పల్లవించిన గాంధర్వం

ABN , First Publish Date - 2020-09-26T19:14:47+05:30 IST

పల్లవించిన గాంధర్వం

పల్లవించిన గాంధర్వం

బాలు గానంలో పరవశించిన కందనవోలు 

కర్నూలులో పలు సంగీత కార్యక్రమాలు

కవులు, కళాకారులు, గాయకుల నివాళి


కర్నూలు(కల్చరల్‌): ఆయన స్వరం సమ్మోహనం. గాన గంధర్వుడనే మాటకు సరిపోయిన కంఠస్వరం. సినీ నేపథ్యగాయకుడిగా, నటుడిగా, సంగీత వ్యాఖ్యాతగా శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం ప్రపంచమెరిగిన సంగీతకారుడు. ఆయన మృతితో కర్నూలు సంగీతాభిమానులు విషాదానికి గురయ్యారు. జిల్లా గాయకులతో, కళాకారులతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. పలు పర్యాయాలు ఆయన కర్నూలుకు విచ్చేశారు. తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. జిల్లాకు చెందిన ఎందరో గాయకులను ఆయన తన కార్యక్రమాల ద్వారా ప్రోత్సహించారు. కర్నూలుకు చెందిన కవి ఎలమర్తి రాసిన కందనవోలు ఘన చరిత అనే గీతాన్ని వేలాది ప్రేక్షకుల ముందు ఆయన పాడారు. జిల్లాకు చెందిన గాయకులతో ఆయన వాట్స్‌ఆప్‌లతో పలుకరించేవారు. జిల్లాతో బాలుకు ఉన్న అనుబంధాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం...!


వైద్య కళాశాల ప్రదర్శనతో.. 

1969లో కర్నూలు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ఎస్పీ బాలు విచ్చేశారు. ఆనాడు అతి కొద్ది మందిని మాత్రమే ఆయన ప్రదర్శనకు అనుమతించారు. ఆనాటి ఘంటసాల గానకళా సమితి ప్రతినిధులు బీఎస్‌ రావు, సుస్వరం వాసుదేవమూర్తిలతో కలిసి ఆయన జిల్లాలో గాయకులు, కళాకారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 


శంకరాభరణం విడుదలైన రోజుల్లో..

జిల్లాతో బాలు అనుబంధాన్ని గుడిమెట్ల నరసింహారావు ఇలా గుర్తు చేసుకున్నారు. 1980లో శంకరాభరణం చిత్రం విడుదలై ఎక్కడ చూసినా ఆయన పాటలే వినిపించేవి. ఆనాడు జిల్లా మెడికల్‌, సేల్స్‌ అసోసియేషన్‌ భవన నిర్మాణం నిధుల సేకరణకు బాలుతో కచేరీ ఏర్పాటు చేశారు. 1980 సెప్టెంబరు 29న మద్రాసులో రికార్డింగ్‌ ముగించుకొని ఆయన తన చెల్లెలు శైలజతో కలిసి కర్నూలు విచ్చేశారు. స్థానిక నటరాజ్‌ థియేటర్‌లో సంగీత విభావరి నిర్వహించారు. అంతకు ముందు బాలు ప్రముఖ సంగీత కళాకారుడు శ్రీపాద పినాకపాణికి పాదాభివందనం చేసుకొని, ఆయన ఆశీర్వాదాలు తీసుకొని తన ప్రదర్శన ఇచ్చారు. అయితే ఈ ప్రదర్శన చేసినందుకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం విశేషం.


1978లో..

బాలసుబ్రహ్మణ్యం 1978లో కర్నూలులోని దామోదరం సంజీవయ్య మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో సంగీత కచేరీ చేశారు. ఆనాటి కర్నూలు సినీ సంగీత అభిమానుల సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సమయంలో కమల్‌హాసన్‌ నటించిన ‘మరో చరిత్ర’ చిత్రం సమీపంలోని రాధాకృష్ణ థియేటర్‌లో విడుదలై సూపర్‌డూపర్‌ కలెక్షన్లతో నడుస్తోంది. మరోచరిత్రలోని ‘బలె బలె మగాడివోయ్‌’ అనే పాట ఆనాటి యూత్‌లో క్రేజీ సాంగ్‌గా ఉండేది. ఆ పాట పాడి ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. ఆనాటి అడవి రాముడు, యమగోల, వంటి ఎన్టీయార్‌ చిత్రాల పాటలతోపాటూ అక్కినేని నాగేశ్వర్‌రావు, కృష్ణ, కృష్ణంరాజు వంటి హీరోల పాటలు పాడి అభిమాన సంఘాల మనసు దోచుకున్నారు. 


కందనవోలు చరిత్రను.. 

కర్నూలులో తన మరో ప్రదర్శనలో ఎస్పీబీ 2006 డిసెంబరులో కర్నూలు వచ్చారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఒక ప్రైవేట్‌ ఛానల్‌ ఏర్పాటు చేసిన ‘పాడాలనే ఉన్నది’ అనే కార్యక్రమం ఫైనల్‌ సెలక్షన్స్‌ ఇక్కడే జరిగాయి. ఈ తరుణంలో స్థానిక మధురకవి ఎలమర్తి రమణయ్య రాసిన ‘తుంగభద్ర తరంగాల పొంగులు సంగీతంగా’ అనే పద్యంలోని కందనవోలు ఘన చరిత్రను ఆయన పాటలా పాడి ప్రేక్షకలోకాన్ని ఉర్రూత లూగించారు. అలాగే 2013లో ‘పాడుతా తీయగా’ అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో రెండు ఎపిసోడ్లు, ఎస్‌ఏపీ క్యాంపు గ్రౌండ్‌లో రెండు ఎపిపోడ్లు చిత్రీకరించారు. ఆ సమయంలో ఎలమర్తి రాసిన జిల్లాకు సంబంధించిన ముందుమాటను ఎస్పీ బాలు చేసిన నాలుగు ఎపిసోడ ్లలో ముందుగా చదివి వినిపించారు. 


ఔత్సాహిక గాయకులకు ప్రోత్సాహం

అనేక కార్యక్రమాల ద్వారా బాలసుబ్రహ్మణ్యం ఔత్సాహిక గాయకులను ఎంతో ప్రోత్సహించారు. కర్నూలులో ప్రదర్శన సమయంలో స్థానిక ఔత్సాహిక గాయకులు ఆయన ముందు పాడి, తమ లోటుపాట్లను సరిదిద్దుకున్నారు. కర్నూలుకు చెందిన యువ గాయకుడు సుస్వరం అనిరుద్‌ అంటే బాలుకి ఎంతో ప్రేమ. అనిరుద్‌ పాడుతా తీయగాలో మంచి ప్రతిభ చూపడంతోపాటూ బాలుతో కలిసి కన్నడ భాషలో రెండు పాటలు పాటటం విశేషం. 

Updated Date - 2020-09-26T19:14:47+05:30 IST