బాలింత మృతి

ABN , First Publish Date - 2021-02-27T05:46:46+05:30 IST

మండలంలో కంఠారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని బకులూరు శివారు అంకంపాలెంలో శుక్రవారం వేకువజామున గర్భిణి ప్రసవించిన నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది.

బాలింత మృతి
మృతి చెందిన బాలింత పద్మ


పీహెచ్‌సీకి తరలిస్తుండగానే ప్రసవం

ఆడబిడ్డ జననం

ప్రసవమైన నిమిషాల వ్యవధిలో మృతి

అనాథలైన పిల్లలు


కొయ్యూరు, ఫిబ్రవరి 26: మండలంలో కంఠారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని బకులూరు శివారు అంకంపాలెంలో శుక్రవారం వేకువజామున గర్భిణి ప్రసవించిన నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది. కుటుంబీకులు, ఆశ వర్కర్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. 

బకులూరు శివారు అంకంపాలెంనకు చెందిన గర్భిణి మాతే పద్మ(23)కి ఈనెల తొమ్మిదవ తేదీన కంఠారం పీహెచ్‌సీలో ఆరోగ్య తనిఖీలు నిర్వహించారు. ఆమెకు హెచ్‌బీ శాతం 8.6 ఉండడంతో వైద్యుల సూచన మేరకు ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజక్షన్‌ చేయించుకొని ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి గురువారం సాయంత్రం వరకు ఆమె చలాకీగానే తిరిగినట్టు కుటుంబీకులు తెలిపారు. శుక్రవారం వేకువజామున మూడు గంటల సమయంలో పద్మకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు ఆశ వర్కర్‌ రాజులమ్మకు సమాచారం అందించారు. వెంటనే ఆశవర్కర్‌ ఆటోలో పీహెచ్‌సీకి తరలించేందుకు ప్రయత్నించింది. అయితే పద్మ బహిర్భూమికి వెళ్లాలని అనడంతో ఇంటి పక్కనే ఖాళీ ప్రదేశంలోకి ఆశవర్కర్‌ తీసుకెళ్లింది. కాలకృత్యం తీర్చుకుంటుండగా పద్మ ఆడబిడ్డను ప్రసవించి, తన భుజంపై వాలిపోయిందని ఆశవర్కర్‌ తెలిపింది. దీంతో భర్తతోపాటు కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే పద్మకు ప్రసవ సమయం చేరువ కావడంతో గురువారం ఉదయం పీహెచ్‌సీకు తరలించేందుకు ప్రయత్నించగా, గర్భిణి తిరస్కరించిందని ఆశవర్కరు రాజులమ్మ తెలిపింది. బాలింత మృతి చెందిన తెలిసిన వెంటనే హెచ్‌వీ అంకంపాలెం వెళ్లి ఆమె మృతికి గల కారణాలను తెలుసుకుంది. అలాగే బకులూరు, కంఠారం సచివాలయాల ఏఎన్‌ఎంలు నాగమణి, కొండమ్మ ఆ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. శుక్రవారం కొమ్మిక శివారు గంగవరంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వెళ్లిన వైద్యులు పద్మప్రియ, అనిల్‌బాబు వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా.. ఆ గ్రామ ఏఎన్‌ఎం సెలవులో ఉండడంతో హెచ్‌వీని పంపించినట్టు వైద్యులు తెలిపారు. శనివారం వెళ్లి బాలింత మృతికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. ఈనెల తొమ్మిదో తేదీన నిర్వహించిన పరీక్షలు ఆమె ఆరోగ్యవంతంగానే ఉందన్నారు.

అనాఽథలైన పిల్లలు

రెండో కాన్పులో ప్రసవిస్తూ పద్మ మృతి చెందడంతో పుట్టిన బిడ్డ, మొదటి కాన్పులో జన్మించిన రెండేళ్ల శ్రీవల్లి, భర్త పోతురాజు అనాథలయ్యారు. అంకంపాలెం గ్రామానికి చెందిన కూడా శ్రీరాములు, చినతల్లిల కుమార్తె పద్మ వరుసకు మేనమామ అయిన అదే గ్రామానికి చెందిన పోతురాజును నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. మొదటి కాన్పు ఇంటివద్దనే జరగ్గా.. శ్రీవల్లికు జన్మనిచ్చింది. రెండవ కాన్పులో మృతి చెందింది.

Updated Date - 2021-02-27T05:46:46+05:30 IST