కడప గడపనుంచే బాలు పరిచయం..

ABN , First Publish Date - 2020-09-26T18:53:43+05:30 IST

కడప గడపనుంచే బాలు పరిచయం..

కడప గడపనుంచే బాలు పరిచయం..

జిల్లాతో ఎస్పీ బాలుకు ఎనలేని బంధం

తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన పద్మనాభం

కడపలో ఘంటసాల విగ్రహావిష్కరణ చేసిన బాలు

అంధ ఉపాధ్యాయుని కుటుంబానికి ఆసరా


గానగంధర్వుడి కంఠం మూగబోయింది. తన పాటలతో, సంగీతంతో ఎందరినో ఆనందసాగరంలో ఓలలాడించిన ఎస్పీ బాలు శాశ్వతంగా ప్రపంచాన్ని వీడి.. అందరినీ దుఃఖసాగరంలో ముంచేశారు. తన స్వరంతో ప్రపంచాన్నే మెప్పించిన ఈయనకు చిత్రపరిశ్రమలో తొలి అవకాశం ఇచ్చింది కడప జిల్లాకు చెందిన చెందిన నిర్మాత, నటుడు పద్మనాభం కావడం విశేషం. ఎస్పీ బాలుకు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. అమరగాయకుడు ఘంటసాల విగ్రహావిష్కరణ బాలు చేతులమీదుగా జరిగింది. ప్రొద్దుటూరులో ఆయనకు కనకాభిషేకం చేశారు. పలువురు కళాకారులు ఆయన చేతులమీదుగా పురస్కారాలు అందుకున్నారు.


కడప (సిటి): గాత్రంతో ప్రపంచాన్ని మెప్పించిన ఎస్పీ బాలును తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి చెందిన హాస్యనటుడు, నిర్మాత పద్మనాభం కావడం గమనార్హం. ఆయన 1966లో నిర్మించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ’ చిత్రంలో గాయకుడిగా ఇచ్చిన అవకాశాన్ని బాలు అందిపుచ్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ మేటి గాయకుడిగా మన్ననలు పొందారు. కడపకు చెందిన ఇంగ్లీషు లెక్చరర్‌ హరే రామమూర్తి రాసిన తెలుగు పాటలను ఆకాశవాణిలో బాలు ఆలపించి అందరినీ అలరింపజేశారు. కడపకు చెందిన అప్పటి మున్సిపల్‌ చైర్మన్‌ కిరణ్‌పాషా నిర్మించిన ‘భావిపౌరులు’లో సైతం ఓ పాట ఆలపించారు.


అమరగాయకుడి విగ్రహావిష్కరణ

కడప నగరంలోని నెహ్రూపార్కులో 2004 సంవత్సరం డిసెంబరు 16న రాయలసీమ ఆర్ట్స్‌ క్రియేటవ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు జీవీ రమణ ఆధ్వర్యంలో అమరగాయకుడు ఘంటసాల విగ్రహాన్ని ఎస్పీ బాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, కుమారుడు రత్నకుమార్‌, ప్రముఖ గాయని కోమల పాల్గొన్నారు. జిల్లా అధికారులు, ప్రముఖులు బాలుని సన్మానించారు. అదే రోజు పాయంత్రం కడప మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన పాటకచ్చేరిలో బాలు తనదైన శైలిలో పాటలు పాడి జనాలను ఉర్రూతలూగించారు. ఎస్పీ బాలు ఇకలేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఆయన లేని లోటు ఎప్పటికీ ఎన్నటికీ తీరదని జీవీ రమణ అన్నారు.


అంధ ఉపాధ్యాయుడి కుటుంబానికి ఆసరా

సినీ రంగంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న బాలుకు తన అభిమానుల పట్ల వల్లమాలిన ప్రేమాభిమానాలు ఉండేవి. అలాంటి అభిమానుల్లో ఒక్కడైన కడప వాసి అంధ ఉపాధ్యాయుడు సాంబశివునితో బాలుకు మంచి పరిచయం ఉండేది. రెండేళ్ల క్రితం సాంబశివుడి సతీమణికి వైద్యంకోసం ఆయన సహకారం అందించారు. అంతేకాక అప్పుడప్పుడూ ఫోన్‌ చేస్తూ ఆరోగ్య వివరాలు కనుక్కుంటూ వచ్చేవారు.


కడపపై ప్రత్యేక అభిమానం

కడపలో ఘంటసాల విగహ్రావిష్కరణకు వచ్చిన బాలును అధికారులందరం కలిశాం. కడపోత్సవాల్లో ప్రోగ్రామ్‌ చేయాలని కోరాం. అయితే బిజీ షెడ్యూలు కారణంగా రాలేనేమోనని, అయితే కడప కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసే కడపోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఆయనకు కడప పట్ల ఉన్న ప్రత్యేకఅభిమానం తేటతెల్లమైంది. బాలు లేని లోటు చిత్రపరిశ్రమకు పూడ్చలేనిది.

- పురుషోత్తం, డీపీఆర్వో, కడప


ఒకేసారి డాక్టరేట్‌ పొందారు 

తెలుగు విశ్వవిద్యాలయం అందించిన గౌరవ డాక్టరేట్‌ను మా తండ్రి జానుమద్ది హనుమచ్ఛాస్త్రి, బాలసుబ్రహ్మణ్యం ఒకేసారి ఒకే వేదికపై హైదరాబాదులో స్వీకరించారు. తెలుగు పాటలను ప్రపంచవ్యాప్తంగా వినిపించిన దిట్ట బాలు. అలాంటి గాన గంధర్వుడు అందరినీ వదిలి వెళ్లడం తెలుగు ప్రేక్షకుల దురదృష్టం.

- జానుమద్ది విజయభాస్కర్‌, కడప

Updated Date - 2020-09-26T18:53:43+05:30 IST