నరకం చూపిన ఆపరేషన్‌ కుట్లు..గోదావరిఖని సర్కారు ఆస్పత్రిలో బాలింత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-27T14:01:32+05:30 IST

గోదావరిఖని సర్కారు ఆస్పత్రిలో బాలింత ఆత్మహత్య

నరకం చూపిన ఆపరేషన్‌ కుట్లు..గోదావరిఖని సర్కారు ఆస్పత్రిలో బాలింత ఆత్మహత్య

గోదావరిఖని, డిసెంబరు 26 : ప్రసవం కోసం ఆపరేషన్‌ చేసిన వైద్యులు శస్త్ర చికిత్స అనంతరం ఆమెకు కుట్లు వేశారు. అయితే ఇన్ఫెక్షన్‌ రావడంతో గాయం మానలేదు. దీంతో మరోసారి కుట్లు వేశారు. ఇలా మూడుసార్లు జరగడంతో నొప్పికి తాళలేక బాలింత విలవిలలాడింది. ఇన్ఫెక్షన్‌ తగ్గలేదని, మరోసారి కుట్లు వేయాలని డాక్టర్లు చెప్పడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆస్పత్రిలోనే ఉరేసుకుని చనిపోయింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. కమాన్‌పూర్‌ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమ(30) తొలి కాన్పు కోసం ఈ నెల 11న ఆస్పత్రిలో చేరింది. 12న రాత్రి డాక్టర్లు ఆపరేషన్‌ చేయగా.. మగ శిశువుకు జన్మనిచ్చింది. ఏడు రోజుల తర్వాత ఆమె డిశ్చార్జ్‌ కావాల్సి ఉండగా, ఇన్ఫెక్షన్‌ వచ్చి కుట్ల గాయం మానలేదు. ఈ నెల 17న మరోసారి కుట్లు వేశారు. అవి కూడా మానకపోవడంతో 22న ఇంకోసారి కుట్లు వేశారు. అయినప్పటికీ ఇన్షెక్షన్‌ తగ్గలేదు. సోమవారం మరోసారి కుట్లు వేస్తామని వైద్యులు చెప్పడంతో భయపడిన ఉమ ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో బాత్‌రూంలోకి వెళ్లి చున్నీతో కిటికీ గ్రిల్స్‌కు ఉరేసుకుంది. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఎదుట ఉమ బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు .

Updated Date - 2021-12-27T14:01:32+05:30 IST