మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో తాజా సంచలనం బండ్ల గణేష్. మెగా ఫ్యామిలీకి వీర విధేయుడు అయిన బండ్ల గణేష్.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. జనరల్ సెక్రెటరీ పదవికి జీవితా రాజశేఖర్‌పై పోటీ చేసి గెలుస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్‌తో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ‘ది డిబేట్’ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ తన దేవుడు పవన్ కల్యాణ్‌పై ఒట్టు వేశారు.
ప్రకాష్ రాజ్ ప్యానల్లోకి జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వడం నచ్చక మెగా ఫ్యామిలీయే బండ్ల గణేష్‌ను బయటకు రమ్మని చెప్పిందనే రూమర్‌పై ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ వేదికగా క్లారిటీ వచ్చింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లడుతూ...‘‘పవన్ కల్యాణ్ గారి మీద ఒట్టు. నా తల్లిదండ్రులు, బిడ్డల సాక్షిగా నన్ను ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు రమ్మని చిరంజీవిగారు కానీ, వాళ్ల ఫ్యామిలీవాళ్లు గానీ ఎవరూ చెప్పలేదు. దయచేసి నన్ను నమ్మండి. నా మనస్సాక్షికి నచ్చకే నేను బయటకు వచ్చా.’’ అని స్పష్టం చేశారు.
జీవితా రాజశేఖర్ ఎన్ని మాట్లాడినా.. మెగా ఫ్యామిలీ క్షమించవచ్చేమో గానీ, తాను మాత్రం క్షమించలేనని బండ్ల గణేష్ తేల్చి చెప్పారు. మెగా ఫ్యామిలీ వాళ్లు గొప్పవాళ్లని వాళ్లకు క్షమించే గుణం ఎక్కువని, కానీ తాను అంత గొప్పవాడిని కాదన్నారు.