జిల్లాలో విస్తారంగా అరటి సాగు

ABN , First Publish Date - 2022-06-24T06:43:15+05:30 IST

గాలివాన బీభత్సం అరటి రైతులను ఏటా దెబ్బ కొడుతోంది. పంట ధ్వంసమై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

జిల్లాలో విస్తారంగా అరటి సాగు
నేలకొరిగిన తోటలో దిగాలుగా రైతులు (ఫైల్‌)

కలిసొస్తే కనక వర్షం

ఎకరానికి రూ.5 లక్షల దాకా ఆదాయం

పెట్టుబడి పోనూ.. రూ.4 లక్షల మిగులు

ఏటా దెబ్బకొడుతున్న గాలివాన

వెనక్కు తగ్గని రైతులు

పుట్లూరు మండలంలో అత్యధికం

ప్రస్తుతం ధర ఉన్నా .. దిగుబడి లేదు


గాలివాన బీభత్సం అరటి రైతులను ఏటా దెబ్బ కొడుతోంది. పంట ధ్వంసమై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రూ.కోట్ల నష్టం జరిగినా, ఒక్కసారి పంట పండితే తమ కష్టాలు తీరుతాయని మరోసారి సాహసం చేస్తున్నారు. కానీ, దిగుబడి ఉన్నప్పుడు ధర ఉండదు, ధర ఉంటే దిగుబడి ఉండదు. తాజాగా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది గాలివానలతో అరటి పంట నేలకొరిగింది. కళ్లెదుట ప్రకృతి విధ్వంసం చేస్తుంటే.. చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ముందు జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. 

తాడిపత్రి


పుట్లూరు మండలంలో ఎక్కువ

జిల్లాలో ఎక్కువగా అరటి పండించే మండలాల్లో పుట్లూరు ముందు వరుసలో ఉంటోంది. మండలంలోని అత్యధిక గ్రామాల్లో రైతులు అరటి తోటలు సాగు చేస్తారు. ఇక్కడి అరటి విదేశాలకు ఎగుమతి అవుతోంది. పలు కార్పొరేట్‌ కంపెనీలు ఇక్కడి అరటి దిగుబడులను కొనుగోలు చేసి రైలు, రోడ్డు మార్గాలలో ముంబైకి, అక్కడి నుంచి ఓడల్లో అరబ్‌ దేశాలకు తరలిస్తున్నారు. పుట్లూరు మండలంలో అరటి సాగు విస్తీర్ణం ఎక్కువ. ఈ కారణంగా ఏటా ప్రకృతి దాడిలో జరిగే నష్టం కూడా ఎక్కువగా ఉంటోంది. అధికారుల అంచనా ప్రకారం పుట్లూరు మండలంలో దాదాపు 6 వేల ఎకరాల్లో అరటి సాగులో ఉంది. వెల్లుట్ల, జంగంరెడ్డిపేట, ఓబుళాపురం, అరకటవేముల, సూరేపల్లి, కడవకల్లు, చాలవేముల, కొండాపురం, సంజీవపురం తదితర గ్రామాల్లో అరటి ఎక్కువగా సాగు అవుతోంది. పుట్లూరు మండలం తర్వాత పెద్దపప్పూరు, యాడికి, తాడిపత్రి, యల్లనూరు మండలాల్లో అరటిసాగు ఎక్కువగా ఉంటోంది.


టన్ను రూ.18 వేలు

ప్రస్తుతం టన్ను అరటి ధర రూ.16 వేల నుంచి రూ.18 వేలు పలుకుతోంది. కానీ ఆశించిన దిగుబడి లేదు. నెలన్నర నుంచి గాలివానలు దెబ్బకొడుతున్నాయి. వందల ఎకరాల్లో కోతకు వచ్చిన అరటిచెట్లు నేలకొరుగుతున్నాయి. అరటి బోదెలకు పటుత్వం తక్కువ. అందుకే చిన్నగాలులకు సైతం పడిపోతుంటాయి. ప్రచండ గాలులు వీస్తే తోటలు నేలమట్టం అవుతాయి. పక్వానికి వచ్చిన కాయలతో ఉన్న చెట్లు పడిపోతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాటిని పీకి అమ్మలేక, అలాగే ఉంచుకోలేక అవస్థ పడుతున్నారు. నేలకొరిగిన చెట్లు బతికే అవకాశం ఉండదు. అలాంటి చెట్లకు ఉన్న పక్వానికి వచ్చిన కాయలను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పక్వానికి రాని కాయలు ఉన్న గెలలను దిబ్బలో పడేస్తున్నారు.


పరిహారంలో మొండిచేయి

గాలివానల కారణంగా నష్టపోయిన అరటి రైతులకు పరిహారం అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, అమలు కావడం లేదు. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. అరటి తోటలు నేలకొరిగినపుడు హార్టికల్చర్‌ అధికారులు హడావుడిగా వస్తారు. అంచనాలు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. రూ.లక్షల్లో నష్టం జరిగితే.. నివేదికలో రూ.వేలుగా చూపిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఆ మేరకు కూడా పరిహారం అదడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారుల తీరుపై రైతులు పలుమార్లు నిరసన తెలిపారు. అయితే, ప్రభుత్వం నుంచి పరిహారం రాకుంటే తాము ఏం చేయగలమని అధికారులు తేలిపోతున్నారు. తాజాగా జరిగిన నష్టంపై కూడా అంచనాలు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపామని అధికారులు చెబుతున్నారు. ఈసారి కూడా పరిహారం అందుతుందన్న నమ్మకం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు.


ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి

అరటి సాగుకు ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి ఖర్చు అవుతుంది. ఒకసారి సాగుచేస్తే మూడు కోతలు కోయవచ్చు. మొదటి కోతకు ఎక్కువ ధర, రెండు, మూడు కోతలకు తక్కువ ధర ఇస్తారు. మూడుకోతలు కలిపి ఎకరాకు 1200 అరటి పిలకలు నాటుతారు. వీరి ధర రూ.18 వేలు ఉంటుంది. డ్రిప్పు పరికరాలకు రూ.11 వేలు, పైపులకు రూ.10 వేలు, ఎరువులకు రూ.12 వేలు, ట్రాక్టర్‌ బాడుగ రూ.6 వేలు, కూలీలకు రూ.1500, మందులకు రూ.35 వేలు, గెల వచ్చినప్పటి నుంచి మరో రూ.20 వేలు ఖర్చు చేస్తున్నారు. అరటి మొక్కలను పసి పిల్లలకంటే ఎక్కువ జా గ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని రైతులు అంటున్నారు. సాధారణంగా ఎకరాకు 15 నుంచి 25 టన్నుల వరకు అరటి దిగుబడి వస్తుంది. పరిస్థితులను బట్టి టన్ను రూ.5 వేల నుంచి రూ.18 వేల వరకు ఉంటుంది. సరాసరి 20 టన్నులు వచ్చినా, ప్రస్తుతం ఉన్న టన్ను రూ.16 వేల నుంచి రూ.18 వేలు ధర వద్ద ఎకరాకు, మొదటి కోతకు రూ.3 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. మిగిలిన రెండు కోతలకు ఎంత లేదన్నా రూ.2 లక్షల ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ ఎకరానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు లాభం వస్తుంది. అందుకే.. తరచుగా గాలివానలు ఇబ్బంది పెడుతున్నా.. రైతులు అరటి సాగుకు వెనుకాడటం లేదు.


గాలివానతో నష్టం..

ఆరున్నర ఎకరాల్లో అరటి సాగుచేశాను. పెట్టుబడికి రూ.7లక్షల వరకు ఖర్చు అయింది. దిగుబడి చేతికి వస్తున్న సమయంలో గాలివానలకు పంట నేలకొరిగింది. ధర ఉండడం వల్ల మిగిలిన పంటను అమ్మి సొమ్ము చేసుకున్నాను. దాదాపు రూ.2 లక్షల పంట నష్టపోయాను. 

- వెంకటచౌదరి, ఓబుళాపురం


ఆ సమయంలో ధర లేదు..

ఎకరాకు రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టాను. ఆరు ఎకరాల్లో సాగు చేశాను. పెట్టుబడి ఎక్కువగా పెట్టడం వల్ల అదేస్థాయిలో దిగుబడి వచ్చింది. ఎకరాకు 20 టన్నుల వరకు పంట వచ్చింది. కానీ ఆ సమయంలో ధర లేదు. ఆలస్యమైతే పంట దెబ్బతింటుందని కొంత పంటను తక్కువ రేటుకు అమ్మాను. మిగిలిన పంటను అలాగే పెట్టాను. అది గాలివానకు నేలకొరిగి దెబ్బతినింది. 

- రామాంజులరెడ్డి, జంగంరెడ్డిపేట


రూ.3 లక్షలు నష్టం..

పది ఎకరాల్లో అరటి సాగుచేశాను. ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టుబడి ఖర్చు అయింది. గాలివానలకు పంట నేలకొరిగింది. రూ.3 లక్షలకు పైగా నష్టం వచ్చింది. పంట ఉండి ఉంటే  ప్రస్తుతం ఉన్న ధరలకు అప్పులు తీరి, నగదులో ఉండేవాన్ని. ధర ఉన్నా పంట లేకపోవడంతో ఆవేదన చెందాల్సి వస్తోంది. 

- గోవర్ధనరాజు, కడవకల్లు

Updated Date - 2022-06-24T06:43:15+05:30 IST