బందరు పోర్టుకు కేసుల లంగరు!

ABN , First Publish Date - 2022-05-07T05:50:02+05:30 IST

బందరు పోర్టుకు కేసుల లంగరు!

బందరు పోర్టుకు కేసుల లంగరు!

‘మేఘా’ దక్కించుకున్నా.. పనులకు బ్రేక్‌ 

వెంటాడుతున్న న్యాయపరమైన చిక్కులు

హైకోర్టులో కేసు తేలితేనే పనుల అప్పగింత

అప్పటి వరకు తప్పని నిరీక్షణ

3,683 కోట్లతో పనులు దక్కించుకున్న మేఘా

0.05  శాతం తేడాతో ముగిసిన టెండర్‌ ప్రక్రియ


(ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం)

బందరుపోర్టు టెండర్ల ప్రక్రియ ముగిసింది. పోర్టు పనులను మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ దక్కించుకుంది. అయితే.. పోర్టు నిర్మాణ పనులు మాత్రం ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించట్లేదు. దీనికి కారణం.. పోర్టుపై హైకోర్టులో కేసులు ఉండటమే. ఈ కేసులు పరిష్కారమైతే తప్ప.. పనులు ప్రారంభం కావని అధికారులు చెబుతున్నారు. ఇక, ఈ పనులను దక్కించుకునేందుకు మేఘాతో పాటు విశ్వసముద్ర హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ టెండర్లు దాఖలు చేసింది. మేఘా సంస్థ రూ.3,683.83 కోట్లకు టెండర్లు దాఖలు చేయగా, విశ్వసముద్ర హోల్డింగ్‌ సంస్థ, మేఘా కన్నా 0.05 శాతం అధికంగా టెండర్లు వేసింది. దీంతో తక్కువ మొత్తానికి కోట్‌ చేసిన మేఘాకు పనులు అప్పగిస్తూ మ్యారీటైమ్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. 

కోర్టు కేసు పరిష్కారమైతేనే..

బందరుపోర్టుకు టెండర్లు పిలవడం, పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం, పనులు మేఘా సంస్థకు అప్పగించడం వరకు అన్నీ సక్రమంగానే జరిగాయి. అయితే.. పోర్టుపై హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. హైకోర్టులో డబ్ల్యూపీ 12980/19 నెంబరుతో పోర్టుకు సంబంధించి కేసు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ కేసును పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వ పెద్దలు చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఈ కేసు పరిష్కారం అయ్యాక ప్రభుత్వం మేఘాతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. అప్పటి నుంచి 33 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంది.  

తొలివిడతగా రూ.రెండు వేల కోట్ల రుణం

మేఘా సంస్థ పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేసి ప్రభుత్వానికి పోర్టును అప్పగించాల్సి ఉంది. ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,683.83 కోట్లను సమకూర్చాల్సి ఉంది. యూనియన్‌, కెనరా బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకరించాయి. సీఎం జగన్‌తో ఆ బ్యాంకుల ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమై చర్చించారు. తొలి విడతగా రూ.రెండు వేల కోట్లను ఇచ్చేందుకు అంగీకరించినట్టు అధికారులు తెలిపారు. పోర్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే నిర్వహించి డీపీఆర్‌ను రూపొందించింది. ఈ పనులకు తొలివిడతలో 2,095.65 ఎకరాలు అవసరం కాగా, తొలిదశలో 4 బెర్తుల నిర్మాణం చేయాలని రైట్స్‌ సంస్థ డీపీఆర్‌లో పేర్కొంది. రెండో దశలో 12 బెర్తులు నిర్మించాల్సి ఉంది. 

Read more