Abn logo
Sep 24 2021 @ 01:28AM

ఉద్యమాలకు అడ్డా... రాజన్న సిరిసిల్ల గడ్డ

ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

- ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తే వదిలిపెట్టం

- బస్‌, కరెంట్‌ ఛార్జీలు పెంచితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం

- తెలంగాణలో సర్పంచ్‌లు అస్తులు అమ్ముకుంటున్నారు

- అక్టోబరు 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా దళితబంధుకు ఆందోళనలు 

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

- రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఉద్యమాలకు అడ్డ రాజన్న సిరిసిల్ల గడ్డ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. గురువారం ప్రజా సంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్ట్‌ నుంచి మొదలైంది. 27వ రోజు యాత్ర జిల్లా సరిహద్దు నుంచి గంభీరావుపేట మండల కేంద్రం, లింగన్నపేట గ్రామం వరకు 13 కిలోమీటర్ల మేరకు యాత్ర కొనసాగింది. గంభీరావుపేట, లింగన్నపేటలో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ సిరిసిల్ల గడ్డ నుంచే సాధించుకున్న తెలంగాణ ఈ రోజు పేదలకు, నిరుద్యోగుల అడ్డాగా మారిందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం 9, 10, 11 ప్యాకేజీ పనుల్లో 9వ ప్యాకేజీ పనులు ముందు ఎందుకు కావడం లేదని అన్నారు. 10, 11 ప్యాకేజీ పనులు ఎందుకు పూర్తయ్యాయని అ నీళ్లు ఎక్కడికి వెళ్లాయో తెలుసుకోవాలని అన్నారు. ఇక్కడ నీళ్లివ్వకుండా ఎక్కడికో వెళితే ఎందుకు ఊరుకోవాలని అన్నారు. చెక్‌డ్యాలు కొట్టుకుపోతున్నాయని అన్నారు. మొన్నటి వర్షాల్లో సిరిసిల్లలో పరిస్థితి ఏమిటో మనందరం చూశామని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో నాకు లభించిన ఘన స్వాగతానికి అనంద భాష్పాలతో కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు. కరీంనగర్‌ ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపించారని, 370 అర్టికల్‌ రద్దు బిల్లులో పాల్గొనేలా చేసినందుకు ధన్యవాదాలని అన్నారు. ఉద్యమించాలని కేసులు పెడితే భయపడవద్దని అన్నారు. నాపై కూడా 62 కేసులు ఉన్నాయని అన్నారు. కోర్టు వద్ద నీళ్లు, తిండి లేకుండా నిలబడ్డ పరిస్థితులు గుర్తు చేశారు. తాను ధర్మం కోసం కోట్లాడుతున్నానని అన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమని అన్నారు. మేము పోలీసులకు వ్యతిరేకం కాదని టీఆర్‌ఎస్‌ కోసం త్యాగాలు చేయలేదని అన్నారు. అందరం తెలంగాణ కోసం పోరాటం చేశామని అన్నారు. కొందరు పోలీసులు దుర్మార్గమైన పాలనలో పనిచేయలేమని లూప్‌లైన్‌లోకి వెళ్లారని అన్నారు. పైరవీలు చేసి కోట్లు సంపాదించుకున్నవారే కేసీఆర్‌ కుటుంబం మోచేతి నీళ్లుతాగి అధికారం చెలాయిస్తున్నారని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై అనవసరంగా కేసులు పెడితే నేనే పోలీస్‌స్టేషన్‌కు వస్తానని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం రాబోతుందని అందరి జాబితాలు తయారు చేస్తున్నామని అన్నారు. గంభీరావుపేట మండలానికి కేంద్రం నుంచి వచ్చిన పథకాల నిధుల మంజూరు జాబితాను చదివి వినిపించారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ బ్రిడ్జి కట్టించలేని పరిస్థితి ఉందని విమర్శించారు.  

వరి.. ఉరి అంటూ బెదిరింపులు

వరి.. ఉరి అంటూ ముఖ్యమంత్రి రైతులను బెదిరిస్తున్నారని.. బియ్యం కొనమని మోదీ నీకు ఫోన్‌ చేసి చెప్పారా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో మోసం చేస్తే వదిలిపెట్టమని బండి సంజయ్‌ హెచ్చరించారు. కాళేశ్వరం జలాలతో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తానని చెప్పినప్పుడు పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని తెలియదా అని అన్నారు. ప్రణాళికలు, నీ అంచనాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒకసారి దొడ్డు వడ్లు వద్దని సన్నరకమని ఒకసారి, మక్కలు వద్దని మరోసారి, ఇప్పుడు వరి ఉరి అని రైతులను బెదిరింపులకు మోసాలకు గురి చేస్తే వదిలిపెట్టమని అన్నారు. బస్‌, కరెంట్‌ ఛార్జీలు పెంచితే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. ఆర్టీసీ అప్పులపాలయిందని చెప్పడానికి ఆర్టీసీ అస్తులు అమ్ముకోవడానికి స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు ఏర్పాటు చేసుకోవడానికి కుట్ర చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ బస్‌ ఛార్జీలు, కరెంట్‌ ఛార్జీలు పెంచితే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధుతో పాటు నేతన్నలకు, బీసీ, బడుగు బలహీనవర్గాలకు కులాల వారీగా బంధు పథకాన్ని అమలు చేయాలని లేని పక్షంలో అక్టోబరు 2 నుంచి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని అన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో 20 మంది సర్పంచ్‌లు రాజీనామాలు చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో వైకుంఠధామాలు, రైతు వేదికలు, ఇలా అన్ని పనుల్లోనూ కేంద్రం నిధులు ఉంటే వాటికి గులాబీ రంగు వేసుకుంటున్నారని అన్నారు. పైసలు కేంద్రానివి, ప్రచారం గులాబీలదని అన్నారు. మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లకు ఏం చేశాడని అన్నారు. ఈ యాత్రలో ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్‌, గంభీరావుపేట సర్పంచ్‌ కటకం శ్రీధర్‌,  బీజేపీ నాయకులు మనోహర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రమాకాంత్‌రావు, గోపి, మళ్లిఖార్జున్‌, అన్నల్‌దాస్‌ వేణు, అడెపు రవీందర్‌, గౌడ వాసు, పార్టీ మండల   అధ్యక్షుడు గంట అశోక్‌, ఎంపీటీసీ రాజేందర్‌రెడ్డి, నాయకులు దెవసాని కృష్ణ, ప్రసాద్‌రెడ్డి, స్వామి, లక్ష్మన్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు.