అభివృద్ధికి దారేదీ?

ABN , First Publish Date - 2022-05-07T05:57:48+05:30 IST

అభివృద్ధికి దారేదీ?

అభివృద్ధికి దారేదీ?
ఉప్పలూరు ప్రధాన రహదారి దుస్థితి

రహదారుణాలు-2


విజయవాడ/మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌ : తవ్వుకుంటా పోతే రాకపోకలకు అనువుగా లేని రహదారులు జిల్లాలో ప్రతిచోటా కనిపిస్తాయి. మూడేళ్లుగా కనీసం ప్యాచ్‌ వర్కులకు కూడా పూనుకోక రహదారులు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. ప్రాణాలను తీసేస్తున్నాయి. రోడ్లు బాగుచేసేందుకు నిధుల్లేవు.. ఈ రోడ్డును మీరు కలిపేసుకుని అభివృద్ధి చేయండంటూ ఏకంగా ఎంపీ స్థాయివారు జాతీయ రహదారుల సంస్థను అభ్యర్థించారంటే జిల్లాలో రహదారుల దారుణ పరిస్థితి అవగతమవుతుంది.  

- కంకిపాడు నుంచి రొయ్యూరు, గొడవర్రు, తోట్లవల్లూరు, వల్లూరుపాలెం, బొడ్డపాడు, చినపులిపాక వంటి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ రహదారిపై నిత్యం వేలసంఖ్యలో ద్విచక్ర వాహనాలు, వందల సంఖ్యలో కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇసుక టిప్పర్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కంకిపాడు మండలంలోని ఉప్పలూరు-మంతెన ప్రధాన రహదారి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఉప్పలూరు నుంచి మంతెన, జగన్నాథపురం, కోమటిగుంట లాకు వరకు ఉన్న ప్రధాన రహదారి అభివృద్ధికి అప్పటి ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అనుమతులు పొందారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్డు అభివృద్ధిపై దృష్టి పెట్టిన దాఖలాల్లేవు. ఇదే మండలంలోని మద్దూరు నుంచి వణుకూరు, గోసాల మీదుగా విజయవాడకు వెళ్లేందుకు ప్రధాన రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. వణుకూరు గ్రామంలో జగనన్న కాలనీ ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకల సంఖ్య విపరీతంగా పెరిగింది. అలాగే, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. 

- గన్నవరం మండలం బీబీగూడెం నుంచి చిక్కవరం, కొత్తగూడెం, వీరపనేనిగూడెం వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. ఈ రోడ్డుపై నిత్యం బ్యాంకులు, పాఠశాలలకు ప్రజలు, విద్యార్థులు వందల సంఖ్యలో వెళ్లి వస్తుంటారు. ఈ రహదారిపై అడుగడుగునా గుంతలు దర్శనమిస్తాయి. కొత్తగూడెం చెరువు దగ్గర రోడ్డంతా ధ్వంసమై మరింత ప్రమాదకరంగా మారింది. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. మర్లపాలెం నుంచి తెంపల్లి వెళ్లే రహదారి నిర్మించి 20 ఏళ్లకుపైగా అవుతోంది. రెండు కిలోమీటర్లకు పైగా రోడ్డంతా దెబ్బతింది. గన్నవరం నుంచి ఈ రహదారి మీదుగా తెంపల్లి, బల్లిపర్రు, వీరపనేనిగూడెం, మెట్లపల్లి గ్రామస్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రోడ్డు ధ్వంసమవటంతో వారంతా పెద్ద అవుటపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. 

- అవనిగడ్డ-కోడూరు రహదారి 14 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా, ఆ రహదారితో అనుసంధానమై దాదాపు పది గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ 14 కిలోమీటర్లు ప్రయాణించాలంటేనే దాదాపు గంట పడుతుందని వాహనచోదకులు వాపోతున్నారు. గోతులను తప్పించబోయి ద్విచక్ర వాహనదారులు పలుమార్లు ప్రమాదాలకు గురికాగా, మూడుసార్లు ఆర్టీసీ బస్సులు సైతం అదుపు తప్పి పంటకాల్వలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. 

- నాగాయలంక-కోడూరు రహదారి వెంబడి దాదాపు ఎనిమిది గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుండగా, వక్కపట్లవారిపాలెం దాటిన దగ్గర నుంచి రహదారి నరకాన్ని చూపిస్తోంది. నాగాయలంక-గుల్లలమోద ఆర్‌అండ్‌బీ రహదారి, పెదపాలెం-దీనదయాళ్‌పురం రహదారి ధ్వంసమై ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. చల్లపల్లి మండలం పాగోలు నుంచి మోపిదేవి మండలం కె.కొత్తపాలెం వరకు ఉన్న రహదారిపై సైతం భారీ గోతులు ఏర్పడటంతో వాహనదారులు వక్కలగడ్డ వెళ్లి అక్కడి నుంచి నిమ్మగడ్డ వద్ద కరకట్ట ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఘంటసాల-మల్లంపల్లి రహదారి భారీ గోతులతో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. 

- బందరు రూరల్‌ మండలంలో చిన్నాపురం నుంచి కమ్మవారి చెరువుకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు గతుకులమయంగా ఉంది. సుమారు పదేళ్ల క్రితం ఈ రోడ్డు నిర్మించారు. ఆ తర్వాత చిన్నపాటి మరమ్మతులకూ నోచుకోలేదు. చిన్నాపురం నుంచి కమ్మవారిచెరువు వరకు 11 కిలోమీటర్ల దూరం. తుమ్మలచెరువు, వాడగొయ్యి, వాడపాలెం, వెంకటదుర్గాంబపురం, మాలకాయిలంక, కేపీటీ పాలెం, కమ్మవారిచెరువు గ్రామాలకు చెందిన దాదాపు 30 వేల మంది ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటారు. ఈ రోడ్డు నిర్మాణానికి కొద్దిరోజుల క్రితం నిధులు కేటాయించారు. కొద్దిపాటి పనులు చేశాక బిల్లులు రావట్లేదని కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు కోరారు. 



ఏడాదిలో ఎనిమిది మంది బలి

గతుకులుగా ఉన్న ఈ గుడివాడ-కంకిపాడు రహదారి ఈ ఏడాది ఇప్పటివరకు ఎనిమిది మందిని బలి తీసుకుంది. మూడు నెలల క్రితం పది రోజుల వ్యవధిలో కలువపాముల వద్ద ఒక యువకుడు, పెదపారుపూడి వంతెన వద్ద ఒక మహిళను ఈ రహదారి పొట్టనపెట్టుకుంది. రోడ్డు మార్జిన్‌ కోసుకుపోయి వాహనాలు కాల్వల్లోకి దూసుకుపోతున్నాయి. ఈ రోడ్డును పెదపారుపూడి వరకు ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వ సాయంతో రూ.16 కోట్ల నిధులు మంజూరైనా పనులు ముందుకు సాగట్లేదు. రహదారి మరమ్మతులు పూర్తయ్యే వరకు ఆర్టీసీ నాన్‌స్టాప్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు బస్సులను పామర్రు వైపు నుంచి విజయవాడకు తిప్పాలని ఆర్టీసీ డీఎంను ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


డబ్బుల్లేవ్‌.. ఎన్‌హెచ్‌గా మార్చేయండి..

ఘంటసాల మండల పరిధిలో కొడాలి సమీపంలోని చల్లపల్లి-పామర్రు ప్రధాన రహదారి ధ్వంసమైంది. కొడాలి సెంటర్‌ నుంచి పామర్రు వైపునకు వెళ్లే రహదారి, కొడాలి నుంచి చల్లపల్లి వైపునకు వెళ్లే రహదారి పూర్తిగా మారిపోయాయి. సుమారు రెండడుగుల మేర లోతుగా గుంతలు పడటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి ఒళ్లు హూనమైపోతోంది. కొడాలి-మొవ్వ రహదారిపై దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే ధాన్యం లారీలకు గంటకుపైగా సమయం పడుతోంది. ఈ రహదారికి మరమ్మతులు చేసేందుకు నిధులు లేకపోవటంతో పామర్రు నుంచి చల్లపల్లి శివారు కాసానగర్‌ వరకు రోడ్డును జాతీయ రహదారిలో కలపాలని ఎంపీ బాలశౌరి జాతీయ రహదారుల శాఖకు నివేదించినట్టు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబు తెలిపారు. 


రోజుకో ప్రమాదం

ఈ ఫొటోలో కనిపిస్తున్న రహదారి బందరు మండలంలోనిది. మచిలీపట్నం నుంచి కృష్ణా యూనివర్సిటీ మీదుగా కోన, పోలాటితిప్ప, పాతేరు, గణపతినగర్‌, పల్లెతుమ్మలపాలెం గ్రామాలకు వెళ్లే రహదారి ఇది. ఈ గ్రామాల్లో నివసించే ప్రజలకు సుమారు 14 కిలోమీటర్లు ఉండే ఈ రహదారే ప్రధానమైనది. కృష్ణా యూనివర్సిటీ కూడా ఇదే రహదారి పక్కన ఉంటుంది. మూడేళ్లుగా ఈ రహదారికి కనీస మరమ్మతులు చేయలేదు. మచిలీపట్నం కార్పొరేషన్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శివగంగ సెంటర్‌ నుంచి పల్లెతుమ్మలపాలెం వరకూ ఉన్న ఈ రహ దారిపై అడుగులోతు గుంతలు ఏర్పడ్డాయి. వివిధ ప్రాంతాల నుంచి కృష్ణా వర్సిటీకి వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఈ దారి వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు నిత్యం ఈ గుంతల్లో పడి ప్రమాదా లకు గురవుతున్నారు. సగటున రోజుకొక ప్రమాదమైనా జరుగుతోంది. 



Read more