Abn logo
Sep 28 2021 @ 00:50AM

బంద్‌ సక్సెస్‌

బీసెంట్‌ రోడ్డులో పోలీసు పహారా

నిలిచిన రవాణా

వాణిజ్య లావాదేవీలకూ ఎఫెక్ట్‌

జోరువానలో నిరసన ర్యాలీలు


ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. లారీలు లోడు ఎత్తలేదు. కూలీలు కాలు కదపలేదు. దుకాణాలు షెట్టర్లు తీయలేదు. మొత్తంగా జిల్లా అంతటా సకలం స్తంభించిపోయింది. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. జిల్లావ్యాప్తంగా జోరు వర్షంలో సైతం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆయా రాజకీయపార్టీల కార్యకర్తలు బంద్‌లో భాగంగా ర్యాలీలు నిర్వహించారు.


విజయవాడ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ నగరంతో సహా జిల్లావ్యాప్తంగా బంద్‌ విజయవంతమైంది. సీపీఎం, సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్‌ పక్షాలు బంద్‌లో చురుగ్గా పాల్గొన్నాయి. ఈ బంద్‌కు వైసీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఉదయం ఆరు గంటలకు పీఎన్‌బీఎస్‌ నుంచి బంద్‌ ర్యాలీ ప్రారంభమైంది. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ, పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహరావు, సీపీఐ (ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి కె.పోలారి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు, సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్‌, దోనేపూడి కాశీనాథ్‌, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు ఎం.సాంబశివరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పీఎన్‌బీఎస్‌ నుంచి పాదయాత్రగా ర్యాలీని నిర్వహించారు. నగరంలో ఉన్న వివిధ ప్రాంతాలకు వేర్వేరు బృందాలు వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. 


స్వచ్ఛందంగా వ్యాపార దుకాణాల బంద్‌

బంద్‌ కారణంగా చాలామంది వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. బంద్‌కు సర్కారు సంఘీభావం ప్రకటించడంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. జిల్లా లారీ యజమానులు కూడా బంద్‌లో పాల్గొన్నారు. నిత్యావసర సరుకులను తరలించే లారీలన్నీ స్టాండ్లకు పరిమితమయ్యాయి. ఇవికాకుండా గూడ్స్‌ ఆటోలు, వ్యాన్‌లు ముందుకు కదల్లేదు. అఖిలపక్షంతోపాటు ఆయా పార్టీల అనుబంధ సంఘాలు బంద్‌లో కీలకంగా వ్యవహరించాయి. తెల్లవారుజాము నుంచి జోరు వర్షంలో తడుస్తూనే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు. ఈ బంద్‌లో పలు ప్రజాసంఘాలు, ఐద్వా, పీవోడబ్ల్యూ సంఘాలకు చెందిన మహిళా నాయకులు చురుగ్గా పాల్గొన్నారు. 


రైతు సంఘాల ఆధ్వర్యంలో...

వ్యవసాయ నల్లచట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. విజయవాడలో రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, కౌలు రైతుల సంఘం నాయకులు పి.జమలయ్య తదితరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాంధీనగర్‌, గవర్నరుపేట, కారల్‌మార్క్స్‌ రోడ్డు, బీసెంట్‌ రోడ్డుల్లో మోటారు సైకిళ్ల ప్రదర్శన నిర్వహించారు.


అంబానీ, ఆదానీల కోసమే పనిచేస్తున్నారు

ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, ఆదానీలనుకు కారు చౌకగా కట్టబెట్టాలని బీజేపీ పనిచేస్తోంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీలో పది నెలలుగా పోరాటం చేస్తున్నారు. కనీసం వారితో చర్చలు జరపడానికి కూడా మోదీ ముందుకు రాలేదు. మానిటైజేషన్‌ పేరుతో అన్ని ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ పరం చేస్తున్నారు. - కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి


ధీమాతోనే రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు

అత్యధిక స్థానాలున్నాయన్న ధీమాతోనే బీజేపీ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు చేపడుతోంది. బరితెగించి ప్రజలపై భారాలు మోపుతోంది. పెట్రోలు, డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచింది. నిత్యావసర వస్తువులపై భారీగా పన్నులు వేస్తోంది. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయపక్షాలు ఏకమయ్యాయి. బీజేపీ పాలనపై ప్రజల్లో ప్రతిఘటన ఏర్పడుతోంది. - పి.మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి


ప్రజల ఆస్తుల అమ్మకమే పనిగా పెట్టుకున్నారు 

దేశంలో ఉన్న ప్రజల ఆస్తులను విక్రయించడమే బీజేపీ పనిగా పెట్టుకుంది. భారతదేశం ప్రజల రాజ్యం. కొత్తకొత్త ఆర్థిక విధానాలతో ప్రజల ఆస్తిని నిలువునా దోచేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మే చర్యలను కేంద్రం ఉపసంహరించుకోవాలి.  - సాకే శైలజానాథ్‌, పీసీసీ చీఫ్‌ 

బంద్‌ సందర్భంగా పీఎన్‌బీఎస్‌ నుంచి మొదలైన అఖిలపక్ష నేతల ర్యాలీ


విజయవాడలో డిపోకే పరిమితమైన బస్సులు