జగన్ వద్దకు బాలినేని పంచాయతీ

ABN , First Publish Date - 2022-04-11T21:00:51+05:30 IST

ఏపీలో మంత్రివర్గ విస్తరణ దుమారం రేపుతోంది. మంత్రి పదవులు ఆశించిన ఆశావాహులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.

జగన్ వద్దకు బాలినేని పంచాయతీ

విజయవాడ: ఏపీలో మంత్రివర్గ విస్తరణ దుమారం రేపుతోంది. మంత్రి పదవులు ఆశించిన ఆశావహులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. కొత్త కేబినెట్‌లో మాజీ హోంమంత్రి సుచరితకు చోటు దక్కలేదు. దీంతో ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరావు కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం వైసీపీ అధిష్ఠానానికి తెలియడం ఆయనను శాంతింపజేందుకు దూతలుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అప్పిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి వెళ్లారు. బాలినేని నివాసానికి చేరుకున్న నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. బాలినేని ఎంతకూ దిగిరాకపోవడంతో ఆయనను నేరుగా సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయం తెలుస్తోంది. ఇప్పటికే బాలినేనితో సజ్జల రెండుసార్లు చర్చలు జరిపారు. మరోసారి బాలినేనిని బుజ్జగించేందుకు సజ్జల యత్నిస్తున్నారు. 


బాలినేనిని కేబినెట్‌ నుంచి తొలగించడం... అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్‌ బై చెప్పేందుకు కూడా సిద్ధపడ్డారు. బాలినేనిని బుజ్జగించేందుకు ఆదివారం ఉదయం నుంచి రాత్రిదాకా అధిష్ఠానం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తొలుత... ఆదివారం ఉదయం విజయవాడలోని బాలినేని నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్వయంగా వెళ్లారు. ‘ఆదిమూలపు సురేశ్‌ను కూడా తొలగిస్తున్నాం. మీ జిల్లా నుంచి ఎవరూ కేబినెట్‌లో ఉండరు’ అని సజ్జల చెప్పారు. దీంతో... బాలినేని శాంతించారు. సర్దుకుపోయేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రానికి సీన్‌ మారిపోయింది. తుది జాబితాలో ఆదిమూలపు పేరూ కనిపించడంతో బాలినేని హతాశులయ్యారు.

Updated Date - 2022-04-11T21:00:51+05:30 IST