Abn logo
Jan 21 2021 @ 13:23PM

బాలయ్యను మెప్పించేదెవరు?

నటరత్న నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్ అంటే మాస్ అభిమానులకు పండగే. వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే బాలయ్య డైహార్ట్ ఫ్యాన్స్‌ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీరి కాంబినేషన్‌లో గతంలో 'లారీ డ్రైవర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహ నాయుడు' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. త్వరలో వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. బాలయ్యకు సరిపోయే మంచి కథ కోసం బి.గోపాల్ అన్వేషణ చేస్తున్నారని, ఇప్పటికే ముగ్గురు కథా రచయితలు ఈ సినిమా కోసం కథలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ ముగ్గురు కథా రచయితలు ఎవరో.. ఏబీఎన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా రివీల్‌ చేస్తోంది.

ఒకప్పుడు స్టార్‌ రైటర్‌- ఇప్పుడు పట్టించుకునే వారే లేరు

ఎవరో అర్థమయ్యే ఉంటుంది. బాలకృష్ణకు బంపర్‌ హిట్స్‌ ఇచ్చిన రైటర్స్‌లో చిన్నికృష్ణ ఒకరు. ఒకప్పుడు స్టార్‌ రైటర్‌గా పేరు పొందిన చిన్నికృష్ణను ఇప్పుడు పట్టించుకునే వారే లేరు. దాదాపు రెండు సంవత్సరాల నుంచి నా దగ్గర చాలా మంచి కథలు ఉన్నాయని చిన్నికృష్ణ ప్రెస్‌మీట్స్‌ పెట్టిమరీ చెబుతున్నా.. ఎవరూ పట్టించుకున్నవారే లేరు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే ఓ సినిమాని ప్రకటించాడు చిన్నికృష్ణ. అదేమైందో ఆయనకే తెలియాలి. విషయంలోకి వస్తే.. చిన్నికృష్ణ బాలయ్య-బి.గోపాల్‌ కాంబినేషన్‌ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కథ సిద్ధం అయ్యిందని, త్వరలోనే బాలయ్య-బి.గోపాల్‌లకు ఆయన కథ వినిపించనున్నారని తెలుస్తోంది. అన్నీ బాగుండి కథ ఓకే అయితే.. మళ్లీ చిన్నికృష్ణ పేరు ఇండస్ట్రీలో హడావుడి చేయడం ఖాయం.

స్టార్‌ డైలాగ్‌ రైటర్‌ నుంచి కథా రచయితగా...

ప్రస్తుతం స్టార్‌ డైలాగ్‌ రైటర్‌ ఎవరని అడిగితే ఖచ్చితంగా అందరూ బుర్రా సాయిమాధవ్‌ అనే చెబుతారు. ఆయన మాటలు రాస్తున్నారంటే చాలు.. ఆ సినిమాపై ప్రత్యేకమైన క్రేజ్‌ ఏర్పడే రేంజ్‌కి సాయిమాధవ్‌ ట్రెండ్‌ని మార్చేశారు. డైలాగ్‌ రైటర్‌గా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న సాయిమాధవ్‌ బుర్రా.. ఇప్పుడు బాలయ్య-బి.గోపాల్‌ చిత్రం కోసం కథా రచయితగా మారుతున్నారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకి సాయిమాధవ్‌ రాసిన అద్భుతమైన డైలాగ్స్‌ గురించి బాలయ్య కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అలాంటిది ఇప్పుడాయన తన కోసం కథ రెడీ చేస్తున్నారంటే.. బాలయ్య కూడా సంతోషించే విషయమే. 'అథములం కాదు.. ప్రథములం' అని బాలయ్య కోసం ఆయన రాసిన డైలాగ్‌లా.. ఈ పోటీలో కూడా ఆయన ప్రథముడయ్యే అవకాశం లేకపోలేదు. 


వీరిద్దరే కాకుండా వెంకట్ అనే మరో రచయిత కూడా ఈ కాంబినేషన్ కోసం కథ సిద్ధం చేశారని, ఆయన కూడా త్వరలోనే ఫైనల్ వెర్షన్ వినిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి, ఈ ముగ్గురిలో బాలయ్య, బి.గోపాల్‌ను ఎవరు మెప్పిస్తారో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement