కతా ఇన్నింగ్స్‌ ముగియడం లాంఛనమే అనుకొన్న దశలో కుల్దీప్‌, ఫెర్గూసన్‌ (19 నాటౌట్‌) 8వ వికెట్‌కు 27 పరుగులు జోడించి పరువు నిలిపే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి కుల్దీప్‌ రనౌటయ్యాడు. 


స్కోరుబోర్డు

కోల్‌కతా: శుభ్‌మన్‌ గిల్‌ (సి) మోరిస్‌ (బి) సైనీ 1, రాహుల్‌ త్రిపాఠి (సి) డివిల్లీర్స్‌ (బి) సిరాజ్‌ 1, నితీష్‌ రాణా (బి) సిరాజ్‌ 0, టామ్‌ బాంటమ్‌ (సి) డివిల్లీర్స్‌ (బి) సిరాజ్‌ 10, దినేష్‌ కార్తీక్‌ (ఎల్బీ) చాహల్‌ 4, ఇయాన్‌ మోర్గాన్‌ (సి) గుర్‌కీరత్‌ (బి) సుందర్‌ 30, ప్యాట్‌ కమిన్స్‌ (సి) పడిక్కళ్‌ (బి) చాహల్‌ 4, కుల్దీప్‌ యాదవ్‌ (రనౌట్‌/గుర్‌కీరత్‌/మోరి్‌స) 12, ఫెర్గూసన్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 84/8; వికెట్ల పతనం: 1-3, 2-3, 3-3, 4-14, 5-32, 6-40, 7-57, 8-84; బౌలింగ్‌: క్రిస్‌ మోరిస్‌ 4-1-16-0, మహ్మద్‌ సిరాజ్‌ 4-2-8-3, నవదీప్‌ సైనీ 3-0-23-1, ఇసురు ఉడాన 1-0-6-0, యజ్వేంద్ర చాహల్‌ 4-0-15-2, వాషింగ్టన్‌ సుందర్‌ 4-1-14-1. 

 బెంగళూరు: దేవ్‌దత్‌ పడిక్కల్‌ (రనౌట్‌/కమిన్స్‌) 25, ఫించ్‌ (సి) కార్తీక్‌ (బి) ఫెర్గూసన్‌ 16, గుర్‌కీరత్‌ సింగ్‌ (నాటౌట్‌) 21, కోహ్లీ (నాటౌట్‌) 18, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 13.3 ఓవర్లలో 85/2; వికెట్ల పతనం: 1-46, 2-46; బౌలింగ్‌: కమిన్స్‌ 3-0-18-0, ప్రసిద్ధ్‌ కృష్ణ 2.3-0-20-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-28-0, ఫెర్గూసన్‌ 4-0-17-1. 

Updated Date - 2020-10-22T09:37:35+05:30 IST