Bandi Sanjay: సీఎం కేసీఆర్ నోరు విప్పితే అబద్దాలే.. చేసేవన్నీ మోసాలే..

ABN , First Publish Date - 2022-08-22T19:44:26+05:30 IST

బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది.

Bandi Sanjay: సీఎం కేసీఆర్ నోరు విప్పితే అబద్దాలే.. చేసేవన్నీ మోసాలే..

జనగామ (Janagama): తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangram Yatra) జనగామ జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం మీదికొండ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ (CM KCR) చెప్పేవన్నీ అబద్ధాలేనని.. చేసేవన్నీ మోసాలేనని విమర్శించారు. బీజేపీ (BJP) వస్తే మీటర్లు పెడతారని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను బ్లాక్‌మెయిల్‌ (Blackmail) చేస్తున్నారని ఆరోపించారు. మోటార్లకు మీటర్లు (meters) పెట్టాల్సిన అవసరమే లేదని తెలంగాణ బీజేపీ నిరూపిస్తుందని, దీనిపై ఆధారాలు కూడా చూపిస్తామన్నారు.


బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు ఇబ్బందులుపడుతున్నట్లు సీఎం కేసీఆర్‌ చూపించగలరా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరమే లేదన్నారు. కేంద్రం చేసిన చట్టంలో యాక్ట్‌ కాపీలో స్పష్టంగా ఉందన్నారు. కరెంట్‌ కొనుగోలు పేరుతో విద్యుత్‌ సంస్థల దగ్గర రూ.50 వేలకోట్ల అప్పు చేశారని, అప్పు తీర్చకపోతే రాష్ట్రంలోని డిస్కంలన్నీ కుప్పకూలే పరిస్థితి ఉందన్నారు. కమ్యూనిస్టులు ‘ఎర్రగులాబీలు'గా మారి కేసీఆర్‌ పక్కన చేరారని విమర్శించారు. బీజేపీని ఓడిస్తేనే తమకు మనుగడ ఉంటుందనే భావనతో.. కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌ కోవర్టుల్లా మారిపోయారని బండి సంజయ్‌ ఆరోపించారు.


కాగా మీదికొండ క్రాస్ నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర శివారెడ్డిపల్లి, చాగల్, స్టేషన్ ఘనపూర్ మీదుగా పామునూర్‌కు చేరుకోనుంది. ఇవాళ రాత్రి పామునూరు సమీపంలోనే బస చేయనున్నారు. నిన్న మునుగోడులో అమిత్ షా సభ కారణంగా బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇవాళ నుంచి మళ్లీ యధావిధిగా పాదయాత్ర కొనసాగుతోంది.

Updated Date - 2022-08-22T19:44:26+05:30 IST