ఎన్నికలొస్తే అవాకులు చవాకులు

ABN , First Publish Date - 2021-07-26T08:12:59+05:30 IST

సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సలో నిద్రపోయి, ఎన్నికలోస్తే హైదరాబాద్‌కు వచ్చి అవాకులు, చవాకులు పేలుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

ఎన్నికలొస్తే అవాకులు చవాకులు

అప్పటిదాకా ఫాంహౌ్‌సలో నిద్రపోతారు

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌

నేను తప్పుచేస్తే ఎందుకు తేల్చడం లేదు

సీఎం కేసీఆర్‌ అబద్ధాల కోరు: ఈటల


హైదరాబాద్‌/సిటీ/కమలాపూర్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సలో నిద్రపోయి, ఎన్నికలోస్తే హైదరాబాద్‌కు వచ్చి అవాకులు, చవాకులు పేలుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. లేనిపోని హామీలిస్తూ కుల, వర్గాల పేరుతో సమాజాన్ని చీల్చే ప్రయత్నాలను అమ్మవారు చూస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి ఒక మంచి ఆలోచన కల్పించాలని తల్లిని కోరానని తెలిపారు. ఆదివారం ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని, ప్రధాని మోదీ ప్రజలకు ఉన్నత సేవలు అందించేలా మరింత శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నానని వెల్లడించారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌తో పాటు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఎంపీ సోయం బాపురావు డిమాండ్‌ చేశారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. ఆదివారం రాష్ట్రపార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సర్కారు దళితులు, గిరిజనులు, బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ నెల 30న ఇందిరా పార్కు వద్ద బీజేపీ ధర్నా నిర్వహిస్తుందని ప్రకటించారు. 


రాష్ట్రమంతా దళిత బంధు ఇవ్వాలి..

తాను నిజంగా తప్పుచేస్తే సీఎం కేసీఆర్‌ ఎందుకు తేల్చడం లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ అబద్ధాల కోరు అని, ఆయన చేసేవన్నీ కుట్రలని విమర్శించారు. ఈటల చేపట్టిన ప్రజాదీవెన పాదయాత్ర ఆదివారం (7వ రోజు) కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామం నుంచి వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం గుండేడు గ్రామానికి చేరుకుంది. గుండేడు నుంచి కొత్తపల్లి, కన్నూరు, కమలాపూర్‌ గ్రామాల వరకు పాదయాత్ర నిర్వహించారు. రాత్రి కమలాపూర్‌లో బస చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. ‘పార్టీని బలోపేతం చేసిన నేను.. ముఖ్యమంత్రికి దయ్యం అయ్యానా? దళితుల భూములను ఆక్రమించుకుంటానా? ఆ ఆవసరం ఉందా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌ చేతుల్లోనే అధికార యంత్రాంగం ఉందని, విచారణ చేసి తన తప్పును ఎందుకు తేల్చడంలేదని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాను ప్రజల పక్షాన కొట్లాడే బిడ్డనని, తన గొంతు మూగబోతే అడిగేవాడు ఉండడని సీఎం అనుకుంటున్నారని తెలిపారు. గ్రామాల్లోకి వెళితే కరెంట్‌ కట్‌ చేసి, ఫ్లెక్సీలను చించుతున్నారని ఆరోపించారు.

Updated Date - 2021-07-26T08:12:59+05:30 IST