‘ఉక్కు’ను వదలం!

ABN , First Publish Date - 2021-03-06T05:07:35+05:30 IST

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాల్సిందేనంటూ రాజకీయ, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో నినదించాయి.

‘ఉక్కు’ను వదలం!
నెల్లూరులో మూతపడిన దుకాణాలు

రాజకీయ, ప్రజాసంఘాల నిరసన

ప్రదర్శనలు, ఆందోళనలు

ఆగిన ఆర్టీసీ, మూతపడ్డ పాఠశాలలు 

బంద్‌ ప్రశాంతం


నెల్లూరు (వైద్యం), మార్చి 5 : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాల్సిందేనంటూ రాజకీయ, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో నినదించాయి. ఆ కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.  పలు రాజకీయ పార్టీల నేతలు, కార్మిక, విద్యార్థి సంఘాలు పాల్గొని ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం తెలుపడంతో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్డెక్కలేదు. దుకాణాలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. విద్యాసంస్థలతోపాటు, పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి.


నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్‌ నుంచి వీఆర్సీ కూడలి వరకు, అయ్యప్పగుడి సెంటర్‌ నుంచి వీఆర్సీ వరకు వామపక్షాలు, టీడీపీ శ్రేణులు ప్రదర్శనలు నిర్వహించా యి. అనంతరం అంబేద్కర్‌ బొమ్మ వద్ద నిరసన తెలిపాయి. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాంధీబొమ్మ వద్ద కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాలు ఆందోళనకు దిగాయి. కొత్తూరు, రామకోటయ్య నగర్‌లో సీపీఎం రాస్తారో కో చేసింది. ఇండియన్‌ ముస్లిం లీగ్‌ నాయకులు బ్యాంకులను మూయించారు. ఈ సందర్భంగా టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. రియల్‌ఎస్టేట్‌ కోసం ఆ భూముల అమ్మకానికి చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు  రెడ్డి మాట్లాడుతూ గాలి జనార్దనరెడ్డికి ఇచ్చిన ఐరన్‌వోర్‌ను విశాఖ ఉక్కుకు ఇచ్చిఉంటే నష్టాలు వచ్చి ఉండేవి కావన్నారు. ప్రధాని మోదీ, సీఎం జగన్‌ కలిసి విశాఖ ఉక్కును అమ్మేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా విశాఖ ఉక్కు నిలుస్తుందన్నారు. అలాంటి సంస్థ ప్రైవేటీకరణ దుర్మార్గమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌, నగర కార్యదర్శి మూలం రమేష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కటారి అజయ్‌కుమార్‌, మాదాల వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొంటామన్నారు. వేలాది మంది కార్మికులకు ఆధారమైన ఆ సంస్థ పరిరక్షణకు పార్టీలకు అతీతంగా అందరూ పోరాడాలని కోరారు. కాంగ్రెస్‌ నేతలు ఏటూరు శ్రీనివాసులురెడ్డి, సిటీ ఇన్‌చార్జి షేక్‌ ఫయాజ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ విశాఖ ఉక్కు కోసం ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు రామరాజు, సూరిశెట్టి నాగేంద్ర, సీపీఎం మహిళా సంఘం కార్యదర్శి శివకుమారి, కత్తి శ్రీనివాసులు, టీడీపీ నగర అధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, మామిడాల మధు, పౌరహక్కుల సంఘం నేతలు ఎల్లంకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 


సరిహద్దులో మద్యం షాపుల బంద్‌!


తమిళ అధికారులతో సంప్రదిస్తున్నాం

సూళ్లూరుపేటలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు 


సూళ్లూరుపేట, మార్చి 5 : తమిళనాడు సరిహద్దులో సూళ్లూరుపేట ఉన్నందున ఇక్కడ పోలింగ్‌ సందర్భంగా సరిహద్దుల్లోని మద్యం షాపులను మూసివేయాలని ఆ రాష్ట్ర అధికారులను కోరినట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. శుక్రవారం సూళ్లూరుపేట జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అక్కడి స్ట్రాంగ్‌ రూమును, కౌంటింగ్‌హాల్‌ కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్‌ మాట్లాడుతూ నాలుగు మున్సిపాలిటీలలో 1.75 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వీరందరూ స్వేచ్ఛగా ఓటు వేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు 400 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. ఈ నెల 10వ తేదీ పోలింగ్‌ జరగనున్నందున 44 గంటలముందే ప్రచారం నిలిపివేయించి, మద్యం దుకాణాలను బంద్‌ చేయిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్‌ కర్మాగారాలలో  వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని పరిశ్రమల నిర్వాహకులకు సూచించినట్లు చెప్పారు. అలా వీలుకాని పక్షంలో ఓటు వేసుకునేందుకు కనీసం 3 గంటలు అనుమతి ఇవ్వాలని తెలియజేశామన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.విఘ్నేష్‌ అప్పావు, నాయుడుపేట ఆర్డీవో సరోజిని,  మున్సిపల్‌ కమిషనర్‌ నరేంద్రకుమార్‌, తహసీల్దారు రవికుమార్‌ కలెక్టర్‌ వెంట ఉన్నారు.


ప్రచారం కూడా చేసుకోనివ్వరా!?


బైండోవర్‌ కేసులు ఎందుకు పెడుతున్నారు!?

పోలీసుల తీరుపై టీడీపీ ఆగ్రహం

స్టేషన్‌ ఎదుట బైఠాయించిన నిరసన


సూళ్లూరుపేట, మార్చి 5 : సూళ్లూరుపేటలో పోలీస్‌ అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం తెలుగుదేశంపార్టీ నేతలు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, వేనాటి సతీ్‌షరెడ్డి, బొమ్మన శ్రీధర్‌, కౌన్సిల్‌ అభ్యర్థులు, కార్యకర్తలతో స్టేషన్‌ వద్దకు చేరుకుని తమ పార్టీ అభ్యర్థులు, ఇద్దరు, ముగ్గురితో ప్రచారం చేసుకుంటుంటే ఎందుకు పట్టుకొచ్చి బైండోవర్‌ కేసులు పెడుతున్నారంటూ ప్రశ్నించారు. షార్‌ కాలనీలో ప్రచారం చేస్తున్న ఇద్దరిని పోలీస్‌ స్టేషన్‌కు పట్టుకొచ్చారని, అలాగే గురువారం కోళ్లమిట్ట, సూళ్లూరులలో ఇద్దరేసి ప్రచారం చేస్తుంటే పట్టుకురావడం ఏమిటని నిలదీశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐకి వేనాటి సతీ్‌షరెడ్డికి వాగ్వివాదం జరగడంతో కార్యకర్తలతో కలసి వేనాటి సతీ్‌షరెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సీఐ  అక్కడకు చేరుకుని వారిని దబాయించే ప్రయత్నం చేయడంతో వేనాటి సతీ్‌షరెడ్డికి, సీఐకి మాటామాటా పెరిగింది. దీంతో ఎస్‌ఐ గదిలో కూర్చొని ఉన్న నెలవల సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకొని ‘‘మన అభ్యర్థులను ఈ పోలీసులు ప్రచారం కూడా చేసుకోనిచ్చేటట్లు లేరు. మనకు ప్రచారం కూడా వద్దు.. వెళ్లిపోదాం పదండి.’’ అంటూ నాయకులను వెంటబెట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. 


పోలీసులు వేదిస్తున్నారు సర్‌!


సూళ్లూరుపేటలో తెలుగుదేశం అభ్యర్థులు ప్రచారం చేసుకోనివ్వకుండా ఇక్కడ పోలీసులు వేధిస్తున్నారని కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు నెలవల సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. సూళ్లూరుపేట జూనియర్‌ కళాశాల వద్ద ఉన్న కలెక్టర్‌ను టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలసి  స్థానిక సీఐ, ఎస్‌ఐలపై ఫిర్యాదు చేశారు. ఇద్దరు, ముగ్గురితో వార్డుల్లో ప్రచారం చేసుకుంటున్నా పోలీసులు వారిని పట్టుకొచ్చి బైండోవర్‌ చేసుకుంటున్నారని చెప్పారు. స్వేచ్చగా ప్రచారం చేసుకునేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ చెప్పారు. నెలవలతోపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మన్‌ శ్రీధర్‌, తిరుపతి పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీ్‌షరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్‌, మాధవనాయుడు తదితరులు పాల్గొన్నారు. 








Updated Date - 2021-03-06T05:07:35+05:30 IST