బాలినేని ఓ హవాలా మంత్రి

ABN , First Publish Date - 2021-03-07T06:56:40+05:30 IST

ప్రతిష్టాత్మకమైన పోరు జరుగుతున్న ఒంగోలు..

బాలినేని ఓ హవాలా మంత్రి
రోడ్‌షోలో మాట్లాడుతున్న లోకేష్‌

అక్కడో రెడ్డి, ఇక్కడో రెడ్డి ఆడుకుంటున్నారు

టీడీపీ నేత నారా లోకేష్‌ ధ్వజం

ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిన రోడ్‌షో 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): రాష్ట్రమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ హవాలా మంత్రి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. తాడేపల్లిలో జగన్‌రెడ్డి, ఇక్కడ ఈ రెడ్డి కలిసి జనంతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం ఒంగోలు కార్పొరేషన్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో భాగంగా పలుచోట్ల ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి బాలినేనిని ఉద్దేశించి విమర్శల వర్షం కురిపించారు.  టీడీపీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ ఒంగోలు, మొత్తంగా రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ప్రకటించారు. ఒంగోలులోని కర్నూలు రోడ్డుకి ఉత్తరం వైపునున్న పలు డివిజన్లలో ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షో కార్యక్రమం టీడీపీ కార్యకర్తలలో ఉత్తేజాన్ని, ఆ పార్టీ అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది.

 

ప్రతిష్టాత్మకమైన పోరు జరుగుతున్న ఒంగోలు కార్పొరేషన్‌లో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌ రోడ్‌షో నిర్వహించటమే గాక అటు సీఎంని, ఇటు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి బాలినేనిని టార్గెట్‌ చేస్తూ ఆవేశపూరిత ప్రసంగాలు చేశారు. నగరంలో కొద్దిప్రాంతానికే రోడ్‌షో పరిమితమైనప్పటికీ అది పార్టీ క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపింది. ఈనెల 10వ తేదీ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం రమారమి 5గంటలపాటు లోకేష్‌ రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడటంతోపాటు, చివరగా కొత్తపట్నం బస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన ప్రచారసభలో ప్రసంగించారు. ఎన్నికల సమరంలోకి కాస్తంత ఆలస్యంగా దిగిన టీడీపీకి లోకేష్‌ పర్యటన ఉత్తేజాన్నిచ్చింది. దానికితోడు కాస్తంత ఆవేశంగా మాట్లాడటమే గాక అర్థవంతమైన వ్యాఖ్యానాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. 


రోడ్‌షో సాగిందిలా.. 

ఒంగోలుకు సాయంత్రం 5గంటల సమయంలో చేరిన లోకేష్‌కు సరస్వతీ శిశుమందిర్‌ వద్ద ఆపార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అప్పటికే అక్కడ గుమికూడిన ప్రజలనుద్దేశించి మాట్లాడిన లోకేష్‌ తదనంతరం ఎన్‌జీవో కాలనీ మీదుగా దిబ్బల రోడ్డు, సత్యనారాయణపురం, 60 అడుగుల రోడ్డు, వైద్యశాలల జంక్షన్‌ నుంచి గుంటూరు రోడ్డులోకి ప్రవేశించి నవభారత్‌ హాలు సెంటర్‌ మీదుగా ఇస్లాంపేటలోని గోపీకృష్ణ థియేటర్‌ ముందుగా గోరంట్ల కాంప్లెక్స్‌ వద్దకు రోడ్‌షో సాగింది. అక్కడ నుంచి గోపాలనగర్‌ మీదుగా కమ్మపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరి అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ నుంచి కొత్తపట్నం బస్టాండ్‌ వరకూ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం కొత్తపట్నం బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ప్రచారసభలో మాట్లాడారు. మొత్తంపై ఆరు ప్రాంతాల్లో ఆయన నగర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తోపాటు పర్చూరు ఎమ్మెల్యే, బాపట్ల లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌, పార్టీ ఒంగోలు లోక్‌సభ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, యువ నాయకుడు దామచర్ల సత్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావు, ఒంగోలు మేయర్‌ అభ్యర్థి డాక్టర్‌ సరోజినితోపాటు నగరానికి చెందిన టీడీపీ నాయకులంతా పాల్గొన్నారు. 


ఆసక్తిగా లోకేష్‌ ప్రసంగం విన్న ప్రజలు 

రోడ్‌షోలో భాగంగా ఆరు చోట్లకుపైగా లోకేష్‌ చేసిన ప్రసంగాన్ని ఆయనను అనుసరిస్తున్న పార్టీ కేడర్‌తోపాటు, ఆయా ప్రాంతాల్లో గుమికూడిన ప్రజలు ఆసక్తిగా వినటం కనిపించింది. ప్రతిచోటా ఉద్వేగంగా మాట్లాడిన లోకేష్‌ స్థానిక అంశాలకు కూడా ప్రాధాన్యమివ్వటం వినేవారిలో అలోచన రేకెత్తించింది. రాష్ట్రప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రి తీరును దుయ్యబట్టడంతో పాటు మంత్రిపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. వాటికి తోడు నగరంలోని సమస్యలను, గతంలో టీడీపీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారు. ఇంకోవైపు వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయిందని విమర్శ చేశారు. అలాగే డబ్బులు పంపిణీ పేరుతో ఒక చేత్తో రూ. 200 ఇస్తూ పన్నులు పెంపు, అపరాధ రుసుం పేరుతో రూ.2వేలు వసూలు చేస్తున్న ప్రభుత్వ దమననీతిని గుర్తించండంటూ అనేక ఉదాహరణలతో వివరించారు. అలాగే భవిష్యత్తులో టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతుందనే హామీల విషయంలో ప్రజలను నేరుగా ఆకట్టుకునే పలు అంశాలను ప్రకటించారు. ముఖ్యంగా అన్న క్యాంటిన్లను తెరిపిస్తాం, బకాయి ఉన్న పేదల ఇంటిపన్నుని రద్దు చేసి ప్రస్తుత పన్నుని సగానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. పెరిగిన నీటి పన్నుతో ఇబ్బందిపడుతున్న పేదల నీటిపన్ను బకాయిని మాఫీ చేసి నీటిపన్నుని తగ్గిస్తామని కూడా హామీ ఇచ్చారు. తద్వారా నగరంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రసంగించటాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా కొనియాడుతున్నారు. 


ఒంగోలు డెయిరీ మూసివేతకు కుట్ర 

స్థానిక ఎమ్మెల్యే అయిన రాష్ట్ర మంత్రి బాలినేనిపై లోకేష్‌ విమర్శల వర్షం కురిపించారు. ఒక దశలో తూలి ఆయన వ్యక్తిగత వ్యవహారశైలిపై కూడా విమర్శలు చేశారు. తాడేపల్లిలో ఓ రెడ్డి, ఇక్కడ ఓ రెడ్డి గారు కలిసి జనానికి చేస్తున్నది శూన్యమేనని విమర్శించారు. ఒంగోలు మంత్రి నియోజకవర్గం అని చెప్పుకోటానికే తప్ప ఆచరణలో అభివృద్ధి కానరావటం లేదన్నారు. గడచిన 21 నెలల పాలనలో ఒక్క బోరు, ఒక్క రోడ్డు అయినా వేశారా, చివరికి వీధి దీపాలు పోతే వెలిగించే దిక్కే లేదని విమర్శించారు. అమూల్‌ సంస్థ ద్వారా ఒంగోలు డెయిరీని మూసివేయించే కుట్ర ప్రారంభమైందని, అక్కడ ఉద్యోగులు దీక్షలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని విమర్శించారు. ఒంగోలు డెయిరీకి చెందిన ఉద్యోగులు, పాల ఉత్పత్తిదారులకు అండగా టీడీపీ ఉంటుందని ప్రకటించారు. 


రోడ్‌షోలో వైసీపీ కవ్వింపు చర్యలు

ఒంగోలులో నారా లోకేష్‌ రోడ్‌షో సందర్భంగా వైసీపీ శ్రేణులు ఎదురురావ డంతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం సాయంత్రం 5 గంట లకు నగరంలోని సరస్వతి శిశుమందిరం వద్ద నుంచి మొదలైన రోడ్‌షో కొత్తపట్నం బస్టాండ్‌లో ముగిసింది.తొలుత స్థానిక 47వ డివిజన్‌ వద్ద రోడ్‌షో ప్రారంభం కాగా, అదే సమయంలో అటుగా వెళుతున్న వైసీపీ కార్య కర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇది టీడీపీ శ్రేణుల కు ఆగ్రహం తెప్పించింది. ఇరుపార్టీల కార్యకర్తలు నినా దాలు చేయడంతోపాటు, తోపులాటకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో లోకేష్‌ సమన్వ యం పాటించాలని టీడీపీ శ్రేణులకు సూచించడంతోపా టు, పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. 









Updated Date - 2021-03-07T06:56:40+05:30 IST