Abn logo
Sep 22 2021 @ 00:25AM

బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా 27న బంద్‌

సమావేశంలో మాట్లాడుతున్న వామపక్ష నాయకులు

బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా 27న బంద్‌

సీఎ్‌సపురం, సెప్టెంబరు 21 : కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు ఊసా వెంకటేశ్వర్లు, ఎస్‌.తిరుపతిరెడ్డిలు కోరారు. స్థానిక నారాయణస్వామి కాంప్లెక్ష్‌లో మంగళవారం ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సంస్కరణ బిల్లులు, కార్మిక చట్టాల్లో మార్పులు, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం వంటి కార్యక్రమాలు ప్రజల మీద భారం వేయడమే అన్నారు. ప్రభుత్వ సొమ్మును కార్పొరేట్‌ సంస్థలకు దోచి పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసం చేపడుతున్న బంద్‌లో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రత్నం, లక్ష్మయ్య, నారాయణ, రమణమ్మ, నారయ్య, సుబ్బయ్య, రామయ్య, ఖాదర్‌మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

పామూరు : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు, ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 19 రాజకీయ పార్టీలు, 500 రైతు సంఘాలు, 450 కార్మిక సంఘాలు కలిసి ఈ నెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ మౌలాలి, సీపీఎం మండల కార్యదర్శి కె మాల్యాద్రిలు పిలుపునిచ్చారు. స్థానిక జీవైఆర్‌ భవనంలో వామపక్షపార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. కార్మికుల హక్కులకు భంగం కలిగే నాలుగు లేబర్‌ కోడ్‌లను, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పరాదని, పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ధరలను తగ్గించానలి, కరోనా కారణంగా ఉపాధిని కోల్పొయిన అసంఘటిత కార్మికుల ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ నాయకులు పి ప్రభాకర్‌, వజ్రాల సుబ్బారావు, పాలపర్తి మస్తాన్‌రావు, గులాం, సీపీఎం నాయకులు అల్లాభక్షు, వై.వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

ఉలవపాడు : ఈ నెల 27 న జరిగే భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని మంగళవారం అలగాయపాలెం గ్రామంలో పోస్టర్లను ఆవిష్కరించినట్లు ఐఎ్‌ఫటీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌ మోహన్‌ తెలిపారు. 10 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం రైతులు పోరాడుతున్నా మోడీ ప్రభుత్వం స్పందించకపోవడంపై అఖిల భారత పోరాట సమన్వయ కమిటీ, సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మోహన్‌ మాట్లాడుతూ..రైతులకు నష్టం చేకూర్చే రైతువ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్‌లుగా చేసి కార్మికుల హక్కులను కాలరాసిందన్నారు. బీజేపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతులు, రైతుకూలీలు, కార్మికులు భారత్‌ బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, ఐఎఫటీయూ నాయకులు సీహెచ్‌ రవి, ఆర్‌ ఇశ్రాయేలు, ఆర్‌ మల్లికార్జున్‌ పాల్గొన్నారు.