పెద్దబ్బయ్య పాట కావాలి.. మాట కావాలి..

ABN , First Publish Date - 2020-09-06T05:30:00+05:30 IST

‘ బాలు పాట.. మాట రెండూ మధురమే.. పాట ఆయన ప్రస్థానాన్ని నిర్వచిస్తే.. మాట ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది’

పెద్దబ్బయ్య పాట కావాలి.. మాట కావాలి..

‘ బాలు పాట.. మాట రెండూ మధురమే.. పాట ఆయన ప్రస్థానాన్ని నిర్వచిస్తే.. మాట ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది’ అంటారు ప్రముఖ ఫార్మా కంపెనీ శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ వరప్రసాద్‌ రెడ్డి. బాలుతో తనకున్న స్నేహాన్ని ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం ప్రత్యేకంగా పంచుకున్నారు.


బాలును చూసిన వెంటనే నేను ఆయన దగ్గరకు వెళ్లా. ‘‘నా పేరు వరప్రసాద్‌. మాది నెల్లూరు’’ అని పరిచయం చేసుకున్నా. ఆయన నావైపు ఆసక్తిగా చూశారు. ‘‘మీ నాన్నగారు సాంబమూర్తిగారంటే నాకెంతో ఇష్టం. ఆయన హరికథలకు నేను వెళ్తూ ఉండేవాడిని’’ అని అన్నా. బహుశా ఈ తరహా పరిచయం ఎవరూ చేసుకొని ఉండకపోవచ్చు. 


బాలు గొప్ప సంస్కారి. మృదు భాషి. ‘ఆత్మస్తుతి.. పరనింద’ అనే సూత్రంపై నడిచే కళాప్రపంచంలో అయన ఒక అరుదైన మనిషి.  ఆయన పరుషంగా మాట్లాడడం నేను ఒక్కసారి కూడా చూడలేదు.


‘‘మాది నెల్లూరు. నాకు చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. ఆటలు ఆడేవాడిని. హరికథలు, బుర్రకథలకు వెళ్తూ ఉండేవాడిని. హరికథలకు, బుర్రకథలకు వెళ్లటానికి రెండు కారణాలుండేవి. వీటిలో ఒకటి బాలు నాన్నగారు పండితారాధ్యుల సాంబమూర్తి గారు. రెండోది వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థానంలో హరికథ తర్వాత పెట్టే పులిహోర. ఈ రెండూ చాలా రుచిగా ఉండేవి. సాంబమూర్తిగారు గొప్ప హరికథా కళాకారులే కాదు.... సంగీత విద్వాంసుడు కూడా. ప్రతి ఏడాది ఆయన త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించేవారు. ‘‘శరణు శరణు సురేంద్రవల్లభ...’’ అని అని గొంతెత్తి పాడుతూ పురవీధుల్లో శిష్యులతో కలిసి వెళ్తుంటే- నాలాంటి పిల్లలం ఆయన వెనకే అనుసరించేవాళ్ళం. నాకు ఇప్పటికీ అదొక తీపి జ్ఞాపకం. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడని కానీ... అతను ప్రపంచం గర్వించదగ్గ గాయకుడు అవుతాడని కానీ... నాకు మంచి స్నేహితుడు అవుతాడని కానీ నాకప్పుడు తెలియదు. 


స్నేహితుడి ద్వారా..

స్కూలు చదువు అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్‌ చదవడానికి నేను కాకినాడ వెళ్లాను. నా చిన్ననాటి స్నేహితుడు, నెల్లూరు కోమలవిలాస్‌ హోటల్‌ వారి అబ్బాయి శంకరనారాయణ అనంతపూర్‌లో ఇంజనీరింగ్‌లో చేరాడు. అతనికి బాలు సీనియర్‌. ఆయన మంచి పాటగాడనీ, చదువు మధ్యలో వదిలేసి పాటలు పాడడం కోసం మద్రాసు వెళ్లిపోయాడనీ అనంతపూర్‌ కాలేజీలో చెప్పుకుంటూ ఉండేవారట. సెలవులకు శంకరనారాయణ వచ్చినప్పుడు- ‘‘మన ఊరువాడే బాలూ... సినిమాల్లో పాడుతున్నాడు’’ అంటూ కబుర్లు చెప్పేవాడు. బాలు సాంబమూర్తిగారి అబ్బాయని అప్పుడు తెలీదు. మన ఊరి కుర్రాడు సినిమాల్లోకి వెళ్ళాడనుకొనేవాడినంతే! నా చదువు పూర్తయింది. ఉద్యోగంలో చేరా. కానీ చిన్నప్పటి సంగీత కాంక్ష నన్ను వదలలేదు. సంగీతమంటే మక్కువ ఉండేది. కానీ జ్ఞానం మాత్రం లేదు. దీంతో ఖాళీ సమయంలో వీణ నేర్చుకొనేవాడిని. సినీ గాయకుల్లో ఘంటసాల అంటే ఇష్టం. ఆ సమయంలో ఆయన సినీ సంగీత శిఖరం. అందరు హీరోలకు ఆయనే పాడేవారు. బాలు అప్పుడప్పుడే రెక్కలు విచ్చుకుంటున్న గాయకుడు. ఆయన పాటలు కూడా వింటూ ఉండేవాడిని. బాలు హీరో కృష్ణకు గొంతు మార్చి ‘గుంతలక్కడి గుంతలక్కడి గుమ్మ...’ లాంటి పాటలు పాడుతూ ఉండేవారు. అవి నాకు నచ్చేవి కావు. ‘గొంతు బావుంది కానీ ఇలాంటి పాటలెందుకు పాడుతున్నాడు?’ అనుకొనేవాడిని. ‘రావమ్మా మహాలక్ష్మీ... రావమ్మా...’, ‘ప్రతి రాత్రి వసంత రాత్రి...’, ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం...’ లాంటి పాటల్లో బాలు గొంతులోని మాధుర్యం నన్ను ఆకట్టుకుంది కానీ ఘంటసాలపై అభిమానం మాత్రం తగ్గలేదు. ఇలా కొద్ది కాలం గడిచింది. నేను ప్రభుత్వ ఉద్యోగం మానేసి ప్రైవేట్‌గా ఫార్మా పరిశ్రమ పెట్టుకున్నా. ఆ సమయంలోనే అనుకుంటా... నాకు బాలూ- సాంబమూర్తిగారి అబ్బాయని తెలిసింది. ఆయనను ఎప్పుడో ఒకసారి కలవాలనేది నా సంకల్పం. కానీ నాకున్న హడావిడిలో ప్రత్యేక ప్రయత్నం ఏమీ చేయలేదు.


‘మీ నాన్నగారి అభిమానిని’

1991లో ఒకసారి నేను మద్రాసు నుంచి హైదరాబాద్‌ వస్తున్నా. ఎయిర్‌పోర్టులో బాలు కనిపించారు- కాలుకు కట్టుకట్టుకొని. అప్పటికే ఆయన లబ్ధప్రతిష్ఠుడు. సినిమాలకు కొన్ని వేల పాటలు పాడారు. బాలును చూసిన వెంటనే నేను ఆయన దగ్గరకు వెళ్లా. ‘‘నా పేరు వరప్రసాద్‌. మాది నెల్లూరు’’ అని పరిచయం చేసుకున్నా. ఆయన నావైపు ఆసక్తిగా చూశారు. ‘‘మీ నాన్నగారు సాంబమూర్తిగారంటే నాకెంతో ఇష్టం. ఆయన హరికథలకు నేను వెళ్తూ ఉండేవాడిని’’ అని అన్నా. బహుశా ఈ తరహా పరిచయం ఎవరూ చేసుకొని ఉండకపోవచ్చు. కొద్దిసేపు వారి నాన్నగారి గురించి మాట్లాడుకున్నాం. ఆ మొత్తం సంభాషణలో బాలు పాట గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. నేను ఆయనను పొగిడిందీ లేదు. మా తొలిపరిచయం అలా సాగింది. నేను హైదరాబాద్‌లో పూర్తిగా స్థిరపడి, ఇల్లు కట్టుకున్న తర్వాత మా ఇంటికి అనేకమంది కళాకారులు వస్తూ పోతూ ఉండేవారు. అలా అప్పుడప్పుడు బాలు కూడా వచ్చేవారు. ఆ సమయంలోనే బాలు తన తండ్రి గారిపై ఒక పుస్తకం రాయించారు. ఆ పుస్తకానికి నన్ను ముందు మాట రాయమన్నారు. ‘నేను సంగీతజ్ఞుడినీ కాదు.. రచయితనూ కాదు’  అంటే-  ‘‘మీకు మా నాన్నగారిపై ఉన్న అభిమానం నా హృదయాన్ని తాకింది’’ అన్నారు. ఇలా మాకు పరస్పర అభిమానం, గౌరవం ఉండేవి. ఆ తర్వాతి కాలంలోమా మధ్య పరిచయం బాగా పెరగటానికి కారణం బాపు- రమణలు. వారితో నాకు మంచి స్నేహం ఉండేది. వారు ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా మా ఇంటికి రాకుండా తిరిగి వెళ్లేవారు కాదు. ఆ సమయంలో బాలు హైదరాబాద్‌లో ఉంటే ఆయన కూడా మా ఇంటికి వచ్చేవారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అతని స్నేహితుల ఆధారంగా అంచనా వేయవచ్చంటారు. బాలు ఈ సూత్రాన్ని గాఢంగా నమ్మేవారు. బాపు- రమణల స్నేహితం మంచిది కాబట్టి బాలు కూడా సులభంగా మా గుంపులో చేరిపోయారు. మంచి మిత్రులయిపోయారు. మా మధ్య స్నేహం చిక్కబడింది. ఒకరి బాధలు మరొకరు పంచుకొనే స్థితికి చేరుకుంది. మా నెల్లూరు భాషలో- ‘పెద్దబ్బయ్య’ అని బాలును నేను పిలిస్తే.. ‘చిన్నబ్బయ్య’ అని నన్ను పిలిచేవారు. నాకు ఆయన పాటతో పాటుగా మాటన్నా చాలా ఇష్టం. పాటకు రచయిత, సంగీతదర్శకుడు, సినీ దర్శకుడు- ఇలా అనేక మంది కర్తలు ఉంటారు. కానీ మాట బాలుదే! ఆయనే దానికి యజమాని. ఎవ్వరినీ పల్లెత్తు మాట అనని ఆయన వ్యక్తిత్వానికి ఆ మాటే ప్రతీక. 


మా స్నేహ బంధం ఇలా మొదలైంది

ఈ సమయంలోనే మేము ‘హాసం’ పత్రికను ప్రారంభించాం. ‘హాస్యం’లో నుంచి ’హా’ను, ‘సంగీతం’లో నుంచి ‘సం’ను తీసుకొని ‘హాసం’ పేరుపెట్టాం. ఆ సమయంలో అనేక మంది కళాకారులు ‘హాసం’కు వ్యాసాలు రాసి పంపుతూ ఉండేవారు. బాపు, రమణల వ్యాసాలు కూడా అనేకం ప్రచురితమయ్యాయి. బాలుకు ఈ పత్రికంటే ప్రత్యేకాభిమానం ఉండేది. పత్రిక ప్రతి సంచికలోను ఆయన ‘మీ పద సంపద’ అనే శీర్షికను నిర్వహించేవారు. మా మధ్య స్నేహం మరింత బలపడడానికి సంగీత, సాహిత్యాల పట్ల మాకిద్దరికీ ఉన్న అభిమానం తోడయింది. ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. బాలు గొప్ప సంస్కారి. మృదు భాషి. ‘ఆత్మస్తుతి.. పరనింద’ అనే సూత్రంపై నడిచే కళాప్రపంచంలో అయన ఒక అరుదైన మనిషి. ఆయన పరుషంగా మాట్లాడడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. గాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన తొలిరోజుల్లో తనకు సాయం చేసిన వారిని గుర్తుపెట్టుకొని మరీ గౌరవించేవారు. సన్మానించేవారు. తనను అవమానించిన వారిని మర్యాదగా మరిచిపోయేవారు. అందరు గాయకుల మాదిరిగానే ఆయనకు తొలినాళ్లలో అనేక అవమానాలు ఎదురయ్యాయి. వాటిని ఒక అనుభవంగా గమనించి గుణపాఠాలు నేర్చుకోవాలనుకొనేవారు తప్పితే- ప్రతీకారం తీర్చుకోవాలనుకొనేవారు కాదు. ఆయనపై అనేక వదంతులు వచ్చినా- వాటిని పట్టించుకొనేవారు కాదు. స్నేహితులను, గురువులను ప్రేమించేవారు. ప్రేమతో వారిని గెలిచేవారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను. ఇళయరాజాకు తొలి రోజుల్లో చేయూతనిచ్చింది బాలునే! ఆ తర్వాత ఇళయరాజా పెద్ద సంగీత దర్శకుడయ్యారు. బాలు తాను ఇళయరాజాకు చేసిన సాయాన్ని మర్చిపోయారు. ఆయన విద్వత్తునే గుర్తించుకున్నాడు. ‘‘వాడు గొప్పవాడండీ! స్వర బ్రహ్మ. చేతులెత్తి దండం పెట్టాలి’’ అనేవారు. వారిద్దరి మధ్య వివాదం చెలరేగినప్పుడు కూడా బాలు ఎప్పుడూ ఇళయరాజా గురించి ఒక్క తప్పు మాట కూడా మాట్లాడలేదు. ‘‘వాడికి నా మీద ప్రేమ ఉంది. నాకూ వాడి మీద ప్రేమ ఉంది. వాళ్ళ లాయరు ఏవేవో మాట్లాడుతున్నాడు. వాటికి మా లాయరు సమాధానమిస్తాడు. మా మధ్య ఏమీ లేదు’’ అనేవారు బాలు. చివరకు వారిద్దరి మధ్య వివాదం సద్దుమణిగింది. బాలుకు ఆరోగ్యం బాగాలేదని తెలిసిన వెంటనే స్పందించింది ఇళయరాజానే!  బాలు ఇళయరాజాను ఓడించలేదు. స్నేహంతో, ప్రేమతో గెలుచుకున్నారు. అదీ బాలూ వ్యక్తిత్వం. స్నేహానికి బాలు దగ్గర కచ్చితమైన నిర్వచనం ఉండేది. ‘‘‘ఒకసారి స్నేహం చేస్తే- ఎన్ని తప్పులున్నా కొనసాగించాల్సిందే. అవసరమైనప్పుడు స్నేహితుడిని కాపాడాల్సిందే’’ అనేది ఆయన సూత్రం. దానినే మనసా వాచా కర్మణా ఆచరించారాయన.


స్నేహం కోసం..

స్నేహం కోసం ఎంత కష్టమైన పనైనా చేయటానికి బాలు వెనకాడేవారు కాదు. మేము తుది దశలో ఉన్న క్యాన్సర్‌ పేషెంట్ల కోసం ‘స్పర్శ హాస్సిస్‌’ అనే ఒక సంస్థను నెలకొల్పాం. జీవిత చరమాంకంలో ఉన్నవారికి సాంత్వన చేకూర్చటమే ఈ సంస్థ లక్ష్యం. ఈ సంస్థకు భవంతులు కట్టే సమయంలో కొంత సొమ్ము అదనంగా కావాల్సి వచ్చింది. బాలుతో చెబితే ఒక షో ద్వారా సొమ్ము సేకరిద్దామన్నారు. షో చాలా బాగా జరిగింది. చివరలో బాలు- ప్రేక్షకులు సంస్థకు అదనంగా విరాళం ఇస్తే- వారు కోరిన పాటలు పాడతానని ప్రకటించారు. ప్రేక్షకులు ఆయన చేత పాటలు పాడించుకోవడానికి విరగబడ్డారు. ఒకటి.. రెండు కాదు. నాలుగున్నర గంటలు విరామం లేకుండా పాడుతూనే ఉన్నారు. ‘హాస్సిస్‌’కు సాయం చేయాలనే సంకల్పమే ఆయనను ముందుకు నడిపించిందనుకుంటా. ఇదే విధంగా చల్లపల్లిలో ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమానికి కూడా నా మాట కాదనలేక... అక్కడకు వచ్చి అందించిన సహకారం మరిచిపోలేనిది. బాలు లాంటి పేరుప్రతిష్ఠలున్న గాయకుడు ఇవేమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక స్నేహితుడికి ఆయన ఇచ్చే విలువ మాటల్లో కాదు.. చేతల్లో వ్యక్తమయ్యేది. సంగీతంలో ఉన్న అభినివేశంతో నేను రాయించి.. రాగాలు చేయించిన అనేక ఆల్బమ్స్‌లో గానం చేశారు. వ్యాఖ్యానం అందించారు. ‘ఎక్కడిది ఇంత హాయి...’, ‘కాలం చిరుకొమ్మ మీద...’, ‘లక్ష్మీ కళ్యాణం’, ‘శ్రీరామ కథామృతం’ వంటి ఆల్బమ్స్‌కు ఇతర గాయకులతో కలిసి వన్నె తెచ్చింది ఆయనే! పాటలు సరే... ఆయన వ్యాఖ్యానం కూడా మధురంగానే ఉంటుంది. 


ప్రస్తుతం మనం కరోనా గడ్డుకాలంలో బతుకుతున్నాం. ‘కొవిడ్‌-19’తో ఇబ్బందులు పడుతున్నవారి కోసం బాలు అనేక సహాయ కార్యక్రమాలు చేశారు. దురదృష్టవశాత్తు ఆయన కూడా కరోనా బారిన పడ్డారు. బాలు అజేయుడిగా ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత- మళ్లీ ఆ సహాయ కార్యక్రమాలు కొనసాగించాలి. గుండెలోతుల్లో నుంచి వచ్చే ఆయన అనుభవాలు కొన్ని కోట్ల మందికి ధైర్యాన్ని ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలు త్వరగా కోలుకోవాలి. ఆయన పాటా కావాలి.. మాటా కావాలి.. ఆయన సంగీతం కావాలి.. స్వీయానుభవంతో అందరికీ ఆరోగ్య పరిరక్షణ సందేశాన్ని అందించాలి. ఆయన ఎప్పటికీ చిరంజీవిగానే మిగిలిపోవాలి.


పాడుతూ ఉండాలి తియ్యగా...


బాలూ అంటే.. ఎందుకింత అభిమానం?


బాలు పాటకు పట్టాభిషేకం




Updated Date - 2020-09-06T05:30:00+05:30 IST