బకాయిల షాక్‌!

ABN , First Publish Date - 2021-03-07T07:01:03+05:30 IST

గడువులోగా కరెంట్‌ బిల్లు చెల్లించకపోతే ట్రాన్స్‌కో అపరాధ రుసుం విధిస్తుంది. ఆ తర్వాత కూడా స్పందించకపోతే కనెక్షన్‌ కట్‌ చేస్తుంది.

బకాయిల షాక్‌!

జిల్లాలో ట్రాన్స్‌కోకు రూ.408 కోట్ల విద్యుత్‌ బిల్లుల బకాయిలు
ఏళ్లతరబడి ఉలుకూ పలుకు లేని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు
తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, బాకీలు కట్టాలంటూ ఆయా శాఖలకు ట్రాన్స్‌కో నోటీసులు
అటు ప్రభుత్వ విభాగాలను ఆదేశించాలంటూ కలెక్టర్‌కు లేఖ రాసిన ఎస్‌ఈ
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
గడువులోగా కరెంట్‌ బిల్లు చెల్లించకపోతే ట్రాన్స్‌కో అపరాధ రుసుం విధిస్తుంది. ఆ తర్వాత కూడా స్పందించకపోతే కనెక్షన్‌ కట్‌ చేస్తుంది. ఇదీ సామాన్యుడి విషయంలో ట్రాన్స్‌కో వ్యవహరించే తీరు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల దగ్గరకు వచ్చేసరికి ఈ స్పీడు ఉండడం లేదు. ఏళ్లకు ఏళ్లు ఇవి బకాయిలు చెల్లించకపోయినా ఎంచక్కా విద్యుత్‌ సరఫరా చేస్తోంది. ఎలాగూ సరఫరా కొనసాగుతుందనే ధీమాతో ఆయా ప్రభుత్వ శాఖలు కూడా బకాయిలు కట్టడం లేదు. ఇలా జిల్లావ్యాప్తంగా గడిచిన నాలుగేళ్లలో పేరుకుపోయిన బకాయిలు.. అక్షరాలా రూ.408 కోట్లు. దీంతో ఇప్పుడు ట్రాన్స్‌కో అధికారులు తీరిగ్గా ప్రతి ఒక్కరికి నోటీసులు పంపుతున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్‌కు ఎస్‌ఈ లేఖ రాశారు. ఈపీడీసీఎల్‌ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, బకాయిలు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిల్లో అత్యధికం పంచాయతీలవే ఉన్నాయి. వీటికి ఏటా ఆర్థిక సంఘం నిధులు వస్తున్నా విద్యుత్‌ బిల్లులు చెల్లించడంలో వెనుకబడ్డాయి. ఇటీవల కాలంలో ఏపీఈపీడీసీఎల్‌ ఆర్థిక పరిస్థితి దిగజారడం, విద్యుత్‌ కొనుగోళ్ల భారం పెరగడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా ట్రాన్స్‌కో అధి కారులు బకాయిల వసూళ్లపై గట్టిగా దృష్టిసారించారు. బకాయిలున్న ప్రభుత్వ కార్యాలయాలు, మంచినీటి పథక నిర్వహణ ఏజన్సీలకు నోటీసులు జారీచేశారు. రెండు వారాలుగా ఈ తంతు కొనసాగుతోంది. ఈనెలాఖరులోగా బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్లు కట్‌ చేస్తామంటూ అందులో హెచ్చరించారు. ఇటు జిల్లావ్యాప్తంగా పేరుకుపోయిన బకాయిలు వసూలయ్యేలా చూడాలని, ఆయా శాఖలు బిల్లులు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ట్రాన్స్‌కో ఎస్‌ఈ కలెక్టర్‌కు తాజాగా లేఖ రాశారు. అందులో ఆయా విభాగాల వారీగా ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిల జాబితా ప్రస్తావించారు. జిల్లాలో 1,075 పంచాయతీలకుగాను రూ.258,75 కోట్లు విద్యుత్‌ బిల్లులు బకాయిలు అత్యధికంగా పేరుకుపోగా, నీటిపారుదలశాఖ, ఏపీఎస్‌ఐడీసీ విభాగాలు కలిపి రూ. 74.26 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాశాఖకు రూ.41.95 కోట్లు, తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాలు, ఇతర రెవె న్యూ విభాగాలకు సంబంధించి రూ.7.08 కోట్లు, మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల బకాయిలు రూ.5.38 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ బకాయిలు రూ.4.58 కోట్లు, విద్యాశాఖ రూ.3.78 కోట్లు, వైద్యఆరోగ్యశాఖ రూ.2.36 కోట్లు, పోలీసుశాఖ రూ.1.79 కోట్లు, మున్సిపల్‌ పరిపాలనశాఖ రూ.1.11 కోట్లు, రవాణాశాఖ రూ.94 లక్షలు, సాంఘికసంక్షేమశాఖ రూ.87 లక్షలు, ఎన్టీఆర్‌ సుజల పథకం రూ.55.55 లక్షలు, స్త్రీశిశు సంక్షేమశాఖ రూ.42.02లక్షలు, వ్యవసాయ, సహకారశాఖలు రూ.40.30లక్షలు, పర్యాటకశాఖ రూ.35.19 లక్షలు, పశుసంవర్థకశాఖ రూ.15.03 లక్షలు, న్యాయశాఖ రూ.10.91 లక్షలు ఇలా మొత్తం 31 ప్రభుత్వ శాఖలు, విభాగాల బిల్లు బాకీలు రూ.408 కోట్ల వరకు పేరుకుపోయాయి. అయితే ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగింపునకు రావడంతో ట్రాన్స్‌కో నోటీసులు పంపుతోంది. దీనిపై ట్రాన్స్‌కో ఎస్‌ఈ మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధులు అందడంతో బాకీలు వసూలవుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2021-03-07T07:01:03+05:30 IST