బాల్‌ బ్యాడ్మింటన్‌ దిగ్గజం పిచ్చయ్య కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-27T10:04:55+05:30 IST

బాల్‌ బ్యాడ్మింటన్‌ దిగ్గజం పిచ్చయ్య కన్నుమూత

బాల్‌ బ్యాడ్మింటన్‌ దిగ్గజం పిచ్చయ్య కన్నుమూత

1400 టోర్నమెంట్లలో పాల్గొన్న ఘనత

తొమ్మిదిసార్లు జాతీయ చాంపియన్‌


ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు చేపట్టిన బ్యాడ్మింటన్‌ రాకెట్టే ఆ తర్వాత ఆయన సర్వస్వం అయింది.. ఏకలవ్యుడిగా బాల్‌ బ్యాడ్మింటన్‌ సాధన చేసి ఆ ఆటలోని మెలకువలను ఔపోసనపట్టి తదనంతరం ఆ క్రీడనే తన జీవితంగా మలుచుకున్నాడు.. బరిలోకి దిగిన ప్రతి చాంపియన్‌షిప్‌లోనూ పతకాలు కొల్లగొట్టి దిగ్గజంగా పేరుగాంచాడు.. భారత బాల్‌ బ్యాడ్మింటన్‌ రంగంపై అంతలా తనదైన ముద్రవేసిన జమ్మలమడక పిచ్చయ్య కన్నుమూశారు..


హనుమకొండ (ఆంధ్రజ్యోతి) : స్వతంత్ర భారతావనిలోనేకాదు..బ్రిటీష్‌ హయాంలోనూ సత్తా చాటి దేశ బాల్‌ బ్యాడ్మింటన్‌కు వన్నె తెచ్చిన అర్జున అవార్డీ జమ్మలమడక పిచ్చయ్య (104) ఆదివారం కన్నుమూశారు. ఇటీవలే జన్మదినాన్ని జరుపుకొన్న ఆయన ఇంతలోనే మరణించడం క్రీడారంగాన్ని విషాదంలో ముంచింది. పిచ్చయ్యకు ఇద్దరు కుమార్తెలు. ఆయన భార్య 2007లో మరణించారు.


బాల్‌ బ్యాడ్మింటన్‌ మాంత్రికుడు..

బాల్‌ బ్యాడ్మింటన్‌లో అసమాన ప్రతిభావంతుడైన పిచ్చయ్య జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్నారు. కృష్ణా జిల్లా కూచిపూడిలో 1918 డిసెంబరు 21న ఆయన జన్మించారు. 1948లో వరంగల్‌  వచ్చి స్థిరపడడంతో జిల్లాతో పిచ్చయ్యకు విడదీయరాని బంధం ఏర్పడింది. అర్జున పిచ్చయ్యగా అందరికీ ఆయన సుపరిచితుడు. చదువుకునే రోజుల్లోనే స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అలాగే ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బాల్‌బ్యాడ్మింటన్‌లో చక్కటి ప్రతిభ కనబరిచారు. ఆ తర్వాతి కాలంలో తనకు అత్యంత ఇష్టమైన బాల్‌బ్యాడ్మింటన్‌ను ఎంచుకొని దానికే జీవితాన్ని అంకితం చేశారు. ఏకలవ్యుడిలా సాధన చేసి ఆటపై పట్టు సాధించి పలుసార్లు జాతీయ చాంపియన్‌షి్‌ప గెలుచుకున్నారు. అప్పట్లో పిచ్చయ్య బరిలో నిలిచారంటే పతకం ఖాయమనే స్థాయిలో ఆయన ఆట ఉండేది.


మంత్రి సత్యవతి సంతాపం

పిచ్చయ్య మృతిపట్ల తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం క్రీడా లోకానికి తీరని లోటన్నారు. పిచ్చయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


సాధించిన విజయాలు..

1951లో జరిగిన ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్ర బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో ప్రథమ స్థానం పొందడంతో ఆయన క్రీడా జీవితం మలుపు తిరిగింది. 1955-1970ల మధ్య 14సార్లు జాతీయ బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో పాల్గొన్నారు. అందులో తొమ్మిదిసార్లు విజేతగా, మూడుసార్లు రన్నర్‌పగా నిలిచారు. ఇక 1938-1970 మధ్య పిచ్చయ్య జిల్లా, రాష్ట్రస్థాయిల్లో 1400 టోర్నమెంట్లలో పాల్గొన్నారు. వింబుల్డన్‌ ఆఫ్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌గా ప్రసిద్ధి చెందిన మధురై టోర్నీ సందర్భంగా 1958లో నిర్వాహకులు పిచ్చయ్యను ఘనంగా సత్కరించి ‘బాల్‌ బ్యాడ్మింటన్‌ మాంత్రికుడు’ బిరుదును ప్రదానం చేశారు. 1966లో ఇదే టోర్నమెంట్‌ నిర్వాహకులు ‘స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ బిరుదుతో సన్మానించారు. దేశ క్రీడా రంగ పురస్కారం అర్జున అవార్డుకు ఆయన 1970లో ఎంపికయ్యారు. 1972లో నాటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. 1978లో అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య రవీంద్ర భారతిలో పిచ్చయ్యను ఘనంగా సత్కరించారు. 1997లో ఎన్‌టీఆర్‌ రాష్ట్ర క్రీడా పురస్కారాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా  అందుకున్నారు. 



Updated Date - 2021-12-27T10:04:55+05:30 IST