ఆహారంతో పాటు అలవాట్లూ ముఖ్యమే...

ABN , First Publish Date - 2020-10-07T06:05:41+05:30 IST

పోషకాలున్న ఆహారంతో పాటు తినే విధానం కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. గబగబా తినేసి, ఆఫీసుకు పరుగులు తీస్తుంటారు చాలామంది. అయితే ఇది మంచి ఆరోగ్య అలవాటు కాదు అంటున్నారు క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌ రమ్యా రామచంద్రన్‌...

ఆహారంతో పాటు అలవాట్లూ ముఖ్యమే...

పోషకాలున్న ఆహారంతో పాటు తినే విధానం కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. గబగబా తినేసి, ఆఫీసుకు పరుగులు తీస్తుంటారు చాలామంది. అయితే ఇది మంచి ఆరోగ్య అలవాటు కాదు అంటున్నారు క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌ రమ్యా రామచంద్రన్‌. ఆమె చెబుతున్న ఆరోగ్య సూచనలివి...


ప్లేట్‌ కలర్‌ఫుల్‌గా ఉండాలి: సమతులాహారం కోసం పలు రంగుల్లో ఉండే ఆహారపదార్ధాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకుపచ్చని కూరగాయల్లో విటమిన్‌ సి, ఫోలిక్‌ ఆమ్లంతో పాటు ఐరన్‌, కాల్షియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు లభిస్తాయి. ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటు, గుండెజబ్బులు, కేన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి.  

సొంతగా వంట చేయండి: భోజనం ఇష్టంగా చేయాలంటే ఇష్టంగా వండాలి. అప్పుడు మీకు ఆహారంలో ఏయే పోషకాలు ఉన్నాయో తెలుస్తుంది. అంతేకాదు వివిధరకాలు రుచులను ఆస్వాదించడంతో పాటు ఆహారంలో ఉప్పు, చక్కెరల మోతాదు తగ్గించడం సాధ్యపడుతుంది. 

ఆబగా తినొద్దు: వంట పూర్తయ్యాక, ఆబగా తినేయొద్దు. ప్లేట్‌లో ఉన్నదంతా గబగబా తినేయడం వల్ల ఆహారాన్ని సరిగ్గా నమలకుండానే మింగేస్తారు. దీంతో జీర్ణపరమైన సమస్యలు, మధుమేహం, ఉబకాయం, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ వంటి అనారోగ్యాల బారిన పడతారు. అందుచేత నిదానంగా, రుచిని ఆస్వాదిస్తూ భోజనం చేయాలి. 

మనసుపెట్టి తినాలి:  టీవీ చూస్తూనో, కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్‌ చూస్తూనో తినేస్తుంటారు కొందరు. దాంతో ఆహారం నమిలేటప్పుడు సరిపోను లాలాజలం విడుదల కాదు. దాంతో జీర్ణపరమైన సమస్యలు వస్తాయి. అంతేకాదు పొట్ట నిండిన తరువాత చాలు అన్న భావన కలగదు. ఫలితంగా పరిమితికి మించి తింటారు.

ఒత్తిడి తగ్గించుకోవాలి: కొందరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినేస్తుంటారు. ‘స్ట్రెస్‌ ఈటింగ్‌’ అనేది ఎక్కువ నష్టం చేస్తుంది. ఒత్తిడి సమయంలో ఏదైనా తినడం బదులు పుస్తకాలు చదవడం, వంట చేయడం లేద కాసేపు పరిగెత్తడం వంటివి చేయాలి.

Updated Date - 2020-10-07T06:05:41+05:30 IST