ఆర్‌ఐవోగా బాలకృష్ణమూర్తి బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-12-02T06:34:10+05:30 IST

ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐవో)గా మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జి.బాలకృష్ణమూర్తి బుధవారం బాధ్యతలు చేపట్టారు.

ఆర్‌ఐవోగా బాలకృష్ణమూర్తి బాధ్యతల స్వీకరణ
ఆర్‌ఐవో, డీవీఈవోలను అభినందిస్తున్న అధ్యాపకుల సంఘం నేతలు

తిరుపతి(విద్య), డిసెంబరు 1: ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐవో)గా మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జి.బాలకృష్ణమూర్తి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఆర్‌ఐవోగా ఉన్న వి.శ్రీనివాసులురెడ్డిని జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి (డీవీఈవో)గా నియమించారు. ఆయన స్థానంలో బాలకృష్ణమూర్తికు ఎఫ్‌ఏసీ ఆర్‌ఐవో బాధ్యతలు అప్పగిస్తూ ఇంటర్‌బోర్డు కమిషనరు శేషగిరిబాబు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ మేరకు వీరిద్దరూ బాధ్యతలను స్వీకరించారు. ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లోనూ ఉదయం, సాయంత్రం స్టడీఅవర్స్‌ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో దాదాపు 60శాతం సిలబస్‌ పూర్తికాగా.. ఫస్టియర్‌లో అన్ని సబ్జెక్టుల్లో దాదాపు నాలుగు అధ్యాయాలు పూర్తయినట్లు వివరించారు. కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ (ప్రథమ, ద్వితీయ) తరగతులు ఆలస్యంగా ప్రారంభంకావడంతో ఈఏడాది కూడా 30శాతం సిలబస్‌ తగ్గించారన్నారు. బోర్డు నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం విద్యాబోధన జరుగుతోందని పేర్కొన్నారు. అధ్యాపకులందరినీ సమన్వయం చేసుకుని సకాలంలో సిలబస్‌ పూర్తిచేసి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ కళాశాలలో చేరిన ప్రతివిద్యార్ధి ఉత్తీర్ణత సాధించేలా తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వీరిద్దరినీ ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకులసంఘం ఆధ్వర్యంలో పలువురు అధ్యాపకులు దుశ్శాలువా, పుష్ఫగుచ్ఛంతో అభినందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.తులసీరామరెడ్డి, కార్యదర్శి ఒ.నాగసురేశ్‌, కోశాధికారి రాజనాల, ప్రిన్సిపాళ్లు రెడ్డిరామరాజు, గోపాల్‌రెడ్డి, శ్రీధర్‌, అధ్యాపకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-02T06:34:10+05:30 IST