బళ్లారిలో 140 అడుగుల క్లాక్‌ టవర్‌ నిర్మాణం

ABN , First Publish Date - 2022-08-17T18:26:55+05:30 IST

అఖండ బళ్ళారి జిల్లా(Bellary District) విభజన తరువాత బళ్ళారి జిల్లాలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన హంపి విజయనగర జిల్లాలో చేరడంతో బళ్ళారికి

బళ్లారిలో 140 అడుగుల క్లాక్‌ టవర్‌ నిర్మాణం

బళ్లారి(బెంగళూరు), ఆగస్టు 16: అఖండ బళ్ళారి జిల్లా(Bellary District) విభజన తరువాత  బళ్ళారి జిల్లాలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన హంపి విజయనగర జిల్లాలో చేరడంతో బళ్ళారికి విశిష్టత కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బళ్ళారి జిల్లా పరిధిలోని ఉన్న ఆయా తాలూకాలో పరిధిలో ఉన్న చారిత్ర్మాక కట్టడాలను అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే బళ్ళారి నగరం(Bellary city)లో గడిగె చెన్నప్ప సర్కిల్‌ స్థానంలో కొత్తగా క్లాక్‌ టవర్‌ నిర్మాణం చేయాలని తలపెట్టింది. ప్రజా పనుల శాఖ ఆధ్వర్యంలో  సుమారు రూ.7కోట్ల రూపాయలు వెచ్చించి 140 ఎత్తు నిర్మిస్తున్న క్లాక్‌ టవర్‌ నిర్మాణం పనులకు సోమవారం రాత్రి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బి.శ్రీరాములు శంకుస్థాపన చేశారు. దీంతో రాయల్‌ సర్కిల్‌ నుంచి రాఘవేంద్ర కాలనీ వరకు చతుస్పాథ మార్గం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ బళ్లారి నగరంలో ఇప్పటికే మోతి సర్కిల్‌లో 150 అడుగుల జాతీయ పతక స్థూపం ఏర్పాటు చేయడం బళ్ళారి నగరానికి ఒక ఐకాన్‌గా నిలిచిందని, నగర సుందరీకరణలో భాగంగా ప్రస్తుతం రాయల్‌ సర్కిల్‌ ఉన్న క్లాక్‌ టవర్‌ స్థానంలో నూతనంగా అత్యంత సుందరమైన క్లాక్‌ టవర్‌ నిర్మాణం చేసి రాష్ట్రంలో బళ్ళారి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. క్లాక్‌ టవర్‌ మధ్యలో లిప్ట్‌ ఏర్పాటు చేయడం ద్వారా నగర ప్రజలు టవర్‌ క్లాక్‌ పైకి వెళ్ళి బళ్ళారి నగరాన్ని పై నుంచి వీక్షించే అవకాశం ఉందన్నారు బళ్ళారి నగరంలో వీధి వ్యాపారుల నుంచి వసూలు చేయదలిచిన పన్ను వసూలు చేయాలన్న నిర్ణయాన్ని పెండింగ్‌లో పెడుతున్నట్లు తెలిపారు. డీఎంఎఫ్‌ నిధుల ద్వారా జిల్లా అభివృద్ధికి రూ 1593.68 కోట్లతో క్రియా యోజనను రూపొందించినట్లు అందులో 1407 అభివృద్ధి పనుల్లో 686 పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. కంప్లి వంతెన నిర్మాణం కోసం రూ.79.93 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే రోజుల్లో బళ్ళారి జిల్లా ప్రముఖ పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి పరిచి దేశంలో స్టీల్‌ హబ్‌గా అభివృద్ధికి ప్రత్యేక పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే జి.సోమశేఖర్‌ రెడ్డి, మాజీ ఎంపీ జె.శాంత, బుడా అధ్యక్షులు పాలన్న,  జిల్లాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి(Pawan Kumar Malapati), ఎస్పీ సైదుల్లా అదావత్‌, జిల్లా సహాయాధికారి పీఎస్‌ మంజునాథ్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఆకాశ్‌ శంకర్‌, తాహసీల్దారు విశ్వనాథ్‌లు పాలికె సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T18:26:55+05:30 IST