పిలవని పెళ్లిళ్లకు వెళ్లి చోరీలు.. ‘బ్యాండ్ బాజా బరాత్’ సభ్యుల అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-06T00:43:31+05:30 IST

పిలవని పెళ్లిళ్లకు వెళ్లి దొంగతనాలకు పాల్పడుతున్న ‘బ్యాండ్ బాజా బరాత్’ గ్యాంగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌లో ఇద్దరు

పిలవని పెళ్లిళ్లకు వెళ్లి చోరీలు.. ‘బ్యాండ్ బాజా బరాత్’ సభ్యుల అరెస్ట్

న్యూఢిల్లీ: పిలవని పెళ్లిళ్లకు వెళ్లి దొంగతనాలకు పాల్పడుతున్న ‘బ్యాండ్ బాజా బరాత్’ గ్యాంగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌లో ఇద్దరు బాలలు కూడా ఉండడం గమనార్హం. ధూంధాంగా వివాహాలు చేసుకునే సంపన్నుల వివాహాలే ఈ గ్యాంగు లక్ష్యం. అంతేకాదు, ఒకవేళ దొరికిపోతే కనుక తమ పేర్లను ఎక్కడా వెల్లడించకూడదని ముందే వీరు ఓ నిర్ణయానికి వస్తారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ గ్యాంగ్ ఢిల్లీ, ఎన్‌సీఆర్‌తోపాటు ఉత్తర భారతదేశంలోని పలు వివాహాలకు హాజరై అక్కడ చేతికి అందినవి దొంగతనం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మరో దిగ్ర్భాంతికర విషయం ఏమిటంటే.. సమీప గ్రామాల్లోని పిల్లలను ఏడాదికి 10-12 లక్షల రూపాయలకు లీజుకు తీసుకుని, వారితో వివాహ వేదికల్లో దొంగతనాలు చేయిస్తుండడం. 


ఢిల్లీ విడిచి మధ్యప్రదేశ్‌లోని తమ గ్రామానికి వెళ్తుండగా ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని ఐదుగురు సభ్యులతో పాటు ఇద్దరు చిన్నారును అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠాది మధ్యప్రదేశ్‌, రాజ్‌గఢ్ జిల్లాలోని గుల్‌ఖేరి అనే చిన్న గ్రామం. వివాహ వేదికల్లో వరుస చోరీ ఘటనలకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఓ బృందంగా ఏర్పడి చోరీలు జరిగిన పెళ్లి మండపాల వద్ద వీడియో ఫుటేజీలను పరిశీలించారు. అలాగే, ప్రముఖ బాంక్వెంట్ హాళ్లు, ఇతర పెళ్లి మండపాల వద్ద మఫ్టీల్లో మోహరించినట్టు అదనపు కమిషనర్ (క్రైమ్) షిబేశ్ సింగ్ తెలిపారు. 


చోరీకి ముందు ఈ ముఠా కొంతసేపు పెళ్లి మండపాల వద్ద గడుపుతుంది. పెళ్లికొచ్చిన అతిథులను నేర్పుగా మాటల్లోకి దించుతుంది. అనంతరం చోరీలకు దిగుతుంది. ముఠా సభ్యులు చక్కని దుస్తులు ధరించి, అతిథుల్లో ఒకరిలా కలిసిపోతారని, అక్కడే భోజనం చేసి సమయం చిక్కగానే చేతివాటం చూపిస్తారని పోలీసులు తెలిపారు. బంగారు నగలు, డబ్బులతో ఉన్నబ్యాగులను చోరీ చేసిన అనంతరం అక్కడి నుంచి పరారవుతారని పేర్కొన్నారు. 


ఈ ముఠా సభ్యులు 9-15 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులను వారి నైపుణ్యాన్ని బట్టి ఏడాదికి రూ. 10-12 లక్షలకు లీజు తీసుకుంటారని పోలీసులు తెలిపారు. ఒకసారి చిన్నారులను లీజుకు తీసుకున్న తర్వాత ఢిల్లీకి తీసుకొచ్చి పెళ్లి వేడుకల్లో చోరీలు ఎలా చేయాలన్నదానిపై నెల రోజులపాటు తర్ఫీదు ఇస్తారు. పొరపాటున పట్టుబడితే తమ పేర్లు బయటపెట్టకూడదని ముందే ట్రైనింగ్ ఇస్తారు. నిందితులు సందీప్ (26), హన్స్‌రాజ్ (21), సంత్ కుమార్ (32), కిషన్ (22), బిషాల్ (20)ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 4 లక్షల రూపాయల నగదు, బంగారు నగలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-12-06T00:43:31+05:30 IST