కేసీఆర్‌ అవినీతి రాజ్యాన్ని అంతమొందిస్తాం

ABN , First Publish Date - 2022-05-16T08:43:23+05:30 IST

సీఎం కేసీఆర్‌ అవినీతి, దోపిడీ రాజ్యాన్ని అంతమొందించి, సాయిగణేష్‌ స్ఫూర్తితో పోరాడి బీజేపీని అధికారంలోకి తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర..

కేసీఆర్‌ అవినీతి రాజ్యాన్ని  అంతమొందిస్తాం

యువరాజుకు విదేశాల్లో వ్యాపారాలు.. పువ్వాడ సంగతి తేలుస్తాం: సంజయ్‌

సాయిగణేష్‌ కుటుంబానికి పరామర్శ.. ఇంటి తాళాలు అందజేత

ఖమ్మం, మే 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీఎం కేసీఆర్‌ అవినీతి, దోపిడీ రాజ్యాన్ని అంతమొందించి, సాయిగణేష్‌ స్ఫూర్తితో పోరాడి బీజేపీని అధికారంలోకి తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ నుంచి మంత్రుల వరకు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆ సొమ్ము సీఎంవోకు వెళ్తోందని ఆరోపించారు. మంత్రులు, టీఆర్‌ఎస్‌ నాయకుల అరాచకాలకు భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిపట్ల కేసీఆర్‌ అందుకే విచారణలు కూడా చేయించడంలేదని మండిపడ్డారు.


విదేశాల్లో వ్యాపారాలు సాగిస్తున్న యువరాజు సంగతి, బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌ సంగతి చూస్తామని హెచ్చరించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మజ్దూర్‌ సంఘ్‌ ఖమ్మం జిల్లా కన్వీనర్‌ సాయిగణేష్‌ కుటుంబాన్ని ఆదివారం ఆయన ఖమ్మంలో పరామర్శించారు. సారఽథినగర్‌లోని సాయిగణేష్‌ నివాసానికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాయిగణేష్‌ ఆత్మహత్య ఘటనలో సీఎంవో ఆదేశాల మేరకే మరణ వాంగ్మూలం తీసుకోలేదని ఆరోపించిన సంజయ్‌.. బీజేపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టిస్తూ వేధిస్తున్నవారిని తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టమని హెచ్చరించారు. సాయిగణేష్‌ మరణం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సీరియ్‌సగా ఉన్నారని తెలిపారు. హై కోర్టు ఆదేశాలు వస్తే ఈ కేసులో సీబీఐ విచారణ సాగిస్తుందని పేర్కొన్నారు.


పువ్వాడపై కేసు ఎందుకు పెట్టలేదు?

మంత్రి పువ్వాడ, ఖమ్మం పోలీసుల బెదిరింపులు, అరాచకాల వల్లే సాయిగణేష్‌ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని సంజయ్‌ అన్నారు. ఆత్మహత్యకు మంత్రి, పోలీసులే కారణమని సాయిగణేష్‌ మీడియాకు తెలిపాడని, అయినా ఇప్పటివరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు. అజయ్‌ కమ్మ కులాన్ని అడ్డంపెట్టుకుని పదవి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన్ను ఎట్టి పరిస్థితులో వదిలేది లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. అయినా ప్రభుత్వంలో స్పందన లేదని సంజయ్‌ అన్నారు. నేరస్థులు, దోపిడీదారులకు ప్రభుత్వం అండగా ఉంటోందని, పోలీసులు మద్దతు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లే టీఆర్‌ఎస్‌ నాయకుల్లా మాట్లాడుతున్నారని, సాయిగణేష్‌ క్రిమినల్‌ అని సమావేశాలు ఎలా పెడతారని ప్రశ్నించారు.


కాగా, సాయిగణేష్‌ అమ్మమ్మ సావిత్రమ్మ, కుటుంబసభ్యులను ఓదార్చిన సంజయ్‌.. బీజేపీ ఆర్థిక సహకారంతో ఖమ్మం సారథినగర్‌లో రూ.15 లక్షలతో కొన్న ఇంటికి సంబంధించిన పత్రాలను వారికి అందజేశారు. అలాగే, ఇటీవల టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిలో గాయపడిన హిందూవాహిని జిల్లా కన్వీనర్‌ పోతుల చంద్రశేఖర్‌ను ఆయన పరామర్శించారు. సంజయ్‌ వెంట బీజేపీ నేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, గరికపాటి రామ్మెహన్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి, సురే్‌షరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, గల్లా సత్యనారాయణ  ఉన్నారు.


అబద్ధాలకు అడ్డా.. హరీశ్‌: లక్ష్మణ్‌

అబద్ధాలకు అడ్డా మంత్రి హరీశ్‌రావు అని, అమిత్‌ షా వ్యాఖ్యలను వక్రీకరించారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. అబద్ధాల కోసం యూనివర్శిటీ పెడితే ఆయనే మొదటి వీసీ.. అబద్ధాలు చెప్పడంలో హరీశ్‌కు అత్యున్నత అవార్డు ఇవ్వొచ్చని విమర్శించారు. అమిత్‌ షా సభ విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక మంత్రులు దిగజారి విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్‌ మాట్లాడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రాకుండా చూడాలని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మందకృష్ణ, షర్మిల, ఆర్‌.కృష్ణయ్య, కోదండరామ్‌కు విజ్ఞప్తి చేశారు.


మంత్రి కేటీఆర్‌ భాష చూస్తే చదువుకున్న వ్యక్తిలా లేరని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రజలు తన మాటలను నమ్మడం లేదని కేటీఆర్‌ను కేసీఆర్‌ రాష్ట్రంపైకి వదిలారని ఆరోపించారు. మోదీని విమర్శించే స్థాయి మీకుందా? తిట్ల పురాణమే మీ సంస్కారమా? అని నిలదీశారు. దమ్ముంటే పోలీసుల్లేకుండా గ్రామాలకు వెళ్లాలని కేటీఆర్‌కు సవాల్‌ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మతి స్థిమితం కోల్పోయారని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ అన్నారు.

Updated Date - 2022-05-16T08:43:23+05:30 IST