Abn logo
Sep 21 2021 @ 23:31PM

అరటికి తెగులు...రైతుకు దిగులు

అరటికి మట్ట తెగులు సోకిన దృశ్యం

వింత రోగాలతో రైతుల ఆందోళన    అరటి కిలో రూ.3 నుంచి రూ. 4 

రైల్వేకోడూరు, సెప్టెంబరు 21: అరటికి వింత తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో చెట్లు నిలువునా ఎండిపోతుండటంతో అరటి రైతులు ఆందోళనకు గురౌతున్నారు. ఆరుగాలం కష్టించే రైతులను చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు కాటేస్తున్నాయి. కాయలు పక్వదశకు రాగానే ధరలు లేకుండా పోతున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా అరటి పంటను రైతులు సాగులోకి తీసుకుని వచ్చారు. అరటి పండ్లకు మంచి డిమాండు ఉన్నా తెగుళ్లతో వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి, పుల్లంపేట, పెనగలూరు మండలాల్లో రైతులు 20 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మామిడి తర్వాత బొప్పాయి, అరటి సాగును ఎక్కువగా రైతులు చేపట్టారు. అయితే ఈ ఏడాది వింత తెగుళ్లు సోకుతున్నాయి. దీంతో నిలువునా చెట్ల ఆకులు పండు మాగిపోయి చనిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు చనిపోయిన తర్వాత కాండానికి రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా తెగుళ్లు నివారించలేకపోతున్నా రు. తోటల్లోకి సంబంధితశాఖ అధికారులు వెళ్లి తెగుళ్లను పరిశీలించి  సూచనలు, సలహాలు ఇస్తే రైతులు కోలుకునేందుకు వీలుగా ఉంటుందని పలువురు  పేర్కొంటున్నారు. ఎకరాలో అరటి సాగు చేయాలంటే రూ.50 వేల నుంచి రూ. 60 వేలు ఖర్చు అవుతుంది. ఎకరాకు 900 పిలకలు పడతాయి. కూలీ లు, ఎరువులు, దున్నకాలు తదితర వాటికి ఖర్చులు అధికంగా అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో పచ్చ అరటి, సుగంధాలు, జీ-9, అమృతపాణి తదితర రకాలను పండిస్తున్నారు. రైల్వేకోడూరు నుంచి తమిళనాడు, బెంగళూరు, మహారాష్ట్ర, తెలంగాణా తదితర ప్రాంతాలకు అరటి కాయలను ఎగుమతి చేస్తున్నారు. ప్రతి ఏటా ఏర్పడుతున్న వింత తెగుళ్లతో రైతులు సతమతం అవుతున్నారు. ప్రస్తుతం వింత తెగుళ్లతో పాటు మట్ట తెగులు విపరీతంగా ఉంది. అలాగే పండు ఈగలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో కాయలు గిడసబారుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధరలు కిలో అరటి కాయలు రూ. 3 నుంచి రూ.4లకు విక్రయాలు జరుగుతున్నాయి. ధరలు లేక పోవడంతో కాయలు తోటల్లోనే మాగిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.       ఇప్పటికైనా రైతులకు అధికారులు, శాస్త్రవేత్తలు తోటలను పరిశీలించి తెగుళ్ల నివారణకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు.