సమతూకం.. వ్యూహాత్మకం

ABN , First Publish Date - 2020-09-28T19:46:31+05:30 IST

పార్టీకి కొందరు సీనియర్లు దూరం కావటం, మరికొందరు రాజకీయంగా..

సమతూకం.. వ్యూహాత్మకం

లోక్‌సభ నియోజకవర్గాలకు

అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ 

బాపట్లకు ఏలూరి, ఒంగోలుకు నూకసాని

తిరుపతి, చిత్తూరులకు కోఆర్డినేటర్‌గా డాక్టర్‌ ఉగ్ర

ఒంగోలు, నెల్లూరుకు జనార్దన్‌రెడ్డి  

మాజీ అధ్యక్షుడు దామచర్లకు దక్కని చోటు 

ముఖ్యులతో భేటీ అయిన సాంబశివరావు


ఆంధ్రజ్యోతి, ఒంగోలు: పార్టీకి కొందరు సీనియర్లు దూరం కావటం, మరికొందరు రాజకీయంగా చురుగ్గా ఉండకపోవడం నేపథ్యంలో పదవుల భర్తీ విషయంలో టీడీపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పనితీరు, నిబద్ధతను ప్రామాణికంగా తీసుకోవడంతోపాటు సామాజిక సమతూకానికి ప్రాధాన్యం ఇచ్చింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీ పార్టీ అధ్యక్షులు, కోఆర్డినేటర్ల నియామకం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.


బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు, ఒంగోలుకు అధ్యక్షుడిగా జిల్లా పరిషత్‌ మాజీ  వైస్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీని నియమించారు. చిత్తూరు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్‌ బాధ్యతలు కనిగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డికి అప్పగించారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రకటించారు. వీరి నియామకం పట్ల ఎక్కడా వ్యతిరేకతలు, అసంతృప్తులు కన్పించలేదు. ఇదిలా ఉండగా ఒంగోలు, నెల్లూరు లోక్‌సభలకు కోఆర్డినేటర్‌గా కర్నూలు జిల్లా బనగానిపల్లి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డిని నియమించారు. 


లోక్‌సభ నియోజకవర్గాలను యూనిట్‌గా తీసుకున్న టీడీపీ, పదవుల ఎంపికలోనూ నూతన ప్రక్రియకు శ్రీకారం పలికింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా ఉండటంతోపాటు క్యాడర్‌, ప్రజల కు అండగా ఉన్న వారిని గుర్తించి వారిలో ముందుకు వచ్చిన వారికి పెద్దపీట వేసింది.  అదే సమయంలో సామాజికవర్గాల సమతూకానికీ ప్రాధాన్యం ఇచ్చింది. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ని నియమించారు. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా నూకసాని బాలాజీని, తిరుపతి, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్‌గా పార్టీ కనిగిరి నియో జకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డిని నియమించారు. ఒంగోలు లోక్‌సభ నియో జకవర్గ అధ్యక్షుడిగా తొలుత డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి పేరుని ఖరారు చేశారు. ఆ మేరకు ఆయనకు సమాచారం కూడా పంపారు. సామాజికవర్గాల సమతూకాన్ని దృష్టిలో ఉంచుకుని బాలాజీకి అవకాశం కల్పించారు. 


అధినేత తీవ్ర కసరత్తు 

పదవుల ఎంపిక విషయంలో అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు చేశారు. జిల్లాలో ఆ పార్టీకి సీనియర్లుగా ఉన్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, చీరాలకు చెందిన ఎమ్మెల్సీ సునీత వైసీపీలో చేరిపోయా రు. అదే సమయంలో టీడీపీలో ఉండి గ్రానైట్‌ వ్యాపారం చేసుకుంటున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం పలికింది. చివరికి వారి క్వారీలను మూసివేయించింది. ఈ నేపథ్యంలో జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించిన చంద్రబాబు మొత్తం పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఇటీవలే ని యోజకవర్గాల వారీ కూడా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల పరిస్థితిపై సమాచారాన్ని అధిష్ఠానం సేకరించుకుంది. వాటన్నింటినీ పరిశీలించిన చంద్రబాబు ఏలూరి, నూకసాని, ఉగ్రకు పదవు లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 


బాలాజీకి కత్తిమీద సామే 

ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన  బాలాజీకి బాధ్యతల నిర్వహణ  కత్తిమీద సాములా మారనుంది. ఒంగోలులో పార్టీకి సొంత కార్యాలయం కూ డా లేదు. ప్రస్తుతం దామచర్ల కుటుంబానికి సంబంధించిన స్థలంలో అది నడుస్తోంది. దాన్ని ఖాళీ చేయాలని జనార్దన్‌ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంది. దీంతో అత్యవసరంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.


విద్యావంతుడు కావడంతోపాటు, నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసే నాయకుడిగా నూకసానికి అధిష్ఠానం వద్ద గుర్తింపు ఉంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పార్టీ బాధ్యులను సమన్వయం చేసుకుని ముందుకు నడవటం ఆయనకు కత్తిమీద సాములాగే కనిపిస్తోంది. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో బలహీనవర్గాల్లో యాదవ సామాజికవర్గం ఓటర్ల ప్రభావం అధికం గా ఉంటుంది. దాదాపు ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలోనూ ఆ వర్గం గణనీయంగా ఉంది. అదే సామాజికవర్గానికి చెందిన బాలాజీకి వారితో సన్నిహిత సంబంధాలున్నాయి. దానినే బలమైన ఆయుధంగా మార్చుకోవాలన్న టీడీపీ వ్యూహం ఎంతమేరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది.


ఏలూరి పట్ల పూర్తి సానుకూలత 

బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన ఏలూరి సాంబశివరావుకి ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నాయకులతో విస్తృత పరిచయాలున్నాయి. ఆయన నియామకం పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి పూర్తి సానుకూలత వ్యక్తమవుతోంది. అద్దంకి, బాపట్ల ఎమ్మెల్యేలు రవికుమార్‌, సత్యప్రసాద్‌, మాజీమంత్రి నక్కా ఆనందబాబు పేరుని కూడా పరిశీలించిన అనంతరం అందరి సూచనతో ఏలూరికి అవకాశం ఇచ్చారు. పార్టీ, ప్రజాసేవ విషయంలో నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకుపోగల సమర్థుడన్న పేరు డాక్టర్‌ ఏలూరికి ఉంది. అధ్యక్షుడిగా ఏలూరిని అధిష్ఠానం ప్రకటించిన కొద్ది గంటలకే చిలకలూరిపేటలోని ఎమ్మెల్యే రవికుమార్‌ ఇంట్లో ఏలూరితోపాటు, రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ భేటీ అయ్యారు.  అన్ని నియోజకవర్గాల పార్టీ నేతలతో ఏలూరికి సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా ఆయనకు కలిసిరానుంది.


అధినేత గుర్తింపు పొందిన డాక్టర్‌ ఉగ్ర

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి గుర్తింపు పొందటమే గాక పార్టీ శ్రేణుల మద్దతు సాధించిన వారిలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ముందున్నారు. గత ఎన్నికలకు ముందుగా ఆయన్ను టీడీపీలో చేర్చుకుని కనిగిరి నుంచి రంగంలోకి దింపారు. ఎన్నికల్లో ఓటమి చెందినా ఆ మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకూ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కనిగిరి నియోజకవర్గాన్ని ఆయన తొలి స్థానంలో నిలిపారు.  ఆయన్ను ఒంగోలు లోక్‌సభ అధ్యక్షుడిగా నియమించాలని తొలుత చంద్రబాబు భావించినప్పటికీ వెనుకబడిన తరగతుల వారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్రస్థాయికి తీసుకున్నారు. చంద్రబాబు సొంత జిల్లా అయిన తిరుపతి, చిత్తూరు లోక్‌సభలకు కోఆర్డినేటర్‌గా ఆయన్ను నియమించారు. 


జనార్దన్‌ను పక్కన పెట్టిన అధిష్ఠానం 

పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోవటం, ప్రజలకు అందుబాటులో ఉండని నేతలను పదవులకు దూరంగా ఉం చాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆ మేరకే ప్రస్తుత అధ్యక్షుడు జనార్దన్‌కు బాధ్యతలు అప్పగించలే దని సమాచారం. ఆయనకు ఒంగోలు, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయకర్త పదవి ఇవ్వాలని కొందరు చంద్రబాబుని కోరినట్లు కూడా తెలిసింది. ఎన్ని ఇబ్బందులున్నా ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాలకు హాజరుకాని నేతలకు అవకాశం ఇచ్చే ప్రశ్నే లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. 


ప్రజావ్యతిరేక  పాలనపై పోరాటం: ఏలూరి సాంబశివరావు, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలపై పోరాటానికి ప్రజలను సమాయత్తం చేస్తా. అధినేత చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయను. నాకు సమస్యలు ఎదురవ్వొచ్చు. ప్రభుత్వం మరింతగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయవచ్చు. అయినా పార్టీ, ప్రజలే మాకు ముఖ్యం. పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి ధైర్యంగా ముందుకుపోతా. బాపట్ల కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ పనిచేస్తా. ఎక్కడికక్కడ ఉన్న లోపాలను సవరించుకుంటూ భవిష్యత్‌లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల  విజయమే లక్ష్యంగా పని చేస్తా. 


ప్రజాచైతన్యానికి ప్రాధాన్యం: డాక్టర్‌ నూకసాని బాలాజీ, ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు

ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తా. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభలోని అన్ని అసెంబ్లీ స్థానాలలో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా. వెనుకబడిన తరగతుల వారిని ఆరంభం నుంచి ప్రోత్సహిస్తున్నది టీడీపీయే. ఆ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు నాకు పదవి ఇవ్వడం ద్వారా మరోసారి నిరూపితమైంది. ఆ విషయాలన్నింటినీ తెలియజేసి బలహీనవర్గాల వారిని సమీకరించే ప్రయత్నం చేస్తా. అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలను సమన్వయం చేసుకుని పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా. 


పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేస్తా: డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి, తిరుపతి, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గాల కోఆర్డినేటర్‌

పార్టీ, మా అధినేత చంద్రబాబు ఆదేశించిన ప్రతి పనిని దిగ్విజయంగా నిర్వహిస్తా.  తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణతో ముందుకు సాగే క్యాడర్‌ ఉండటం పెద్ద వరం. నేను టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న కనిగిరి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతోపాటు అధికారపార్టీ దౌర్జన్యాలు, అక్రమాలకు గురవుతున్న వారందరినీ ఆదుకునే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతా. కనిగిరికి ఇచ్చినంత ప్రాధాన్యాన్ని తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాల పార్టీ పనులకు ఇచ్చి పదవికి న్యాయం చేస్తా. 




Updated Date - 2020-09-28T19:46:31+05:30 IST