భళా.. బాల్కనీ సిస్టర్స్‌

ABN , First Publish Date - 2020-08-13T05:30:00+05:30 IST

ఇద్దరూ ఇద్దరే... జీన్స్‌ ప్యాంట్‌ వేస్తారు... గాగుల్స్‌ పెడతారు... రెండు జడలు వేస్తారు... కాళ్లకు మువ్వలు కడతారు... చేతిలో గిటార్‌తో అటు సాంప్రదాయాన్ని, ఇటు ఆధునికతను కనబరుస్తూ కచేరీ మొదలెడతారు...

భళా.. బాల్కనీ సిస్టర్స్‌

ఇద్దరూ ఇద్దరే... జీన్స్‌ ప్యాంట్‌ వేస్తారు... గాగుల్స్‌ పెడతారు... రెండు జడలు వేస్తారు... కాళ్లకు మువ్వలు కడతారు... చేతిలో గిటార్‌తో అటు సాంప్రదాయాన్ని, ఇటు ఆధునికతను కనబరుస్తూ కచేరీ మొదలెడతారు. అది కూడా ఎక్కడనుకున్నారు? వెరైటీగా ఇంటి బాల్కనీలో. అక్కడి నుంచే సంగీత కచేరీలు చేయడం, పాటలు పాడడం పుణే సిస్టర్స్‌ ప్రత్యేకత. ‘నంది సిస్టర్స్‌’ పేరిట అంతర, అంకితా నందీలు చేస్తున్న మ్యూజిక్‌ వీడియోలకు ప్రస్తుతం సోషల్‌మీడియాలో లక్షల సంఖ్యలో వీక్షకులున్నారు. ఆ విశేషాలే ఇవి...



పాటలు అందరూ పాడతారు. వాటిని ఎంత వెరైటీగా ప్రజెంట్‌ చేస్తే అంత బాగా పాపులర్‌ అవుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆ విధంగా ఎంతోమంది తమ టాలెంట్‌ను చూపేందుకు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘నందీ సిస్టర్స్‌’... ‘బాల్కనీ సిస్టర్స్‌’గా మారారు. ఇద్దరూ స్టయిల్‌గా తయారై, రెండు గిటార్‌లను తీసుకుని పాట అందుకుంటారు. ఆ పాటకు వారే సంగీతకారులు కూడా. గిటార్‌ వాయిస్తూ, చప్పట్లు చరుస్తూ, తాళం వేస్తూ పాటకు కొత్త అందాన్ని తీసుకొస్తారు. సంప్రదాయం, ఆధునికతల సమ్మేళనంతో వారి సంగీత కచేరీ ఆబాలగోపాలన్నీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో యువతరం ఈ సిస్టర్స్‌ ప్రయోగాలకు వన్స్‌మోర్‌ చెబుతున్నారు.   


అంతర, అంకితా నందీ ఇటీవల తమ పాదాలకు గజ్జెలు చుట్టుకుని కొన్ని తమ్‌కాలతో ‘రేషమచ్యా రెఘానీ’ని తమ వెర్షన్‌లో వినిపించి ప్రేక్షకులను సంగీత సముద్రంలో ఓలలాడించారు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలో ఉండే మ్యూజిక్‌ క్లిప్‌ ఇది. అయినప్పటికీ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఈ క్లిప్‌ను వారిద్దరు ఇంటి వరండాలో షూట్‌ చేశారు. ఈ క్లిప్‌కు నాలుగు మిలియన్ల వ్యూస్‌ కేవలం యుట్యూబ్‌లోనే వచ్చాయంటే వీరి సంగీతం ఎంత సంచలనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్‌లో ఇప్పటికే చాలా వీడియోలు చేశారు. ఈ సిరీస్‌ అన్నింటికీ కలిపి ఈ సిస్టర్స్‌ ‘బాల్కనీ కన్‌సర్ట్స్‌’ అని పేరు పెట్టారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో ఈ సిరీస్‌ పెద్ద హిట్‌ అయ్యింది.  




ఆలోచన ఎలా వచ్చిందంటే...

ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లలో 21 ఏళ్ల అంతర నేపథ్య గాయని. ఈమె ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌. రెహమాన్‌ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. చిన్నప్పుడే మ్యూజిక్‌ టాలెంట్‌ షో ‘సరేగామాపా లిటిల్‌ ఛాంప్స్‌’లో పాల్గొని ప్రముఖ గాయకురాలు కవితా కృష్ణమూర్తి ప్రశంసలు అందుకుంది. అంతర టాలెంట్‌ చూసి ముచ్చటపడిన కవితా కృష్ణమూర్తి ఆ చిన్నారి ‘అల్‌బేలీ’ అంటూ ముద్దాడింది. ఆమె తన సోదరి అంకితతో కలిసి బాల్కనీ కచేరీకి శ్రీకారం చుట్టింది. ‘‘మాది అసోం. ఎప్పుడూ బిహూ (అస్సామీ సంప్రదాయ పండగ) సమయంలో మా స్వస్థలంలో గడిపేవాళ్లం. బంధుమిత్రులు, చుట్టాలను కలిసేవాళ్లం. కొన్ని సంగీత కచేరీలను ఇచ్చేవాళ్లం. ఎప్పుడైతే పుణేలో వీటిని మిస్‌ అవడం మొదలైందో అప్పుడు మాకు కొత్త ఆలోచన వచ్చింది. మంచి దుస్తులు వేసుకుని ఇంటర్నెట్‌లో ఫన్‌ కార్యక్రమాలు నిర్వహించడం మొదలెట్టాం. మా అమ్మ అస్సామీ మెఖోలాను మాకు వేసేది. దాంతో ఇద్దరం అస్సామీ  పాటలు వరండాలో నిలబడి పాడడం మొదలెట్టాం. మా ముందర చాలామంది శ్రోతలు కూర్చుని మా  పాటలు వింటున్నట్టు నేను, అంకితా పాడాం. దాన్ని వీడియో చేసి చూశాం. అది చక్కగా వచ్చింది. దాంతో సోషల్‌ మీడియాలో పోస్టు చేశాం. అది వైరల్‌ అయ్యింది. పాటను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన రెండు గంటల్లోనే అనూహ్య స్పందన వచ్చింది. మేము సరదాగా చేసిన ఆ వీడియోకి అంత భారీగా స్పందన రావడం మాకు ఉత్సాహాన్నిచ్చింది. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ విధంగా ‘బాల్కనీ కన్‌సర్‌ ్ట్స’కు ఎంతో పేరు వచ్చింది’’ అన్నారు అంతర. 




చప్పట్లు చరుస్తూ... బల్లపై దరువేస్తూ... 

అప్పటి నుంచి ఇప్పటిదాకా అంకిత, అంతరలు వివిఽధ గెటప్‌లలో 11 కచేరీలు ఇచ్చారు. ‘నందీ సిస్టర్స్‌’గా ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లకు చిన్నప్పటి నుంచే సంగీతంలో ప్రవేశం ఉంది. అంతర హిందుస్థానీ మ్యూజిక్‌ స్కాలర్‌ అయితే, అంకిత సంగీత దర్శకులు చందన్‌ రాయ్‌ చౌదరి దగ్గర మ్యూజిక్‌ నేర్చుకుంది. రెండు సంవత్సరాల క్రితం ఈ అక్కాచెల్లెళ్లని ‘క్లాప్‌ అండ్‌ కప్‌ సిస్టర్స్‌’ అని పిలిచేవారు. ఎందుకంటే ఒక పాటను వీరు కేవలం చప్పట్లు, బల్ల మీద దరువు వేస్తూ అద్భుతంగా ఆలపించేవారు. అలా ‘బాజీరావ్‌ మస్తానీ’లోని ‘పింగా’ పాట ద్వారా పాపులర్‌ అయ్యారు. ఈ ప్రక్రియను వారు అన్నా కెండ్రిక్‌ ‘కప్పా సాంగ్‌’ నుంచి స్ఫూర్తి పొందారు. నందీ సిస్టర్స్‌ పాడిన ‘పింగా’ పాటకు అప్పట్లోనే 15 లక్షల వ్యూస్‌ రావడం విశేషం. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో మాకు కాస్త సమయం దొరికింది. అంకిత ‘యూకలీ’ (హవాయి సంగీత వాయిద్యం) నేర్చుకోవాలనుకుంది. నాకు అప్పటికే వచ్చు కాబట్టి, నేను ఆమెకు నేర్పించాను. ఆ తర్వాత సంగీత కచేరీలు ఇస్తూనే ఉన్నాం’ అన్నారు అంతర. అన్ని వర్గాల, భాషల ప్రజలకు దగ్గర కావాలని రకరకాల భాషల పాటలు ఈ సిస్టర్స్‌ ఎంచుకుని పాడుతున్నారు. వీటిల్లో మలయాళం నుంచి భోజ్‌పురి, రాజబోంగ్షి వరకూ ఎన్నో భాషలు ఉన్నాయి. ‘మా ఈ మిషన్‌లో మిత్రులు చేసిన సహాయం ఎంతో. వాళ్ల భాషకు సంబంధించిన వివిధ డిక్షన్లను ఫోన్‌లో మాకు ఎంతో ఓర్పుగా చెప్పేవారు’ అని అంకిత గుర్తుచేసుకుంది.


వివిధ సందర్భాలకు అనుగుణంగా...

పాటల ఎంపికలో ఈ సిస్టర్స్‌ అభిరుచి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా కొన్ని పాటలను ఎంచుకుని మరీ పాడతారు. ముఖ్యంగా మహారాష్ట్ర దినోత్సవం, పొయిలా బైసాఖీ, గణేష్‌ చతుర్ధి వంటి పండగ సందర్భాలలో... రుతుపవనాలు వచ్చే సందర్భాలలో అంకిత, అంతర సోదరీమణులు చేసిన సంగీత కచేరీలు అనేక ప్రశంసలు అందుకున్నాయి. పాట రికార్డు సందర్భంలో విజువల్‌, టెక్నికల్‌ సపోర్టును వీళ్ల తల్లిదండ్రులు చూసుకుంటారు. అంతేకాదు నందీ సిస్టర్స్‌ అమ్మ వారికి కావాల్సిన కాస్ట్యూమ్స్‌, బాల్కనీ సెటప్స్‌ గురించి కేర్‌ తీసుకుంటే... తండ్రి సాంకేతిక విషయాలలో సాయం చేస్తున్నారు. ఆ విధంగా తమ కూతుళ్లకు పూర్తి సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ‘‘బిహూ లాంటి మరిన్ని ఎపిసోడ్లు తీసుకురావాలనే ఆలోచనలో మేం ఉన్నాం. ఇవి ఒరిజనల్‌ ట్రాక్స్‌లో వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాం. సంగీతంతో పాటు ఉన్నత చదువులపై కూడా మేమిద్దరం దృష్టి పెట్టాం. మా పాటలతో, సంగీతప్రియుల పెదాలపై చిరునవ్వులు పూయించాలన్నదే మా కోరిక’’ అంటున్న బాల్కనీ సిస్టర్స్‌ ఆ దిశగా మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.


ఇద్దరు అక్కాచెల్లెళ్లకు చిన్నప్పటి నుంచే సంగీతంలో ప్రవేశం ఉంది. అంతర హిందుస్థానీ మ్యూజిక్‌ స్కాలర్‌ అయితే, అంకిత సంగీత దర్శకులు చందన్‌ రాయ్‌ చౌదరి దగ్గర మ్యూజిక్‌ నేర్చుకుంది. రెండు సంవత్సరాల క్రితం ఈ అక్కాచెల్లెళ్లని ‘క్లాప్‌ అండ్‌ కప్‌ సిస్టర్స్‌’ అని పిలిచేవారు. ఎందుకంటే ఒక పాటను వీరు కేవలం చప్పట్లు, బల్ల మీద దరువు వేస్తూ అద్భుతంగా ఆలపించేవారు. అలా ‘బాజీరావ్‌ మస్తానీ’లోని ‘పింగా’ పాట ద్వారా పాపులర్‌ అయ్యారు.ఈ ప్రక్రియను వారు అన్నా కెండ్రిక్‌ ‘కప్పా సాంగ్‌’ నుంచి స్ఫూర్తి పొందారు. నందీ సిస్టర్స్‌ పాడిన ‘పింగా’ పాటకు అప్పట్లోనే 15 లక్షల వ్యూస్‌ రావడం విశేషం.


Updated Date - 2020-08-13T05:30:00+05:30 IST