Sep 27 2020 @ 02:42AM

బాలు మన జాతి సంపద...

బాలు ఒక్కడు చాలు!

హుషారైన పాటలు పాడేందుకు మహ్మద్‌ రఫీ, విషాద గీతాల కోసం ముఖేశ్‌, క్లాసికల్‌ పాడేందుకు మన్నాడే, పెద్ద శ్రుతిలో దేశ భక్తి గీతాలు పాడేందుకు మహేంద్ర కపూర్‌... ఇలా ఉత్తరాది వారికి నలుగురు గాయకులున్నారు. కానీ... మనకు ఒక్క బాలు చాలు. భగవంతుడు చాలా గొప్పవాడు. అన్ని రకాల స్వరాలతో హాయిగా పాడడానికి ఒకే గొంతుకతో బాలు గారిని ఇచ్చాడు.

భువనచంద్ర

గీత రచయిత


‘‘నేను చిత్ర పరిశ్రమకు వచ్చి ముప్ఫై మూడున్నర సంవత్సరాలు. నేను రాసిన కొన్ని వందల పాటలను బాలు పాడారు. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో రచయితగా నేను, గాయకుడిగా ఆయన ఎన్నో వందలసార్లు కలిశాం. ఎప్పుడూ ఆయన ముఖంలో చిరునవ్వు చెరగదు. నేను ఆయనలో గమనించిన లక్షణాలెన్నో! వీటిలో మొదటిది నిబద్ధత. పాట పాడతానని అంగీకరిస్తే... అర్ధరాత్రి 12 అయినా సరే పాట పూర్తి చేసే ఇంటికి వెళ్లేవారు తప్ప పాడలేనని చెప్పేవారు కాదు. రెండోది సమర్థత. ఎటువంటి పాట ఇచ్చినా ఆయన పాడగలరు. ఉదయం నుంచి ఎన్ని పాటలు పాడినా... మొట్టమొదటి పాటకు ఎంత ప్రాణం పోస్తారో, చిట్టచివరి పాటకూ అంతే ప్రాణం పోస్తారు. ఇరవై పాటలు పాడితే... 20వ పాటకు కూడా ప్రాణం పోయగలిగినటువంటి సమర్థత ఆయన సొంతం. మూడోది విధేయత. ఎంత ఎత్తుకి ఎదిగినా రెండు చేతులు జోడించి ‘సోదరా! బావున్నారా!’ అని పలకరించేవారు. అందుకే బాలు నాటికీ నేటికీ ఎప్పటికీ మన జాతి సంపద.నేను తొలిసారి బాలుగారిని కలిసింది నా మొట్టమొదటి చిత్రం ‘నాకూ పెళ్ళాం కావాలి’ పాటల రికార్డింగ్‌లో. మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చి పదిహేను నిమిషాల్లో పాట పాడేసి వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ ‘నైస్‌ సాంగ్‌’ అన్నారు. నేనేమో ఆయన రెండు నిమిషాలు ఆగుతారనీ, మాట్లాడితే బావుంటుందనీ అనుకున్నా. కానీ ఆయన ఆగలేదు. 15 నిమిషాల్లో పాడినా... పాడినటువంటి విధానం అత్యద్భుతం! ఆయన 40 వేల పాటల రికార్డును.. నా ఉద్దేశంలో మరో ఇతర గాయకుడు బ్రేక్‌ చేయలేరు. ఎందుకంటే- రకరకాల భారతీయ భాషల్లో అనేక మంది హీరోలకు పాడటం అంత సులభం కాదు. నేను రాసిన ‘వాళ్ళు’ పుస్తకం చదివిన బాలు.. ‘ఏవండీ! మీరు పాటలు, మిలటరీ అని అనుకున్నా. ఆధ్మాత్మికంగా మీరు ఇంత లోతుకు వెళతారని నేను ఊహించలేదు. ‘వాళ్ళు’ చదివాక అర్థమైంది. మీతో ఓ రోజంతా కూర్చుని ఆ పుస్తకం గురించి డిస్కస్‌ చేయాలని ఉంది’ అని చెప్పారు. మాకు ఆ అవకాశమే లేదు. ఈ లోపులో ఆయనే వెళ్లిపోయారు.

భువనచంద్ర