ఎలాన్‌ మస్క్‌కు కేంద్రం షాక్‌

ABN , First Publish Date - 2021-11-28T08:05:49+05:30 IST

ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌కు భారత ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. స్టార్‌ లింక్‌ పేరుతో స్పేస్‌ఎక్స్‌ త్వరలో ప్రారంభించనున్న శాటిలైట్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కోసం ముందస్తు ఆర్డర్లు..

ఎలాన్‌ మస్క్‌కు కేంద్రం షాక్‌

  • స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలపై నిషేధం
  • కంపెనీ సేవలను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవద్దని ప్రజలకు సూచన జారీ చేసిన ప్రభుత్వం

  

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌కు భారత ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. స్టార్‌ లింక్‌ పేరుతో స్పేస్‌ఎక్స్‌ త్వరలో ప్రారంభించనున్న శాటిలైట్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కోసం ముందస్తు ఆర్డర్లు స్వీకరించకుండా నిషేధించింది. దేశంలో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించేందుకు స్పేస్‌ఎక్స్‌ లైసెన్సు పొందలేదన్న ప్రభుత్వం.. కంపెనీ సేవలను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవద్దని ప్రజలకు సూచించింది. కాగా, స్టార్‌లింక్‌ బీటా వెర్షన్‌ సేవల కోసం స్పేస్‌ఎక్స్‌ ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇందుకోసం 99 డాలర్ల (సుమారు రూ.7,400) పూర్తి రిఫండబుల్‌ డిపాజిట్‌ చేసి సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. అయితే, భారత్‌లో సేవలందించేందుకు లైసెన్సు తీసుకోకుండానే ప్రీ-ఆర్డర్లను స్వీకరిస్తున్న కంపెనీపై టెలికాం శాఖ తాజా చర్యలు చేపట్టింది.


లైసెన్సు పొందాకే సేవలను ప్రారంభించాలని కంపెనీకి స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికల్లా భారత్‌లో స్టార్‌లింక్‌ సేవల్ని ప్రారంభించాలని, అప్పటికల్లా 2 లక్షల మంది కస్టమర్లను తన నెట్‌వర్క్‌లో చేర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 5,000కు పైగా ఆర్డర్లు వచ్చినట్లు స్టార్‌లింక్‌ కంట్రీ డైరెక్టర్‌ సంజయ్‌ భార్గవ ఈమధ్యనే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 

Updated Date - 2021-11-28T08:05:49+05:30 IST