తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబానికే ఉద్యోగాలు

ABN , First Publish Date - 2021-09-16T04:47:52+05:30 IST

నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల్విని సీఎం కేసీఆర్‌ తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబానికే ఉద్యోగాలు
పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌

నిరుద్యోగులను గాలికి వదిలేశారు

రుణమాఫీ చేయకుండా రైతులకు మొండిచేయి

దళితులకు మూడెకరాల భూమి ఏమైంది?

నియంతృత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయ్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 


హవేళీఘణపూర్‌, సెప్టెంబరు 15: నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల్విని సీఎం కేసీఆర్‌ తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. మెదక్‌ జిల్లా హవేళీఘణపూర్‌ మండలం శాలిపేట గేటువద్ద నుంచి 19వ రోజు ప్రజా సంగ్రామయాత్రను బుధవారం ఆయన ప్రారంభించారు. భొగడభూపతిపూర్‌ గ్రామానికి చెందిన మహిళలు ఆయనను కలిసి భూసమస్యను పరిష్కరించాలని విన్నవించారు. అనంతరం గాజిరెడ్డిపల్లి, బూర్గుపల్లి గేటు మీదుగా పాదయాత్ర సాగింది. బూర్గుపల్లిలో పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి, కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటుచేసి, టీఆర్‌ఎస్‌ రంగులు వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం యాత్రలో భాగంగా పోచారం అటవీ ప్రాంతంలో పనులు చేస్తున్న గిరిజన మహిళలతో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటి వరకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఇచ్చిందా అని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు ఇవ్వలేదని, పించన్లు సైతం రావడంలేదని మహిళలు వివరించారు. పోచమ్మరాల్‌ తండా గ్రామంలో సేవాలాల్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు. గిరిజనులతో మాట్లాడి పంట రుణాలు మాఫీ అయ్యాయా అని తెలుసుకున్నారు. తండాలో గిరిజనుల ఇళ్లకి వెళ్లి వారితో మాట్లాడారు. పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పోచమ్మరాల్‌ తండాలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు బీజేపీలో చేరారు. అనతరం పాదయాత్ర కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి మండలం పోచారం వైపు సాగింది. ఈ సందర్భంగా ఆయా ప్రదేశాల్లో ఆయన మాట్లాడుతూ 1,200 మంది యువత బలిదానంతో వచ్చిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే అందరికీ ఉద్యోగాలు వస్తాయనుకుంటే.. కేసీఆర్‌ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, నిరుద్యోగులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని ఆ తరువాత ముఖం చాటేయడం కేసీఆర్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ మాట కేసీఆర్‌ మర్చిపోయారన్నారు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతువేదికలు, ఉపాధిహామీ పథకం, ఉచిత మరుగుదొడ్ల నిర్మాణం, కరోనా వ్యాక్సినేషన్‌.. ఇలా రాష్ట్రంలో చేపడుతున్న అనేక పథకాలకు కేంద్రప్రభుత్వమే నిధులు ఇస్తున్నదని పేర్కొన్నారు. రూపాయికి కిలో బియ్యం పంపిణీ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కిలో బియ్యానికి రూ. 29 చెల్లిస్తున్నదని,  కేసీఆర్‌ మాత్రం తానే బియ్యం ఇస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, వచ్చే ఎన్నిల్లో ప్రయజే ఆయనకు బుద్దిచెప్తారని స్పష్టం చేశారు. పాదయాత్రంలో కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతానాయక్‌, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకే్‌షరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, జిల్లా నాయకులు శ్రీపాల్‌, నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-16T04:47:52+05:30 IST